సూపర్ సిక్స్ – సూపర్ సక్సెస్
అన్నదాత సుఖీభవ పథకం నిధులు విడుదల చేసిన సీఎం
రైతుల ఖాతాలకు తొలివిడతగా రూ.7 వేల చొప్పున జమ
46,85,838 మంది రైతులకు రూ.3,175 కోట్ల మేర లబ్ది
రైతును రాజు చేయాలన్నదే కూటమి లక్ష్యం
టెక్నాలజీ ద్వారా పంటలపై సూచనలు
వచ్చే సీజన్‌కు వెలుగొండ ఫేజ్ 1 పూర్తి చేసి ప్రకాశం జిల్లాకు కృష్ణా నీళ్లు
రాజకీయ ముసుగేసుకున్న నేరస్తులతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి
అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ పథకం ప్రారంభించిన సీఎం చంద్రబాబు
దర్శి, ఆగస్టు 2: రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఏ పంట వేస్తే లాభాలు వస్తాయన్నది అధ్యయనం చేసి వారికి సూచనలు జారీ చేస్తామని వెల్లడించారు. సూపర్ సిక్స్ లో ప్రధాన హామీ అన్నదాత సుఖీభవ -పీఎం కిసాన్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రకాశం జిల్లా, దర్శి మండలం, వీరాయపాలెంలో ప్రారంభించారు. పచ్చని పొలాల్లో రైతుల మధ్య కూర్చుని ఈ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. కర్షక సోదరులతో కలిసి పథకాన్ని ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 46,85,838 మంది రైతుల ఖాతాల్లో రూ.7 వేలు జమ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి రైతులతో కాసేపు ముచ్చటించారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల అమల్లో గత ప్రభుత్వానికి…కూటమి ప్రభుత్వానికి గల వ్యత్యాసం ఎంత మేర ఉందో చూడాలని సీఎం అన్నారు. ఎన్నికల్లో చేసిన ప్రకటన మేరకు రైతులకు ఏటా రూ.20,000 వేలు ఇస్తామన్న హామీని నెరవేర్చామన్నారు. ఈ పథకం ద్వారా 3 విడతల్లో రైతులకు ఈ పథకాన్ని వర్తింప చేస్తామని సీఎం స్పష్టం చేశారు.

రైతుల కళ్లలో ఆనందం చూశా
అన్నదాత సుఖీభవ పథకాన్ని ఇలా పచ్చని పొలాలు, దేశానికి అన్నం పెట్టే రైతుల మధ్య ప్రారంభించడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందని ముఖ్యమంత్రి అన్నారు. ‘రైతు కళ్లల్లో ఆనందాన్ని నేరుగా చూస్తున్నాను. రైతు ఎప్పటికీ రాజే. కరోనా వంటి విపత్తులోనూ అన్నదాత నాగలి చేతపట్టి పొలంలో పనిచేశాడు. ఎన్ని కష్టాలున్నా రైతులు బాగుండాలనేది నా కోరిక. ఎన్నికలకు ముందు విధ్వంస, సైకో పాలనతో అందర్నీ ఇబ్బంది పెట్టి వారు ఆనందపడ్డారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టే సూపర్ సిక్స్ అమలు నాకు మాటల్లో చెప్పలేని సంతోషాన్నిస్తోంది. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రాష్ట్రంలోని 46,85,838 మంది రైతులకు లబ్ధి చేకూరింది. మొదటి విడతలో రాష్ట్ర వాటాగా ఒక్కో రైతుకు రూ.5,000 చొప్పున జమ చేశాం. దీనికోసం రూ.2,343 కోట్ల నిధుల్ని కేటాయించాము. మొదటి విడతలో కేంద్ర ప్రభుత్వం తన వాటాగా రూ.2,000 చొప్పున రూ.832 కోట్లు ఇస్తోంది. మొదటి విడతలో కేంద్రం-రాష్ట్ర వాటాలు కలిపి ఒక్కో రైతుకు రూ.7,000 జమ చేశాం. ఈ విడతలో రైతులకు రూ.3,175 కోట్ల మేర లబ్ది కలుగుతోంది.” అని సీఎం తెలిపారు.
సందేహాల నివృత్తికి పోర్టల్, టోల్ ఫ్రీ నెంబర్
పథకం అమలుకు సంబంధించి రైతులకు ఎలాంటి ఫిర్యాదులు, సందేహాలు ఉన్నా అన్నదాత సుఖీభవ పోర్టల్‌లోని ఆర్ఎస్ కే లాగిన్ ద్వారా తెలుసుకోవచ్చని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అలాగే 155251 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని అన్నారు. “అన్నదాత సుఖీభవ కింద ప్రకాశం జిల్లాకు రూ.186 కోట్లు ఇస్తున్నాం. జిల్లాలోని 2,65,317 లక్షల మంది రైతులకు ఈ పథకం ద్వారా లబ్ది కలుగుతోంది. అలాగే దర్శి నియోజకవర్గంలో 42,786 మంది రైతులకు రూ.29 కోట్లు ఇస్తున్నాం. దర్శి మండలంలో 10,972 మంది రైతులకు రూ.7.36 కోట్లు ఇస్తున్నాం. ఒక్క వీరాయపాలెంలోనే 476 మంది రైతులకు రూ.31,00,000 లక్షలు ఇస్తున్నామని సీఎం చంద్రబాబు వివరించారు.
సూపర్ సిక్స్ అమలు సంతోషాన్నిస్తోంది
రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లాం. ప్రజలు బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించారు. గత ప్రభుత్వం రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం చేసింది. చాలా సమస్యలు వచ్చాయి. ఎన్ని కష్టాలున్నా, ఇచ్చినమాట నిలబెట్టుకోవాలని సూపర్ సిక్స్ అమలు చేస్తున్నాం. నేను హామీ ఇచ్చినట్టే పెంచిన రూ. 4000 పింఛను గత ఏడాది ఏప్రిల్ నుంచే ఇచ్చాను. పింఛన్ల కోసం ఏడాదికి 64 లక్షల మందికి రూ. 32,134 కోట్లు ఖర్చు చేస్తున్నాం. గత ప్రభుత్వం ఐదేళ్లలో రూ.1000 మాత్రమే పెంచింది. భర్త చనిపోతే భార్యకు వితంతు పెన్షన్ ఎగ్గొట్టారు. ఎవరైనా లబ్దిదారులు రెండు నెలలు పింఛను తీసుకోకపోయినా మూడు నెలల మొత్తాన్ని ఒకేసారి ఇస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.

15వ తేదీ నుంచి ఉచిత బస్సు
తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ రూ.15 వేలు ఇచ్చాం. గత ప్రభుత్వం అందరికీ ఇస్తామని ఎన్నికల్లో చెప్పి తీరా గెలిచాక మాట మార్చి ఒక్కరికే పరిమితం చేశారు. దీపం పథకం కింద ఆడబిడ్డల జీవితాల్లో వెలుగులు నింపాను. దీపం కింద మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. ఇందుకోసం రూ. 2,700 కోట్లు వెచ్చిస్తున్నాం. ఈనెల ఆగస్టు 15న స్త్రీ శక్తి కింద ఆడబిడ్డలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తాం. దీని వల్ల రాష్ట్రంలోని 2 కోట్ల 60 లక్షలమంది మహిళలకు లబ్ధి చేకూరుతుంది. మీ పెద్దలు ఇచ్చిన ఆస్తి కంటే నేను నెలవారీ చేసే సాయమే ఎక్కువ. ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు పెట్టి రూ.5 కే భోజనం పెడుతుంటే గత ప్రభుత్వం క్యాంటీన్లను మూసేసిందని సీఎం చంద్రబాబు అన్నారు.
డ్రిప్ ఇరిగేషన్ లో దేశంలో ఏపీ టాప్
వ్యవసాయాన్ని నిలబెట్టేందుకు, రైతుల జీవితాలను బాగు చేసేందుకు ఈ ప్రభుత్వం అహర్నిశలు పనిచేస్తోంది. ఎరువులు, పురుగుమందుల వినియోగం తగ్గించి ఉన్నంతలో ప్రకృతి సేద్యం వైపు రైతులు వెళ్లాలి. ఈ ఏడాది పొలం పిలుస్తోంది కార్యక్రమం కింద 15,424 గ్రామాల్లో సమస్యలు పరిష్కరించాం. నేను డ్రిప్ ఇరిగేషన్ కింద రైతులకు 90 శాతం సబ్సిడీ ఇస్తే గత ప్రభుత్వం రద్దు చేసింది. డ్రిప్ ఇరిగేషన్ రాయితీని ఎస్సీ, ఎస్టీలకు 100 శాతానికి, రాయలసీమ-ప్రకాశం జిల్లాలో 90 శాతానికి, కోస్తాలో 70 శాతానికి పెంచాం. గతేడాది 1,17,880 హెక్టార్లకు డ్రిప్ విస్తరించాం. దీని వల్ల 1.11 లక్షల మంది రైతులు లబ్ది పొందారు. డ్రిప్ ఇరిగేషన్ లో ఏపీనే దేశంలో నెంబర్ వన్ గా ఉంది. ఆక్వా రైతులకు రూ.1.50కే యూనిట్ విద్యుత్ సరఫరా చేస్తున్నాం. మత్స్య కార సేవలో సాయాన్ని రూ.10,000 నుంచి రూ.20,000కు పెంచాం. దీని వల్ల 1,29,178 మత్స్య కార కుటుంబాలు రూ.259 కోట్లు అందించాం. 26 వేల మంది రైతులకు 50 శాతం రాయితీపై రూ.61 కోట్లతో వ్యవసాయ పనిముట్లు ఇచ్చాం. సాగుకోసం 875 కిసాన్ డ్రోన్లు త్వరలో సేవలు అందించనున్నాయి. ఈ ఏడాది బడ్జెట్లో మరో వెయ్యి కిసాన్ డ్రోన్లు సమకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.
కూటమిది రైతు ప్రభుత్వం
పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా డెల్టాకు నీరిచ్చాను. రైతులు ఏ వాతావరణంలో ఏ పంట వేయాలో , నీరు ఎప్పుడు ఇస్తామో ముందే చెబుతాం. దాని ప్రకారం పంట వేయమని కోరుతున్నాను. ఏపీ మార్క్ ఫెడ్ ద్వారా 20 మిలియన్ కేజీల పొగాకు కొనుగోళ్లు చేపట్టి రైతులు నష్ట పోకుండా చూశాం. ఇందుకోసం రూ.273 కోట్లు మంజూరు చేశాం. మామిడి రైతులకు కేజీకి రూ.4 చొప్పున అదనంగా ఇచ్చాం. మొత్తం 4,29,521 మెట్రిక్ టన్నుల మామిడి కొనుగోళ్లు పూర్తిచేశాం. 50,922 మంది రైతులకు రూ.172 కోట్లు చెల్లించాం. రైతుల పట్ల కూటమి ప్రభుత్వానికున్న చిత్తశుద్ధి ఇది. 2,358 మెట్రిక్ టన్నుల కోకో కొనుగోళ్లకు కేజీకి రూ.50 చొప్పున రూ.12 కోట్లు చెల్లించాం. మార్కెట్ ఇంటర్ వెన్షన్ కింద మిర్చి క్వింటాకు రూ.11,781 చొప్పున గిట్టుబాటు ధర కల్పించాం. మార్కెట్ ఇంటర్ వెన్షన్ కింద మిర్చి క్వింటాకు రూ.11,781 చొప్పున గిట్టుబాటు ధర కల్పించాం.రూ.8,282 కోట్లతో ఖరీఫ్‌లో 6 లక్షల మంది రైతుల నుంచి 36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం, రబీలో రూ.4,575 కోట్లతో 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 2 లక్షల మంది రైతుల నుంచి కొనుగోలు చేశాం. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నాం.
పంటలకు గిట్టుబాటు ధర కల్పించాం
సబ్సిడీ విత్తనాల నుంచి గిట్టుబాటు ధర వరకు అండగా నిలిచాం. 2014-2019 మధ్య మా హయాంలోనే వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ తీసుకువచ్చాం. రూ.15,279 కోట్ల రుణ మాఫీ చేశాం. ఉచితంగా భూసార పరీక్షలు జరిపి 1.33 కోట్ల సాయిల్ హెల్త్ కార్డులు ఇచ్చాం. ఎన్టీఆర్ జలసిరి కింద బోర్లు వేశాం. 6 లక్షల పంట కుంటలు తవ్వించాం. రూ.1,488 కోట్లతో4.99 లక్షల మంది రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాలు అందించాం. రైతు రథం పేరుతో 23,500 ట్రాక్టర్లు సబ్సిడీపైన పంపిణీ చేశామని సీఎం తెలిపారు.
రిజర్వాయర్లు కళకళ
ముందు చూపుతో అన్ని రిజర్వాయర్లకు నీరు వదలడంతో 700 టీఎంసీలతో రిజర్వాయర్లన్నీ కళకళలాడుతున్నాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల, కాటన్ బ్యారేజ్, ప్రకాశం బ్యారేజ్, సోమశిలలో సమృద్ధిగా నీరు ఉంది. ఎవరికీ తాగు, సాగు నీటి కొరత లేకుండా నదుల అనుసంధానం చేస్తాం. భూగర్భ జలాల పెంపుపై ప్రజలు కూడా దృష్టి సారించాలని కోరుతున్నాను. 2014-19 మధ్య కాలంలో సాగునీటి రంగానికి రూ. 68 వేల కోట్లు ఖర్చు చేయగా గత ప్రభుత్వం రూ. 12 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. గత పాలకులు ఉచిత బీమా పథకాన్ని నాశనం చేస్తే కూటమి అధికారంలోకి వచ్చాక మళ్లీ మేం దాన్ని పునరుద్ధరించాం. వైసీపీ హయాంలో రూ.1,670 కోట్ల ధాన్యం డబ్బులను రైతులకు ఎగ్గొట్టారు. కూటమి వచ్చాకే ఆ బకాయిలన్నీ చెల్లించాం. గుండ్లకమ్మ గేట్లకు మేం మరమ్మతులు చేసి ప్రాజెక్టును సంరంక్షించాం. వెలిగొండను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. వచ్చే సీజన్ కి ఫేజ్ వన్ పూర్తిచేసి కృష్ణా జలాలు వెలిగొండ ద్వారా ప్రకాశం జిల్లాకు తీసుకువస్తాం. 2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.
రాజకీయ నేరస్తులతో జాగ్రత్త
రాజకీయ ముసుగు వేసుకున్న నేరస్తులతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. 47 ఏళ్ల రాజకీయ జీవితంలో 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నాను. గతంలో ఎన్నడూ చూడని కొత్త రాజకీయాలు చూస్తున్నాను. మన రాష్ట్రంలో ఉన్న ఒక పార్టీ …అమరావతి ఆడబిడ్డలను వేశ్యలుగా చిత్రీకరించింది. ఆ పార్టీ అధినేత ప్రకాశం జిల్లా పొదిలి వచ్చినప్పుడు ఆడబిడ్డలు క్షమాపణ చెప్పమని కోరగా వారిపై దౌర్జన్యం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిని వైసీపీ నేత నల్లపురెడ్డి పశువులా దూషించాడు. పార్టీ అధినేత ఏం చేశాడు? మందలించకుండా.. మా వాళ్లకు చెప్తే చాలు…ఇళ్లలోకి పోయి రప్పా రప్పా లేపేస్తారని అంటున్నాడు. బాబాయ్ హత్య విషయంలో నన్నూ ఏమార్చారు. పల్నాడులో వైసీపీ కార్యకర్త ఆయన కారు కిందే పడితే ఎత్తి పొదల్లో పడేశారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం లో మామిడికి ధర లేదని మామిడి పళ్లను ట్రాక్టర్ల కింద తొక్కించి రాజకీయ విన్యాసం చేశాడు. నెల్లూరులో జనం వచ్చినట్టు ఫేక్ వీడియో ప్రదర్శించాడు.
జగన్‌ను చూసి బూతులు నేర్చుకోవాలా..!
రాజకీయ పార్టీలు ప్రజల కోసం పని చేయాలి. వారి అంతిమ లక్ష్యం అధికారమైనప్పటికీ నైతిక విలువలు, పద్దతులు, నిబంధనలు, కట్టుబాట్లు తప్పనిసరిగా పాటించాలి. జగన్ ను చూసి రప్పా రప్పా, బూతుల పంచాంగం, గొడ్డలి వేట్లు నేర్చుకోవాలా? పేదల ప్రాణాలు, ఆస్తులు కాపాడేందుకు నేను పనిచేస్తున్నాను. నేను అభివృద్ధి చేసిన తెలంగాణ ఎలా ఉందో చూశారుగా. అంతకు మిన్నగా ఏపీని 2047 నాటికి దేశంలోనే నెంబర్ వన్ గా తయారు చేస్తానని సీఎం చంద్రబాబు తెలిపారు.