దళిత బహుజనులు సంఘటితం కావాలి
భీమ్ భారత్ రాష్ట్ర అధ్యక్షుడు పాగళ్ల ప్రకాష్
అణచివేతకు గురవుతున్న దళిత బహుజనులు సంఘటిత శక్తులుగా ఎదగాల్సిన అవసరం ఉందని బహుజన ఉద్యమ నేత ఉగ్గం సాంబశివరావు అన్నారు. సోమవారం అరండల్ పేట లోని భీమ్ భారత్ కార్యాలయంలో కారంచేడు మృత వీరుల సంస్మరణ సభ జరిగింది. సాంబశివరావు మాట్లాడుతూ సంఘటన జరిగి నేటికీ 38 ఏళ్లు గడుస్తున్నా బడుగు బలహీన వర్గాల పై అగ్రవర్ణ భూస్వామి పెత్తందారులు అనేక రూపాల్లో అణచివేతలు కొనసాగిస్తున్నారనీ, దీనికి వ్యతిరేకంగా దళిత బహుజన కులాలు సంఘటతమై పరిపాలకులుగా ఎదిగిన రోజే ఈ దాడులు ఆగుతాయని అన్నారు. భీమ్ భారత రాష్ట్ర అధ్యక్షుడు పాగళ్ళ ప్రకాష్ అధ్యక్ష వహించి మాట్లాడుతూ కారంచేడు లో మారణ హోమం సృష్టించిన అగ్రవర్ణ భూస్వాములు రాజకీయ శక్తులుగా ఉన్నందునే వారికి సరైన శిక్షలు పడలేదని అన్నారు. రాష్ట్రంలో దళిత గిరిజనులపై జరుగుతున్న అత్యాచారాలు, అణిచివేతలకు వ్యతిరేకంగా ఆగస్టు 6 చుండూరు మారణ హోమం రోజు వరకు రాష్ట్రవ్యాప్తంగా పల్లె పల్లెనా దళిత బహుజన చైతన్య సమావేశాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల పున:ప్రారంభం కోసం భీమ్ భారత్ గ్రామస్థాయి నుంచి అణగారిన ప్రజాలని సంఘటిత పరిచేందుకు సన్నద్ధం కావాలని పాగళ్ళ ప్రకాష్ పిలుపునిచ్చారు. బీసీ కే పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ జే విద్యాసాగర్ మాట్లాడుతూ కారంచేడు ఉద్యమం దేశంలో అనేక చట్టాల రూపకల్పనకు ప్రేరణగా నిలిచిందన్నారు. భీమ్ భారత రాష్ట్ర ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు అంకం శ్యామ్, సామాజిక న్యాయవాది గంగోలు శామ్యూల్, భీమ్ భారత రాష్ట్ర నాయకులు జల్ది మోహన్. దొడ్డ ప్రసాద్. భీమ్ భారత్ జిల్లా నాయకులు ఎర్రగుంట్ల సుజాత రావు, పసుమర్తి రమేష్. ఎస్ కే బాజీ తదితరులు పాల్గొన్నారు.