ప్రకాశంలో పెద్దిరెడ్డి..పశ్చిమ ప్రాంతంపై దృష్టి
అధికారపార్టీలో అభ్యర్థిత్వం కోసం ప్రయత్నాలు
ఈనెల 11న సీఎంతో భేటీ
రెండేళ్లు ముందుగానే ఏపీలో ఎలక్షన్ ఫీవర్ ప్రారంభమైంది. అధికారపార్టీ వైసీపీ, ప్రతిపక్ష పార్టీ టీడీపీలు ఇప్పటి నుంచి అసెంబ్లీ సెగ్మెంట్లలో గెలుపుగుర్రాల కోసం అన్వేషణ ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా వైసీపీలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం కనబడుతోంది. 2019 ఎన్నికల్లో 12 నియోజకవర్గాలకు గాను టీడీపీ అద్దంకి, పర్చూరు, చీరాల, కొండెపి నియోజకవర్గాల్లో గెలుపు బావుటా ఎగురవేసింది. టీడీపీకి అత్యధిక సీట్లు ప్రకాశంలోనే వచ్చాయి. ఈ దశలో రానున్న ఎన్నికల్లో 2019లో గెలిచిన సీట్లతో పాటు ఓడిన సీట్లను కూడా కైవసం చేసుకోవాలని వైసీపీ పట్టుదలతో ఉంది. దీని కోసం ఇప్పటినుంచే ఎమ్మెల్యేల పనితీరు, ప్రజల్లో పలుకుబడిని దృష్టిలో ఉంచుకుని సిట్టింగ్ స్థానాల నుంచి కొందరని తొలగించి కొత్త వారికి అవకాశమివ్వాలని పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీలో కీలక నేతగా వ్యవహరిస్తున్న పెద్దిరెడ్డి సూర్య ప్రకాష్ రెడ్డి పశ్చిమ ప్రాంతంలోని ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. జగన్ ప్రత్యక్ష రాజకీయాల్లో రావాలంటూ వైసీపీ ఆవిర్భావం కన్నా ముందే దర్శి నియోజకర్గంలోని కొత్తరెడ్డిపాలెం నుంచి శింగరకొండ ఆంజనేయస్వామి దేవస్థానం వరకు 43 కిలోమీటర్లు ఒక రోజు చెప్పులు లేకుండా పాదయాత్ర చేసిన పెద్దిరెడ్డి పార్టీలోని ప్రముఖలతో సత్సంబంధాలున్నాయి. ప్రజల ఆకాంక్ష, అవసరాల మేరకు మార్కాపురం జిల్లా ప్రకటించాలని కోరుతూ ఆందోళన చేపట్టారు. మార్కాపురం జిల్లా ఆవశ్యకతను సీఎం దృష్టికి తీసుకెళ్ళారు. భవిష్యత్ లో మార్కాపురం జిల్లా ఏర్పడుతుందనీ, ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని పెద్దిరెడ్డి చెబుతున్నారు. ఈనెల 11న బాపట్ల లో పర్యటించనున్న సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసి పశ్చిమ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారానికి ప్రయత్నించనున్నట్టు తెలిపారు.