సాయిచంద్ అర్థవంతమైన ప్రయత్నం!
యువతరం తోపాటు వర్తమాన సమాజానికి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగం స్ఫూర్తి, సంకల్పబలం, కార్యదీక్ష గుర్తు చేయాలని ప్రముఖ చలనచిత్ర నటుడు సాయచంద్ చేస్తున్న అర్థవంతమైన ప్రయత్నాన్ని మనం తప్పక అభినందించాలి.
పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ చేసుకుని అరవై తొమ్మిది సంవత్సరాలు గడిచిపోయాయి! అమరజీవి మద్రాసులో మైలాపూర్ లోనీ బులుసు సాంబమూర్తి ఇంటిలో 1952 డిసెంబర్ 15 న రాత్రి 11 గంటల 20 నిమిషాల సమయంలో తెలుగు వారికి రాజధానితో కూడిన రాష్ట్రం కావాలని తాను చరిత్రగా మిగిలారు. ఆ భవనం నేడు అమరజీవి బలిదానపు పోరాట గాథను గుర్తు చేస్తూ స్ఫూర్తినిస్తోంది.
ఆ మహాత్యాగిని ప్రస్తుత సమాజానికి గుర్తు చేయాలని ప్రముఖ నటుడు, ప్రఖ్యాత రచయిత గోపిచంద్ కుమారుడు సాయిచంద్ రేపు అంటే 2022 డిసెంబర్ 15 న మద్రాసులో పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ చేసుకున్న స్థలం శ్రీ పొట్టి శ్రీరాములు స్మారక భవనం నుంచి 70వ వర్థంతి సంవత్సరం మొదలవుతున్న సందర్భంగా కాలినడకన బయలు దేరి హైవేపై నెల్లూరు జిల్లాలో నడిచి పడమటి పల్లె చేరుతారు. ఇప్పుడు ప్రకాశం జిల్లా లో ఉండే పడమటి పల్లె పొట్టి శ్రీరాములు పూర్వీకుల స్వస్థలం.