ap news

మహిళలకు ఆర్టీసీలో ‘జీరో ఫేర్ టిక్కెట్’

మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు పథకంలో ‘జీరో ఫేర్ టిక్కెట్’

• మహిళలకు ప్రభుత్వం ఇస్తున్న రాయితీ వివరాలతో టిక్కెట్ల జారీ

• రాష్ట్రంలో ఇకపై ఏసీ ఎలక్ట్రానిక్ బస్సులు మాత్రమే కొనుగోలు

• సొంతంగా విద్యుత్ ఉత్పత్తి-చార్జింగ్ స్టేషన్లతోనే స్వయంసమృద్ధి

• ఆగస్ట్ 15 నుంచి పథకం అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం

అమరావతి, జూలై 21: ఆగస్టు 15 నుంచి మహిళలకు అమలు చేయనున్న ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకంలో మహిళలకు ‘జీరో ఫేరో టిక్కెట్‘ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఎక్కడ నుంచి ఎక్కడకు ప్రయాణం చేస్తున్నారు… ఉచిత ప్రయాణంతో ఎంతమేర వారికి డబ్బులు ఆదా అయ్యాయి… 100 శాతం ప్రభుత్వం ఇస్తున్న రాయితీ… వంటి వివరాలు ఆ టిక్కెట్‌లో పొందుపరచాలని చెప్పారు. జీరో ఫేర్ టిక్కెట్‌ ఇవ్వడం ద్వారా ఎంత లబ్దిపొందారనే విషయం రాష్ట్రంలోని మహిళా ప్రయాణికులు అందరికీ సులభంగా తెలుస్తుందని ముఖ్యమత్రి అన్నారు. ఇందుకు సంబంధించి సాఫ్ట్‌వేర్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సోమవారం సచివాలయంలో మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకంపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంతో ఏ ఏ రాష్ట్రాలకు ఆర్ధికంగా ఎంత భారం పడింది… మన రాష్ట్రంలో ఎంత వ్యయం కానుందనే అంశాలపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. ఎట్టిపరిస్థితుల్లో పథకాన్ని ఆగస్ట్ 15 నుంచి సమర్ధవంతంగా అమలు చేయాలని ఆదేశించారు.

ఆర్టీసీని లాభాల బాట పట్టించండి :

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం త్వరలో అమలు చేస్తున్నందున ఆర్టీసీకి భారం కాకుండా… ఇతర ఆదాయ మార్గాలు పెంపొందించుకోవడం, నిర్వహణా వ్యయం తగ్గించుకోవడం ద్వారా సంస్థను లాభాల బాట పట్టించాలని ముఖ్యమంత్రి సూచించారు. లాభాల ఆర్జనకు ఎలాంటి మార్గాలున్నాయి.. ఎటువంటి విధానాలు తీసుకురావాలి… అనే దానిపై ఒక కార్యాచరణ రూపొందించాలన్నారు. మరోవైపు రాష్ట్రంలో ఇకపై ఏసీ ఎలక్ట్రానిక్ బస్సులు మాత్రమే కొనుగోలు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి నిర్దేశించారు. ప్రస్తుతం ఉన్నవాటిని ఎలక్ట్రికల్ బస్సులుగా మారిస్తే నిర్వహణా వ్యయం తగ్గుతుందని… అలాగే ఇందుకు అవసరమయ్యే విద్యుత్‌ను సొంతంగా ఉత్పత్తి చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ డిపోల్లోనూ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసే అంశంపైనా అధ్యయనం చేయాలని సీఎం స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *