జ్ఞానమనే ఆయుధంతో స్త్రీలపై హింస అంతం
- దళిత స్త్రీ శక్తి ఆధ్వర్యంలో స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా ప్రచారోద్యం
- డిసెంబర్ 10 వరకు 16 రోజుల పాటు ప్రచారోద్యమం
- విజయవాడ ప్రచారోద్యమ సభలో దళిత స్త్రీ శక్తి జాతీయ కన్వీనర్ గెడ్డం ఝాన్సీ
స్త్రీలపై కొనసాగుతున్న హింసను సమూలంగా అంతమొందించాలంటే వారి చేతికి జ్ఞానమనే ఆయుధాన్ని అందించటమే ఏకైక మార్గమని దళిత స్త్రీ శక్తి (డిఎస్ఎస్) జాతీయ కన్వీనర్ గెడ్డం ఝాన్సీ అన్నారు. ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం (UN WOMEN) పిలుపు మేరకు దళిత స్త్రీ శక్తి ఆధ్వర్యంలో సోమవారం విజయవాడలో స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా నిర్వహించిన ప్రచారోద్యమంలో ఆమె మాట్లాడారు. గడిచిన 18 సంవత్సరాలుగా నిరంతరాయంగా ప్రతి ఏడాది నవంబర్ 25 నుంచి డిసెంబరు 10 వరకు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రచారోద్యమం నిర్వహిస్తున్నట్టు ఝాన్సీ తెలిపారు. నవంబర్ 25వ తేదీని స్త్రీలపై అంతమొందించే దినం (international day for elimination of violence against women)గా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఆ పిలుపును అనుసరించి ఈ ఏడాది కూడా విజయవాడ నుంచి ప్రచారోద్యమానికి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామాలు, మండల, మండల పట్టణ కేంద్రాలతో పాటు మురికివాడలు, పాఠశాలలు, కాలేజీలు, కంపెనీల్లో కార్మికులతో వివిధ కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. మానవ హక్కుల దినోత్సవాలుగా 16 రోజుల పాటు నిర్వహించనున్న కార్యక్రమాల్లో ప్రభుత్వ అధికారులు, మేధావులతో పాటు ప్రజా సంఘాలు, మహిళా సంఘాల ప్రతినిధులను భాగస్వామ్యులను చేస్తున్నట్టు వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆమె బీజింగ్ లో స్త్రీలపై హింసుకు వ్యతిరేకంగా చేపట్టాల్సిన కార్యాచరణపై నిర్వహించిన సమావేశ వివరాలను సభ దృష్టికి తీసుకొచ్చారు. హింసకు గురయి వారికి అండగా ఉండాల్సిన వ్యవస్థ మన వద్ద లేదు.. దళిత ఆదివాసీ స్త్రీలకు న్యాయం పొందటం కంటే పూట గడవటమే కష్టంగా మారిందని ఝాన్సీ ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలు సన్మార్గంలో నడవాలంటే కుటుంబం ప్రధాన పోషించాలన్నారు. గ్రామ సభల నుంచి పార్లమెంటు దాకా రాజకీయ నేతలెవ్దరూ రాజ్యాంగ బద్దంగా నడవకపోవటం వల్ల వ్యవస్థలన్నీ గాడితప్పుతున్నాయన్నారు. స్త్రీలపై హింసను ఒంటరిగా ప్రశ్నిస్తే కుదరదు..సంఘటిత ఉద్యమాలు అవసరమని పిలుపునిచ్చారు. ఈ ప్రచారోద్యమాన్ని ట్రైకార్ జనరల్ మేనేజర్ ఎ.మణికుమార్ జెండా ఊపి ప్రారంభించారు. టెలిపకం జనరల్ మేనేజర్ తారా చంద్, ఏపీ ట్రాన్స్ కో డిప్యూటీ ఇంజనీర్ శైలజ, సిద్దార్ధ కాలేజీ ప్రిన్సిపల్ పద్మజలు ప్రసంగించారు. దళిత స్త్రీ శక్తి కో ఆర్డినేటర్లు రోజా, రాణి, రాజేష్, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళా నాయకులు పాల్గొన్నారు.