సమగ్ర కౌలు చట్టం తేవాలి
కౌలు రైతుల రక్షణ, సంక్షేమానికి చర్యలు చేపట్టాలి
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ
విజయవాడ: రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా కౌలు రైతులకు అన్యాయం చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ధ్వజమెత్తారు.మంగళవారం ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం ఆధ్వర్యంలో విజయవాడలోని దాసరి భవన్ లో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె కాటమయ్య అధ్యక్షతన “కౌలు రైతుల సమస్యలు- రాష్ట్ర ప్రభుత్వ విధానాలు” అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా కె రామకృష్ణ హాజరై ప్రసంగాన్ని కొనసాగిస్తూ కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని, వారికి అన్నదాత సుఖీభవ రాకుండా ఎగొట్టేశారని మండిపడ్డారు. పంట రుణాలు కౌలురైతుల దరి చేరడం లేదన్నారు. నాడు అధికారంలో లేనప్పుడు ప్రస్తుత ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కౌలురైతులకు వ్యక్తిగతంగా డబ్బులు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన ఈ ఏడాదిలో కౌలు రైతుల గురించి కనీసం ఒక్కమాటైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగాభివృద్ధిలో కౌలు రైతులు వెన్నెముఖగా నిలుస్తున్నారని, అలాంటి కౌలు రైతుల సంక్షేమం, వారికి రక్షణ కోసం సమగ్రమైన చట్టం తేవడంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో ఉందన్నారు. ఎక్కడా కౌలు రైతుల సమస్యలపై ప్రభుత్వంగానీ, అధికారులుగానీ స్పందించడంలేదని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వారికి తక్షణమే గుర్తింపు కార్డులు ఇవ్వాలని, అన్నదాత సుఖీభవ అందించాలని, వారి రక్షణ కోసం సమగ్రమైన కౌలుచట్టం తేవాలని డిమాండ్ చేశారు.
రిజర్వ్ బ్యాంక్ నిబందనలు పట్టించుకోని బ్యాంకులు : వడ్డే
మాజీ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు, రైతుసంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వడ్డే శోభనాద్రిశ్వరరావు మాట్లాడుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధన ప్రకారం రెండు లక్షల రూపాయల వరకు ఎటువంటి షూరిటీ లేకుండానే పంట రుణాలు జారీ చేయాలని ఆదేశాలు ఉన్నప్పటికీ ఏ బ్యాంకు అమలు చేయకపోవడం దుర్మార్గమన్నారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్స్ కమిటీ ఆధ్వర్యంలో పంటల రుణ ప్రణాళిక విడుదల చేసేటప్పుడు ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని కౌలు రైతులకు పంటల రుణాలు ఇచ్చే విధంగా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సంవత్సరం రాష్ట్రలో ఏ పంటకి గిట్టుబాటు ధర రాలేదని, కనీసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కూడా దక్కలేదని దీనివల్ల కౌలురైతులే తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవివి ప్రసాద్ మాట్లాడుతూ కౌలురైతుల పండిస్తున్న అన్ని పంటలకు ఉచిత పంటలు భీమా పథకం వర్తింపజేయాలని,ప్రకృతి విపత్తులు సంభవించి పంటలకు నష్టం జరిగినప్పుడు ఇన్ పుట్ సబ్సిడీ, పంటల భీమా పరిహారం కౌలు రైతులకే అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో కౌలురైతుల తమ పంటలను అమ్ముకోవడానికి గుర్తింపుకార్డు లేదా సాగు ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని కోరారు.

రైతు స్వరాజ్య వేదిక జాతీయ నాయకులు విసాక్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ గ్రామ సభల్లోనే నేరుగా కౌరు రైతును గుర్తించి గుర్తింపు కార్డులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ పంట సాగుదారు హక్కుల చట్టం ప్రకారం భూ యజమాని లిఖితపూర్వకమైన ఒప్పందం రాసిస్తేనే కౌలు గుర్తింపు కార్డులు జారీ చేయాలని నిబంధన పెట్టడం వల్ల కౌలు గుర్తింపు కార్డు పొందటానికి ఆటకంగా మారిందన్నారు. ఈ చట్టాన్ని సవరిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఆచరణలో విస్మరించడం అన్యాయం అన్నారు.
కాంగ్రెస్ కిసాన్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు కె. ప్రభాకరరావు మాట్లాడుతూ వ్యవసాయ సంక్షోభం నుంచి కాపాడుతామని, రైతాంగాన్ని ఆత్మహత్యల నుండి రక్షిస్తామని, కౌలురైతులను ఆదుకుంటామని కూటమి ప్రభుత్వ చెప్పిన మాటలు నీటి మూటలగానే మిగిలిపోయాయన్నారు. ఆల్ ఇండియా కిసాన్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి. హరినాథ్ మాట్లాడుతూ కౌలురైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వక పోవడం వల్ల ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల దగ్గర నుండి ఆధిక వడ్డీలకు ఆప్పులు తెచ్చి సాగు చేస్తున్నారని వీరిని ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని విజ్ఞప్తి చేశారు. ప్రకాశం జిల్లా అభివృద్ధి వేదిక అధ్యక్షులు చుండూరు రంగారావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల చిన్న, సన్న కారు కౌలు రైతులు త్రీవంగా నష్టపోతున్నారన్నారు. దిగుమతి చేసుకుంటున్న వ్యవసాయ ఉత్పత్తులపై భారీగా సుంకాల పెంచి దేశీయ రైతంగాన్ని కాపాడాలని కోరారు. నల్లమడ రైతు సంఘం అధ్యక్షులు డాక్టర్ కొల్లా రాజమోహన్ మాట్లాడుతూ కౌలు రైతుల సమస్య భూ పంపిణీతో ముడిపడి ఉందని డాక్టర్ స్వామినాథన్ సూచించారన్నారు. స్వామినాథన్ సూచనలను కచ్చితంగా అమలు చేయాలని కోరారు. జాగృతి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు మరీదు ప్రసాద్ బాబు మాట్లాడుతూ ప్రతి ఏటా పెరుగుతున్న కౌలు రేట్లును నియంత్రించేందుకు ఒక ప్రత్యేక యంత్రంగాన్ని ఏర్పాటు చేయాలని, కౌలు పంట రూపంలో చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ఏఐకెఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు తూమాటి శివయ్య మాట్లాడుతూ కౌలురైతుల సమస్యల పరిష్కారానికి ఐక్య ఉద్యమాలు చేపట్టాలని కోరారు. రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కన్వీనర్ జి బాలు మాట్లాడుతూ దురదృష్టవశాత్తు ఆత్మహత్యలు పాల్పడిన కౌలురైతుల కుటుంబాలకు ఆదుకోవాలని, ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల చెల్లించే విధంగా కృషి కోరారు.
కౌలు రైతులకు సులభంగా గుర్తింపు కార్డులు, షూరిటీ లేని పంటరుణాలు అన్నదాత సుఖీభవ తదితర పథకాలు తక్షణమే అమలు చేయాలని, కౌలురైతుల రక్షణ సంక్షేమానికి నూతన సమగ్ర కౌలు చట్టాన్ని తీసుకురావాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రౌండ్ టేబుల్ సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. సమస్యల పరిష్కారానికి ఆగస్టు, సెప్టెంబర్ నెలలో దశలు వారిగా ఉద్యమాన్ని చేపట్టాలని సమావేశం నిర్ణయించింది.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.రవీంద్రనాథ్ ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్నీడి యలమందరావు,ఏఐకేఎఫ్ రాష్ట్ర నాయకులు కాసాని గణేష్ బాబు, ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు పి.చంద్రనాయక్, రైతు సంఘం గుంటూరు జిల్లా నాయకులు పచ్చల శివాజీ, కౌలు రైతుల సంఘం రాష్ట్ర నాయకులు కె. తిమ్మయ్య, టి.చౌడప్ప, దొంత కృష్ణ, పీవీ జగన్నాథం, మేకల డేవిడ్, పి లక్షాధికారి, పెయ్యల వెంకటేశ్వరరావు, నిమ్మగడ్డ వాసు, చంగల వెంకటేశ్వరరావు (చంటి)తదితరులు పాల్గొన్నారు.