సీఎం గారూ..పెన్షన్ల తొలగింపు ఆపండి
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి నారా లోకేష్ బహిరంగ లేఖ
శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు
ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్
విషయంః- అడ్డగోలు నిబంధనలు, అబద్ధపు నోటీసులతో ఇష్టారాజ్యంగా పింఛన్ల తొలగింపు ఆపాలి
సీఎం గారూ….
అధికార పీఠం ఎక్కేందుకు పింఛన్ల పెంపు పేరుతో అవ్వాతాతలు, అనాథలు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు మీరు ఇచ్చిన హామీలు మరిచిపోయారా? గద్దె ఎక్కిన నుంచీ పింఛన్ల నయవంచనకి దిగారు. తెలుగుదేశం ప్రభుత్వం రూ.200 ఉన్న పింఛనుని పదిరెట్లు పెంచి రూ.2000 చేసింది. మీరు రూ.3000 పింఛను చేస్తామని హామీ ఇచ్చి మోసగించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వయోపరిమితి నిబంధనలతో సుమారు 18.75 లక్షల పెన్షన్లను రద్దు చేశారు. ఇప్పుడు మరోసారి పింఛన్ నయవంచనకి దిగడం మీకు న్యాయమా అని ప్రశ్నిస్తున్నాను. పెంచాల్సిన పింఛన్ సొమ్ము పెంచలేదు, ఏళ్లుగా వస్తున్న పింఛన్లనే రద్దు చేసేందుకు అడ్డగోలు నిబంధనలతో నోటీసులు ఇస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల మంది పింఛన్లను రద్దు చేయాలనుకోవడం చాలా అన్యాయం. 20 ఏళ్ల నుండీ పెన్షన్లు పొందుతున్న అవ్వాతాతలు, దివ్యాంగులు, వితంతువులు తమ ఆసరా తొలగించి ఉసురు తీయొద్దని వేడుకోవడం మీకు వినిపించడంలేదా ముఖ్యమంత్రి గారూ. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం మారడికోట పంచాయతీలో సెంటు భూమి లేని నిరుపేదలకు వేల ఎకరాలున్నాయని పింఛన్లు తొలగించారు. వారికి పింఛన్లు ఇవ్వొద్దు కానీ వేల ఎకరాలలో 90 శాతం మీరు తీసుకుని 10 శాతం భూములైనా ఇప్పించాలని కోరుతున్నాను. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో నిరుపేద మహిళ రామక్క ఇందిరమ్మ ఇంట్లో ఉంటూ కూలి పనులు చేసుకుంటోంది. ఆమెకు 158 ఇళ్లు ఉన్నాయంటూ నోటీసులు ఇచ్చింది మీ ఘనమైన సర్కారు. మీరు ధ్రువీకరించిన 158 గృహాలు రామక్కకి అప్పగించాలి. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కొమనాపల్లికి చెందిన సత్యశ్రీ భర్త మూడేళ్ల క్రితం మరణిస్తే, ఆయన ఇప్పుడు పన్ను కడుతున్నారని పింఛన్ నిలిపేశారు. మీరు పింఛను ఇవ్వకపోయినా ఫరవాలేదు కానీ, సత్యశ్రీ భర్తని బతికించి తీసుకురండి చాలు. పెన్షన్ తీసేశారనే ఆందోళనతో చిత్తూరు జిల్లాకి చెందిన శెట్టియార్ గుండెపోటుతో మృతి చెందారు. పోయిన ప్రాణం తీసుకురాగలరా? కాకినాడకి చెందిన శ్రీను సొంత స్థలంలో ఇల్లు కట్టుకున్నాడనే ఒకే ఒక కారణంతో పదేళ్ల నుంచి దివ్యాంగులైన పిల్లలకు ఇస్తున్న పింఛను నిలిపేయడం మానవత్వమేనా ముఖ్యమంత్రి గారూ! పింఛను తీసేయడానికి చూపిస్తున్న భూములు, భవనాలు, ఆస్తులన్నీ ఆయా లబ్దిదారులకు అందజేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఏళ్లుగా పింఛన్లు పొందుతున్న దివ్యాంగులు, వితంతువులకు ఇప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని కోరడం విడ్డూరమే. సదరం పత్రాలు జారీ నిలిపేసి, దివ్యాంగులు ఆ పత్రాలు తేవాలని నిబంధన పెట్టడం పింఛన్లకి కోత వేయడానికేనని స్పష్టం అవుతోంది. నిరుపేదలకు లేని కారు, పొలం, ఇల్లు, ఆస్తులు ఎలా సృష్టిస్తున్నారో అర్థంకావడంలేదు. కుటుంబంలో ఎవరో ఒకరు ఇన్‌కంట్యాక్స్ కడుతున్నారని, 300 యూనిట్ల విద్యుత్ వాడారని నిరాశ్రయులైన వారి పింఛన్లు తొలగించడం దారుణం ముఖ్యమంత్రి గారూ. మానవత్వంతో ఆలోచించండి. అవ్వాతాతల జీవితాలకు వెలుగునిచ్చే చిరుదీపాన్ని ఆర్పే ప్రయత్నం చేయొద్దు. దివ్యాంగులకు ఆసరాగా నిలిచిన పింఛనుని లాక్కోవద్దు. వితంతువుల జీవనానికి చేదోడు అయిన పెన్షన్ కోతతో వారికి గుండెకోత మిగల్చవద్దు. ఆపండి నోటీసులు. వెనక్కి తీసుకోండి దిక్కుమాలిన నిబంధనలు. పెన్షన్ల రద్దుని ఆపండి. ఇదివరకే రద్దు చేసిన పింఛన్లను పునరుద్ధరించండి.
…నారా లోకేష్
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి