బద్వేలులో అందుకే పోటీ
- రైతుల రక్తంతో ఓట్లు అడుగుతారా ?
- దౌర్జన్యాలను కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుంది
- ఎపిసిసి అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలాజానాథ్
- కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కమలమ్మ
ప్రజా స్వామ్యాన్ని కాపాడడం కోసం ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని, ప్రజాస్వామ్యం అంటే ప్రజలే అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ అన్నారు. ఈ ఎన్నిక ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు చాటి చెపుతామన్నారు. రెండు పార్టీల పరిపాలనను ప్రజలు చూసారు…స్థానిక ఎన్నికల్లో వారి అరాచకాలను చూసాం బెదిరింపులు…దౌర్జన్యాలకు ఈసారి ఎన్నికల్లో అడ్డుకట్ట వేస్తాం అని డాక్టర్ సాకే శైలజానాథ్ పునరుద్ఘాటించారు. గురువారం బద్వేల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధినిగా కమలమ్మ నామినేషన్ దాఖలు చేసారు. కాంగ్రెస్ అభ్యర్థిని కమలమ్మ సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఉమెన్ చాందీ ఆశీస్సులతో తప్పక విజయం సాధిస్తారన్న ధీమా వ్యక్తం చేసారు. ఈ ప్రాంతాన్ని కమలమ్మ పెద్ద ఎత్తున అభివృద్ది చేసారని, మళ్లి ప్రజల ఆశీర్వాదం కోసం కమలమ్మ ప్రజల్లోకి వస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ వల్లనే కడప జిల్లా నేడు నిండు కుండలా ఉందన్నారు. గతంలో కమలమ్మ ప్రజాప్రతినిధిగా కడప జిల్లా అభివృద్ధిలో భాగస్వాములయ్యారని చెప్పారు. ప్రజా స్వామ్యాన్ని బతికించడానికి ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని శైలజానాథ్ స్పష్టం చేసారు. రైతుల పైకి కారు ఎక్కించి నలుగురు చనిపోతే రైతుల పట్ల సానుభూతి చూపలేని ఈ పార్టీలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ లను అరెస్ట్ చేస్తే, రైతుల గురించి కన్నీరు కార్చలేని ఈ పార్టీలు వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గుర్తిస్తున్నారని అన్నారు. ఓట్లు వేయనివ్వకుండా అడ్డుకుంటే ఏం చేయాలో తమకు తెలుసనీ శైలాజానాథ్ పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో 36వేల ఓట్ల మెజారిటీ ఇచ్చారని అభ్యర్థిని కమలమ్మ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆధ్వర్యంలో మంచి నీరు, డబల్ రోడ్లు వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు బద్వేల్ లో జరిగాయని స్పష్టం చేసారు. కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రజలకు ఇళ్ళు కట్టించిందని, అభివృద్ధి చేసిందని కమలమ్మ అన్నారు.