ap news

కడియం నర్సరీల అభివృద్ధి ద్వారా పర్యాటక ప్రోత్సాహం

పచ్చదనం, ఉపాధి రెండు లక్ష్యాలు

కడియం నర్సరీ రైతుల అభ్యున్నతికి కలెక్టర్ ప్రత్యేక దృష్టి

జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి

కడియం ప్రాంతాన్ని పర్యాటక పటములో ప్రత్యేకంగా నిలపాలని, అభివృద్ధి చేపట్టి నర్సరీ రైతులకు మేలు చేయాలని తాను ఆకాంక్షిస్తున్నట్టు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ లో కలెక్టర్ ఛాంబర్ జరిగిన సమీక్ష సమావేశంలో పర్యాటక, హార్టికల్చర్, రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖల అధికారులతో పాటు కడియం నర్సరీ అసోసియేషన్ ప్రతినిధులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, కడియం నర్సరీలు తూర్పుగోదావరి జిల్లాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయన్నారు. వాటిని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు పర్యాటక విధానంలో సమగ్ర అభివృద్ధి అవసరమన్నారు. బోటింగ్, స్టాల్స్, కాఫీ షాప్, కాటేజ్ లు , పాటింగ్ మిక్సర్ వ్యర్థాల నిర్వహణ, గ్రీన్ ఆర్గానిక్ వ్యర్థాల ఆధారంగా సేంద్రియ ఎరువుల తయారీ వంటి అనుబంధ కార్యకలాపాలు చేపట్టి ఆర్థికంగా నర్సరీ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాలన్నారు.

పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం పెంపులో భాగంగా, రాజమహేంద్రవరం ముఖ్య కూడళ్లలో మరియు రహదారి డివైడర్లలో మొక్కల సంరక్షణకు కడియం నర్సరీ అసోసియేషన్ ముందుకు రావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఇదే సమయంలో గ్రీన్ ఆర్గానిక్ వ్యర్థాల నుంచి సేంద్రియ ఎరువులు తయారు చేసి భూసారాన్ని పెంచే చర్యలు చేపట్టడం వల్ల వాణిజ్యపరంగా రైతులకు ప్రయోజనం చేకూరుతుందని, ఆర్ధికంగా కూడా వారిపై అదనపు ఆర్ధిక భారం ఉండదని వివరించారు.

పర్యాటక కేంద్రంగా ఈ ప్రాంతాన్ని తీర్చి దిద్దే క్రమంలో మొదటి దశలో పొట్టిలంక నుంచి కడియపు లంక వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేర 28 స్టాల్స్‌ను ప్రదర్శనతో పాటు విక్రయాలకు అనుగుణంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రతిపాదన కోసం లే అవుట్ సిద్ధం చేశామని, నర్సరీతో ముడిపడిన అనుబంధ రంగాలపై దృష్టి సారించి అభివృద్ధి జరగాలన్నారు. నర్సరీల పరిసరాల్లో కాటేజీలు ఏర్పాటు చేసి పర్యాటకులకు విడిది వసతి కల్పించడం, బోటింగ్‌కు ప్రత్యేక ఆర్చ్ నిర్మాణం, తదితర విషయాలపై కలెక్టర్ సమావేశం లో సమీక్షించారు.

ఆర్చ్ నిర్మాణానికి అవసరమైన వాస్తుశిల్పం, రూపకల్పన అంశాల్లో నిపుణుల సూచనలతో పర్యాటకుల అభిరుచికి అనుగుణంగా తీసుకోవాలని సూచించారు. ఈ విధంగా కడియం నర్సరీల అభివృద్ధి వల్ల పర్యాటకానికి తోడు నర్సరీ రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా నూతన మార్గాలు తెరుచు కుంటాయని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, ఏపీఏఎంఐపి పిడి ఏ. దుర్గేష్, జిల్లా హార్టికల్చర్ అధికారి ఎన్. మల్లికార్జున రావు, జిల్లా పర్యాటక అధికారి పి. వెంకటాచలం, కడియం తహసిల్దార్ ఎమ్. సునీల్ కుమార్, ఎంపీడీవో కె. రమేష్, ఎంపీపీ వెలుగు బంటి ప్రసాద్, కడియం నర్సరీ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గోపి, నర్సరీ రైతు జమీల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *