ప్రతి రూపాయికీ లెక్క ఉంది
న్యూఢిల్లీలోని ఏపీ భవన్‌లో రాష్ట్ర ఆర్థిక మంత్రి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రెస్‌మీట్:
రూ.48 వేల కోట్లు ఎక్కడికీ పోలేదు
అన్నీ బుక్ అడ్జస్ట్‌మెంట్‌లో క్లియర్‌గా ఉన్నాయి
అదే విషయాన్ని లేఖలో వివరంగా చెప్పాం
అయినా టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది
అర్ధం లేని విమర్శలు. ఆరోపణలు. నిందలు
మాజీ ఆర్థిక మంత్రి వ్యాఖ్యలు ఆశ్చర్యకరం
ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వెల్లడి
టీడీపీ హయాంలోనూ బుక్ అడ్జస్ట్‌మెంట్ ఉంది
‘సీఎఫ్‌ఎంఎస్’ లో లోపాల వల్లే ఈ సమస్య
అసంపూర్తిగా ఆ విధానాన్ని అమలు చేశారు
ఇప్పుడు ఆ లోపాలు సవరించే ప్రయత్నం చేస్తున్నాం
అక్కౌంట్స్ వేరు. ఆడిటింగ్ వేరు. ఇది అందరికీ తెలుసు
ఆడిటింగ్‌లో అన్నీ క్లియర్‌గా అందరికీ తెలుస్తాయి
ప్రెస్‌మీట్‌లో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
ఆర్థిక మంత్రి ఇంకా ఏమేం చెప్పారంటే..:
ప్రతిపక్షానికి ఏం మాట్లాడాలో అర్ధం కావడం లేదు. ఎందుకంటే ఇక్కడ అంకెల గారడీ అనడానికి లేదు. కాబట్టి ఏదో ఒకటి అనాలన్న ఉద్దేశంతో లేనిపోని ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా మాజీ ఆర్థిక మంత్రి ఏకంగా రూ.48 వేల కోట్లు దుర్వినియోగం అయ్యాయని, తీసేసుకున్నారని అర్థం లేని ఆరోపణలు చేయడం హాస్యాస్పదం. ఎక్కడైనా అంత మొత్తానికి లెక్కలనేవి ఉండవా?
మన డబ్బు రూ.100 ఒక వేళ పొరపాటున వేరే ఖాతాలో పడితే, ఆ మర్నాడే దాన్ని బ్యాంక్ మేనేజర్ సరి చేస్తాడు. అలాంటిది ఏకంగా రూ.48 వేల ప్రజాధనాన్ని ప్రభుత్వ పెద్దలు తీసేసుకోవడం సాధ్యమేనా?
లోపాలతో సీఎఫ్‌ఎంఎస్:
అలాగే సీఎఫ్‌ఎంఎస్‌లో ప్రత్యేక బిల్లులేవీ లేవంటున్నారు. అసలు సీఎఫ్‌ఎంఎస్ అంటే ఏమిటి?. ‘కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్’. దాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? గత ప్రభుత్వం దీన్ని ఎస్‌ఏపీ ప్లాట్‌ఫామ్ కింద ప్రవేశపెట్టింది. అందుకు కొత్త సాఫ్ట్‌వేర్ కూడా తీసుకున్నారు.
అయితే ఏ విధానం అయినా కొత్తగా ప్రవేశపెట్టిన తర్వాత, వినియోగంలో చాలా సమస్యలు వస్తాయి. అవన్నీ సరిదిద్దుకుంటూ, మొత్తం వ్యవస్థలో దాన్ని పక్కాగా వినియోగించుకోవడానికి ఒక్కోసారి కొన్నేళ్లు తీసుకుంటుంది. అది సహజం. అలాగే సీఎఫ్‌ఎంఎస్‌లో లోపాలు సవరించడానికి కాస్త సమయం పడుతుంది. అయితే గత ప్రభుత్వం 2019 ఎన్నికలకు ముందు, చాలా హడావిడిగా ఆ సాఫ్ట్‌వేర్‌ను అసంపూర్తిగా అమలు చేశారు. మాది హైటెక్ ప్రభుత్వం అని చెప్పుకుంటూ అది అసంపూర్తిగా ఉండగానే అమలు చేశారు. ల్యాండ్ రికార్డ్స్ కూడా అలాగే చేశారు. దాని వల్ల ఇవాళ్టికి సమస్యలు వస్తున్నాయి.
ఎందుకీ సందేహాలు?:
కొన్ని ఎంట్రీలకు సంబంధించి, దాని కోట్స్ ప్రవేశపెట్టలేదు. అందరికీ తెలుసు. ఖాతాలు (అక్కౌంట్స్) వేరు. ఆడిట్ నివేదికలు (ఆడిట్ రిపోర్ట్స్) వేరు. తొలుత అక్కౌంట్స్ వస్తాయి. ఆ తర్వాత ఆడిట్ రిపోర్ట్స్ వస్తాయి.అయితే అక్కౌంట్స్‌లో వారేం చెప్పారంటే.. ఇవి క్వాలిఫైడ్ రిపోర్ట్ప్ అన్నారు. ఏమిటా క్వాలిఫైడ్ రిపోర్ట్స్ అంటే.. దీంట్లో కొన్నింటిపై మాకు క్లారిటీ లేదని అర్ధం. అందులో వారేం చెబుతున్నారంటే..ఒక పద్దులో రూ.26,839 కోట్లు, మరో పద్దులో రూ.9100 కోట్ల చిల్లర, ఇంకో పద్దులో రూ.8891 కోట్లకు సంబంధించి క్లారిటీ లేదన్నారు. అయితే వాటికి సంబంధించి గత ఏడాది అక్టోబరు 14న ఒక లేఖ రాశాం. ఆ రూ.48,509 వేల కోట్ల లెక్కలను అందులో చాలా స్పష్టంగా చెప్పాం.వాటిని స్పెషల్ బిల్స్ అంటుంటే, ట్రెజరీ కోడ్‌లో స్పెషల్ బిల్ అనే పద్దు లేదు. అయితే ఆ వినియోగానికి ఎలాంటి పేరు లేదు కాబట్టి..
ఉదాహరణకు:
మనం ఒక పని చేస్తున్నాం అనుకోండి. ఆ పని చేసే సమయంలో మధ్యలో పేరు లేకపోతే, తాత్కాలికంగా ఏదో ఒక పేరు పెట్టుకుంటాం. సరిగ్గా ఇక్కడా అలాగే స్పెషల్ బిల్స్ అని పేరు పెట్టారు.
రూ.48,509 కోట్ల లెక్కలు ఇవీ:
ఇప్పుడు ఆ మేరకు ఆ రూ.48,509 కోట్లకు సంబంధించిన వివరాలు చెబుతాను. మామూలుగా మనకు పీడీ (పర్సనల్ డిపాజిట్) ఖాతా అని ఉంటుంది. ఒక పనికి సంబంధించి బడ్జెట్ కేటాయించి.. ఆ తర్వాత బీఆర్ (బడ్జెట్ రిలీజ్) చేస్తే, అది పీడీ ఖాతాలో ఉంటుంది. దాన్నుంచి ఆ మొత్తాన్ని ఆ పని కోసం వ్యయం చేస్తాం. అయితే ఒకవేళ ఆ మొత్తాన్ని ఆ ఆర్థిక సంవత్సరం (మార్చి 31వ తేదీ) పూర్తయ్యే నాటికి పూర్తిగా వినియోగించకపోతే మిగిలిన మొత్తాన్ని వెనక్కి పంపిస్తాం.
అలా వెనక్కి పంపిన మొత్తమే ఒక పద్దు రూ.10,895 కోట్లు.
ఇంకా వివరంగా చెప్పాలంటే రాష్ట్ర అభివృద్ధి సంస్థ (ఎస్‌డీసీ) ద్వారా రూ.10,895 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. అయితే అంతకు ముందే అంత మేర రెగ్యులర్ కన్సాల్డేటెడ్ ఫండ్ నుంచి ఆ మొత్తం ఖర్చు చేయడంతో, ఎస్‌డీసీకి వచ్చిన ఆ మొత్తాన్ని వెనక్కి పంపించడం జరిగింది. అందువల్ల ఆ రూ.10,895 కోట్లకు సంబంధించి రెండు ఎంట్రీలు వచ్చాయి. ఇక మరొకటి.. రైతు భరోసా కింద రైతుల ఖాతాలకు ఈ–కుబేర్ ద్వారా నగదు బదిలీ చేయాల్సి ఉంటుంది. అయితే అది పూర్తి స్థాయిలో పక్కాగా అమలు కాకపోవడంతో ఆ నగదు కూడా వెనక్కి తీసుకోవడం జరిగింది.ఆ మొత్తం రూ.2727 కోట్లు. ఆధార్ నెంబర్ ఆధారంగా, రైతుల బ్యాంక్ ఖాతాలకు ఈ–కుబేర్ ద్వారా నగదు బదిలీ చేయడానికి ఆర్బీఐ సిద్ధంగా లేకపోవడంతో ఆ మొత్తం వెనక్కి తీసుకోవడం జరిగింది. అది కూడా రెండుసార్లు ఎంట్రీ అయింది.
ఇక మరొకటి.. ఒక పీడీ ఖాతా నుంచి మరో పీడీ ఖాతాకు నగదు బదిలీ చేసినప్పుడు వచ్చిన సమస్య. ఆ విధంగా రూ.4179 కోట్లు. చేయూత పథకం మొత్తాన్ని ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు మార్చాల్సి వచ్చింది. ఎందుకంటే ఎస్‌డీసీ తరహాలో అప్పటికే ఆ మొత్తం వ్యయం చేయడంతో, ఆ రూ.4179 కోట్లను మరో ఖాతాకు బదిలీ చేయడం జరిగింది.
ఇక మరో పద్దు. ఒక జిల్లా కేంద్రంలో ఒక అవసరం కోసం డిపాజిట్ చేసిన మొత్తాన్ని, మరో జిల్లాలో అవసరం కోసం బదిలీ చేసినప్పుడు ఆ పద్దు మారుతుంది. అలా ఒక పద్దుకు సంబంధించిన మొత్తం రూ.61 లక్షలు.
అలాగే స్థానిక సంస్థలకు కేంద్రం నిధులు. కేంద్రం గ్రామ పంచాయతీలకు నిధులు వస్తాయి. ఒక్కోసారి ఆ గ్రామ పంచాయతీ మున్సిపాలిటీగా మారితే, అప్పుడు కూడా ఖాతా మారుతుంది. ఆ విధంగా మారిన పద్దు మొత్తం రూ.14.32 కోట్లు.
కొత్త పెన్షన్ పథకానికి (ఎన్‌పీఎస్) సంబంధించి ఫండ్ మేనేజ్‌మెంట్‌కు బదిలీ చేసిన మొత్తం రూ.1.54 కోట్లు.
ఆ తర్వాత టీడీఎస్ ఆన్ జీఎస్టీ ట్రాన్సఫర్ టు జీఎస్‌టీఎన్ యాస్ పర్ ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్. ఆ మొత్తం రూ.224 కోట్లు. ఇదొక్కటే నగదు బదిలీ ప్రత్యక్షంగా జరిగింది.
బుక్ అడ్జస్ట్‌మెంట్.. అదెలా అంటే?:
జీఎస్టీ కింద కేంద్రానికి కట్టిన రూ.224 కోట్ల నగదు మినహా, మిగిలినవన్నీ బుక్ అడ్జస్ట్‌మెంట్ మాత్రమే.14వ ఆర్థిక సంఘం నుంచి స్థానిక సంస్థలకు వచ్చిన నిధులు. అవి పీడీ ఖాతాల్లో ఉంటాయి. అక్కణ్నుంచి అవి స్థానిక సంస్థలకు వెళ్తాయి. అయితే అప్పటికే ఆ స్థానిక సంస్థలు ఏమైనా బిల్లులు పెండింగ్‌లో పెడితే, ఆ మొత్తం నేరుగా ఆ ఖాతాలకు చెల్లింపు చేస్తారు. అది కూడా బుక్ అడ్జస్ట్‌మెంట్. ఆ తర్వాత ఒక్కోసారి డీడీఓలు, హెచ్‌ఓడీలు పొరపాటున ఎంట్రీలు చేస్తే, వాటిని కూడా మళ్లీ సంబంధిత ఖాతాలకు బదిలీ చేస్తారు.వివిధ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు లేదా కార్యక్రమాలకు సంబంధించిన నిధులు ఆ ఆర్థిక సంవత్సరం (మార్చి 31వ తేదీ) పూర్తయ్యే నాటికి వ్యయం చేయలేకపోతే అవి కూడా వెనక్కి వెళ్తాయి.
దుర్మార్గంగా నిందలు:
ఆ విధంగా మొత్తం రూ.48,509 కోట్లకు సంబంధించి ప్రతి ఒక్క రూపాయి వివరాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఒక్క, కేంద్ర ప్రభుత్వానికి కట్టిన రూ.224 కోట్ల జీఎస్టీ తప్ప. ఎందుకంటే ఆ మొత్తం నగదు బదిలీ నేరుగా జరిగింది కాబట్టి. అందువల్ల ఆ మొత్తం పోనూ మిగిలిన రూ.48,200 కోట్ల చిల్లర మొత్తానికి స్పష్టంగా లెక్కలున్నాయి. అవన్నీ బుక్ అడ్జస్ట్‌మెంట్ జరిగింది. ఆ వివరాలన్నీ చాలా స్పష్టంగా ఉన్నాయి. అయినప్పటకీ అన్యాయంగా, దుర్మార్గంగా ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు.
వారి హయాంలోనూ బుక్ అడ్జస్ట్‌మెంట్:
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు, అంటే 2018–19లో కూడా రూ.98,049 కోట్లకు సంబంధించి బుక్ అడ్జస్ట్‌మెంట్స్ అచ్చం ఇలాగే ఉన్నాయి. మరి దానికి వారేం సమాధానం చెబుతారు.
ఇవాళ సీఎఫ్‌ఎంఎస్‌లో ఈ ఎంట్రీలు లేవు. కాబట్టి బుక్ అడ్జస్ట్‌మెంట్. అదే పాత పద్ధతిలో ఉంటే, ట్రెజరీ వాళ్లు ప్రతి ఒక్క వివరం పద్దుల వారీగా స్పష్టంగా రాసేవాళ్లు. అందుకే ఇప్పుడు సీఎఫ్‌ఎంఎస్‌లో దాన్ని (బుక్ అడ్జస్ట్‌మెంట్) సవరించే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా చెప్పాలంటే, 2021లో కూడా రూ.54,183 కోట్ల బుక్ అడ్జస్ట్‌మెంట్స్ ఉన్నాయి.
ప్రైవేటు వ్యక్తి చేతిలో పెట్టారు:
సీఎఫ్‌ఎంఎస్ ప్రవేశపెట్టినప్పుడు అది అసంపూర్తిగా ఉంది. అయినా ఆనాడు 2019 ఎన్నికలకు ముందు హడావిడిగా దాన్ని మొదలు పెట్టారు. నిజానికి ఆనాడు సీఎఫ్‌ఎంఎస్ సీఈఓ ఒక ప్రైవేటు వ్యక్తి. మేము అధికారంలోకి వచ్చాక, ఆ బాధ్యతను ఐఏఎస్ అధికారికి అప్పగించాం.
ఆదాయం తగ్గినా..:
మళ్లీ టీడీపీ విమర్శ. ప్రభుత్వానికి ఆదాయం ఎక్కువ వచ్చిందని. అలా వాళ్లే ద్వంద్వ విధానంలో మాట్లాడుతున్నారు.
2018–19లో ప్రభుత్వానికి వివిధ పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం రూ.95,214 కోట్లు. ఏటా 10 శాతం పెంపుదల చూసుకుంటే, 2020–21 నాటికి ఆ ఆదాయం రూ.1,15,209 కోట్లు రావాలి. కానీ వాస్తవంగా వచ్చిన ఆదాయం కేవలం రూ.85,264 కోట్లు. అంటే దాదాపు రూ.30 వేల కోట్ల తక్కువ ఆదాయం వచ్చినా, కోవిడ్ సమయంలో పేదలను కాపాడాం.
రూ.48 వేల కోట్లు అంటూ దుష్ప్రచారం:
ఇంకా రూ.48 వేల కోట్లు దుర్వినియోగం అయ్యాయని ఆరోపిస్తున్నారు.ఒక్కసారి ఆ లెక్కలు చూద్దాం.
2020–21లో ప్రభుత్వ వ్యయం మొత్తం రూ.2,03,500 కోట్లు. అందులో వేతనాలు, పెన్షన్లకు రూ.66,500 కోట్లు. ఇంకా అప్పు కింద కట్టిన మొత్తం రూ.33,753 కోట్లు. ఇక ప్రభుత్వం అమలు చేసిన పథకాలన్నీ ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారానే జరుగుతున్నాయి. ఆ మేరకు ఆ ఏడాది రూ.65,500 కోట్లు. ఇవన్నీ పోగా మిగిలిన ఖర్చు రూ.37,774 కోట్లు. అందులో నాడు–నేడు వంటి కార్యక్రమాల ఖర్చు కూడా ఉంది. ఆ విధంగా స్పష్టంగా ప్రభుత్వ వ్యయం వివరాలు కనిపిస్తుంటే, ఏకంగా రూ.48 వేల కోట్లకు లెక్కలు లేవని ఎలా చెబుతారు?
టీడీపీ లెక్కలూ చూద్దాం:
ఇక మీ (టీడీపీ ప్రభుత్వ) హయాంలో చూస్తే.. 2018–19లో అప్పటి ప్రభుత్వం రూ.1.65 లక్షల కోట్లు ఖర్చు చేస్తే, అందులో దాదాపు రూ.54 వేల కోట్లు ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల మొత్తం ఉంటే, అప్పులు, వడ్డీల చెల్లింపులు మరో రూ.29 వేల కోట్లు కాగా, మిగిలిన రూ.82 వేల కోట్లు కనిపించని ఖర్చు. కానీ మా ప్రభుత్వంలో ప్రతి ఖర్చు స్పష్టంగా కనిపిçస్తున్నాయి.
‘చేబదులు’ ఎగ్గొట్టారు:
ఇక వేస్ అండ్ మీన్స్ (చేబదులు). మీరు కూడా రూ.59,868 కోట్లు వేస్ అండ్ మీన్స్ కింద తీసుకున్నారు. అప్పుడు కోవిడ్ వంటి మహమ్మారి కూడా లేదు. అదే మేము కోవిడ్ సమయంలో సామాన్యులను కాపాడడానికి తీసుకున్నాం.
2020–21లో వేస్ అండ్ మీన్స్ కింద మేము రూ.1,04,539 కోట్లు తీసుకుంటే, ఏడాది చివరి నాటికి ఒక్క రూపాయి కూడా పెండింగ్‌లో లేకుండా కట్టేశాం.కానీ మీరు 2018–19లో వేస్ అండ్ మీన్స్ తీసుకున్న రూ.59,868 కోట్లు తీసుకుని, అందులో రూ.139 కోట్లు పెండింగ్‌లో పెట్టారు. కానీ మేము ఒక్క రూపాయి కూడా బకాయి పెట్టలేదు.
ఓర్వలేక విమర్శలు:
కేంద్రం నుంచి నిధులు ఎక్కువ తెస్తున్నామని విమర్శిస్తున్నారు. ఆనాడు కేంద్రంలో, రాష్ట్రంలో అధికారం పంచుకున్న మీరు, మీకు చేతకాక నిధలు తెచ్చుకోలేకపోయారు. ఇప్పుడు మేము నిధులు సాధిస్తుంటే ఓర్చుకోలేకపోతున్నారు.
మేము అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పథకాలు అమలు చేస్తున్నాం. కానీ మీరేం కత్తెరలు, ఇస్త్రీపెట్టెలు ఇచ్చారు. మీరు ఒక బ్రిడ్జి ఐకాన్ అంటూ రూ.1400 కోట్లతో ప్రణాళిక వేస్తే, అదే మేము రూ.140 కోట్లతో బ్రిడ్జి కట్టి, మిగిలిన మొత్తం పేదలకు ఖర్చు చేస్తామంటున్నాం. అదే మా సిద్దాంతం.
ఎమర్జెన్సీ ఎందుకు పెట్టాలి?:
నేను ఉద్దేశపూర్వకంగా తప్పుపట్డటం లేదు. పూర్తి వాస్తవాలు, లెక్కలతో మీడియా ముందుకు వచ్చాను.2019లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు నెలలకే రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ పెట్టాలన్నారు. అది ఎందుకు పెట్టాలి? మీరు రూ.40 వేల కోట్ల బకాయిలు పెట్టి పోయినందుకు పెట్టాలా? మరో రూ.20 వేల కోట్లు డిస్కమ్‌ల పేరుతో తీసుకున్న అçప్పులకు ఆర్థిక ఎమర్జెన్సీ పెట్టాలా?. పోలవరం ప్రాజెక్టును రూ.20 వేల కోట్లతో పూర్తి చేస్తామని ఒప్పుకుని వచ్చారు. ఏ మాత్రం ఆలోచన లేకుండా ఒప్పుకున్నారు.రూ.10 లక్షల కోట్లతో నగరం (రాజధాని) కట్టాలని తలంచి, లక్ష కోట్లు అవుతుందని చెప్పి, అందులో తొలి దశలో రూ.50 వేల కోట్లు అవుతాయని చెప్పి, 5 ఏళ్లలో చేసిన ఖర్చు కేవలం రూ.5 వేల కోట్లు మాత్రమే. అందు కోసం ఆర్థిక ఎమర్జెన్సీ పెట్టాలా?. మేము కోవిడ్‌ను చక్కగా హ్యాండిల్ చేశాం. అందుకు ఆర్థిక ఎమర్జెన్సీ పెట్టాలా?.
అదేనా మీ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్?:
వాళ్ల ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ బాగుంది అంటున్నారు. కానీ ఒక్కసారి లెక్కలు చూస్తే..
వారు అధికారం నుంచి దిగిపోయిన ఏడాది, అంటే 2018–19లో వారు బడ్జెట్‌లో కేటాయించిన మొత్తం రూ.1,91,063 కోట్లు. కాగా, ఖర్చు చేసిన మొత్తం రూ.1,64,841 కోట్లు. అంటే 86 శాతం మాత్రమే వ్యయం చేశారు.
కాగా, 2020–21లో కోవిడ్ సమయంలో కూడా మా ప్రభుత్వం రూ.2,24,789 కోట్ల బడ్జెట్ పెడితే అందులో రూ.2,03,500 కోట్లు.. అంటే 90 శాతం ఖర్చు చేసింది.అదే విధంగా గత ఆర్థిక సంవత్సరం 2021–22లో రూ.2,29,779 కోట్ల బడ్జెట్ పెడితే, రూ.2,20,633 కోట్లు.. అంటే 96 శాతం వ్యయం చేశాం. మరి ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ ఎవరిది బాగుంది?
వీటన్నింటిపై సీబీఐ దర్యాప్తు కోరుదామా?:
సీబీఐ దర్యాప్తు కావాలంటున్నారు. ఓటుకు కోట్ల కేసులో పెడతామా?
సీఆర్డీఏ టెండరింగ్ చేశారో చూస్తే.. మూడు పార్టీలు. ఏ బీ సీ. ఎల్–1, ఎల్–2, ఎల్–3
ఎల్–1 వచ్చి 43.5 శాతం, దాని తర్వాత ఎల్–3 వచ్చి బీ కి వస్తాడు 44.5 శాతం. మళ్లీ ఎల్–2 వచ్చి సీ కి వస్తాడు 45 శాతానికి. దీన్ని చూసి ప్రపంచ బ్యాంక్ ఆశ్చర్యపోయింది.టిడ్కో ఇళ్ల నిర్మాణం కూడా అంతే. అవే కంపెనీలు, అదే వ్యయం. వీటన్నింటికి సీబీఐ దర్యాప్తు చేపడతామా?. మేము వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్‌కు పోతే 15 శాతం వ్యయం తగ్గింది. ఫైబర్ గ్రిడ్ ఫ్రాడ్‌కు సీబీఐ దర్యాప్తు చేపడతామా?
ప్రతి దానికి స్పష్టంగా లెక్క:
చివరగా, మరోసారి చెబుతున్నాను. అక్కౌంట్లకు సంబంధించి మూడు కేటగిరీలు ఉంటాయి. ఏ, బీ, సీ. ఏ కేటగిరీలో రూ.26,839 కోట్లు. ఇందులో పీడీ ఖాతాల బదిలీకి సంబంధించి రూ.10,895 కోట్లు రెండు ఎంట్రీలు ఉన్నాయి. (ఒకటి, మూడో ఎంట్రీ) రెక్టిఫికేషన్ ఆఫ్ హెడ్ ఆఫ్ ఎక్కౌంట్. రూ.507 కోట్లు. డెబిట్ టు కన్సాలిడేటెడ్ ఫండ్ రూ.4179 కోట్లు. బి–కేటగిరీలో రూ.9124 కోట్లు. అలాటే సీ–కేటగిరీలో రూ.8891 కోట్లు. అన్నింటి వివరాలు చాలా స్పష్టంగా రాశాం. వివరాలూ అందించాం. ఆడిటింగ్‌లో అన్నీ అందరికీ అర్ధమవుతాయి. నిజం చెప్పాలంటే సీఎఫ్‌ఎంఎస్‌లో వాటి ఎంట్రీ లేకపోవడం వల్ల సమస్య వచ్చింది. ఆ వివరాలతోనే లేఖ రాశాం.కాబట్టి, ఇకనైనా తెలుగుదేశం పార్టీ అర్ధం లేని విమర్శలు, నిందలు మానాలి. దుష్ప్రచారాన్ని వదలాలి అని ఆర్థిక మంత్రి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి కోరారు.