ఏప్రిల్ 16న చెన్నైలో శ్రీనివాస కళ్యాణం
ఏర్పాట్లను పరిశీలించిన టిటిడి అదనపు ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి
టిటిడి ఆధ్వర్యంలో ఏప్రిల్ 16న చెన్నైలోని ఐలాండ్ గ్రౌండ్ లో శ్రీనివాస కళ్యాణం జరుగనుంది. ఈ కళ్యాణం ఏర్పాట్లను ఆదివారం టిటిడి అదనపు ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు ఈఓ మాట్లాడుతూ చెన్నైలో శ్రీవారి కల్యాణం నిర్వహించేందుకు స్థానిక సలహా మండలి ఛైర్మన్ శ్రీ శేఖర్ రెడ్డి, ఇతర సభ్యులు ముందుకొచ్చారని తెలిపారు. దీనికి సంబంధించిన ప్రాథమిక ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించామన్నారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉండడంతో శాంతిభద్రతలు, ఇతర ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ, చెన్నై కార్పొరేషన్ ఉన్నతాధికారులతో త్వరలో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. శ్రీ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో బ్యారికేడింగ్, బ్యాక్ డ్రాప్ సెట్టింగ్ తదితర ఏర్పాట్లు జరుగుతాయన్నారు. టిటిడి నుంచి స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను వేంచేపు చేస్తామని, అర్చకులు, వేద పండితులు, అన్నమాచార్య కళాబృందం ఇతర విభాగాల అధికారులు సమన్వయంతో శ్రీనివాస కళ్యాణం నిర్వహిస్తామని తెలిపారు. కోవిడ్ ప్రభావం తగ్గిన నేపథ్యంలో ఈ కల్యాణంతో దేశవ్యాప్తంగా ధార్మిక కార్యక్రమాలు తిరిగి ప్రారంభించినట్టు అవుతుందన్నారు. ఈ కళ్యాణంతో తమిళ ప్రజలకు శ్రీవారి ఆశీస్సులు లభిస్తాయన్నారు.
శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణ పనుల పరిశీలన
అనంతరం అదనపు ఈవో చెన్నై జిఎన్ చెట్టి రోడ్డులో నిర్మాణంలో ఉన్న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని పరిశీలించారు. సివిల్, ఎలక్ట్రికల్ తదితర పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. నిర్ణీత వ్యవధిలో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.అదనపు ఈఓ వెంట స్థానిక సలహా మండలి ఛైర్మన్ శ్రీ శేఖర్ రెడ్డి, బోర్డు సభ్యులు డా. శంకర్, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, ఎస్వీబీసీ సిఈఓ శ్రీ సురేష్ కుమార్, ఎస్ఇ-2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, డిఇ శ్రీ రవిశంకర్ రెడ్డి, డిప్యూటీ ఈవో జనరల్ డా. రమణప్రసాద్, పిఆర్వో డా.టి.రవి తదితరులు ఉన్నారు.