సుబ్బారావు గుప్తా మెరుపు నిరసన
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులు తనపై దుర్మార్గంగా దాడి చేసి గాయపర్చి తీవ్రంగా అవమానించిన సంఘటన చోటుచేసుకుని ఏడాదయిన సందర్భంగా సుబ్బారావు గుప్తా ఒంగోలులోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మెరుపు నిరసన చేపట్టారు. ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ ముందు ప్రత్యక్షమై నిరసన చేపట్టారు. పోలీసులు వెంటనే అప్రమత్తమై గుప్తా నిరసనను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా గుప్తా మీడియాతో మాట్లాడుతూ తనకు న్యాయం చేకూరేంత వరకు ప్రజాస్వామ్యయుతంగా పోరాడుతూనే ఉంటానని తెలిపారు. తనపై దాడి చేయటమే కాకుండా అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారు.. తన ప్రాథమిక హక్కులను సైతం ఒంగోలులో భంగపరుస్తున్నారని ఆరోపించారు. ఒంగోలులో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమల్లో ఉందో, లేదో కూడా అర్ధం కావటం లేదన్నారు.