జి-20 సదస్సులో చంద్రబాబు
ప్రధానమంత్రి మోడీతో మాటా మంతీ
ఢిల్లీ:- జి -20 భాగస్వామ్య దేశాల సదస్సు నిర్వహణపై ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన అఖిల పక్ష సమావేశంలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ప్రధాని మోదీ నేతృత్వం లో జి-20 దేశాలకు భారత దేశం అధ్యక్షత వహించడంపై చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ అధ్యక్షతన ఐక్యంగా సదస్సు నిర్వహించడం ద్వారా దేశ ఖ్యాతిని ఇనుమడింపచెయ్యాలని అన్నారు. సమావేశంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రసంగం ఇలా సాగింది. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకున్నాము. 2047 నాటికి భారత్ స్వాంతంత్ర్య దేశంగా అవతరించి 100 సంవత్సరాలు పూర్తి అవుతుంది. అప్పటికి మన దేశం ప్రపంచానికి నాయకత్వ ఇచ్చే స్థాయిలో ఉండాలి. మీ సారధ్యంలో ఈ లక్ష్యం దిశగా మనం సాగుతున్నాము. 2047 సంవత్సరానికి.. ..అంటే వచ్చే 25 ఏళ్లకు దేశం ఒక విజన్ రూపొందించుకోవాలి. తద్వారా దేశం లక్ష్యాలను చేరుకుంటుంది. యువశక్తి అనేది భారత దేశానికి ఉన్న అతిపెద్ద సానుకూల అంశం. ప్రపంచంలో మరే దేశంలో కూడా మన అంత యుక్త వయస్సు ఉన్న ప్రజలు లేరు. రెండోది నాలెడ్జి ఎకానమీ, ఇందులో టెక్నాలజీ పాత్ర ఎంతో ఉంది. టెక్నాలజీ ద్వారా నాలెడ్జి ఎకానమీని అన్ని స్థాయిలకు తీసుకువెళ్లాలి. మీ ఆలోచనలతో కింది స్థాయి వరకు ఇప్పటికే డిజిటల్ రంగం చేరువ అయ్యింది.
మనకున్న మానవ వనరులు, యువశక్తిని సరిగ్గా నిర్వహించుకోగలిగితే ప్రపంచానికి నాయకత్వం ఇచ్చే స్థాయికి దేశం చేరుకుంటుంది. 2047 నాటికి ప్రపంచంలో మొదటి లేదా రెండో స్థానానికి దేశం చేరుకుంటుంది. మీ నాయకత్వంలో అందుకు అనుగుణంగా లక్ష్య సాధన వైపు దేశం ప్రయాణిస్తోంది. ప్రపంచములో వున్న భారతీయులకు మీరు ఎంతో ప్రేరణ కలిగిస్తున్నారు. మీ స్ఫూర్తి తో వారు ప్రపంచంలో నాయకులుగా ఎదుగుతున్నారు. అత్యంత ప్రముఖ సంస్థల్లో కీలక స్థానాలకు చేరుకుంటున్నారు. వ్యాపార రంగములోను, రాజకీయ రంగము లోను రాణిస్తున్నారు.సరైన ప్రణాళికతో ప్రయాణం చేస్తే అధిక జనాభా అనేది మనకు భారంగా కాకుండా….వరంగా మారుతుందని…ఆదిశగా ప్రణాళికలు రచించుకోవాలని చంద్రబాబు తన ప్రసంగంలో అన్నారు. చంద్రబాబు ప్రస్తావించిన డిజిటల్ నాలెడ్జ్ అంశాన్ని ప్రధాని తన ప్రసంగంతో గుర్తుచేశారు. డిజిటల్ ఇండియా అవసరాన్ని ప్రధాని ప్రస్తావించారు. సమావేశం అనంతరం ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు ముచ్చటించారు.