సంస్కృతాంధ్ర పండితులు జన్నాభట్ల ఇక లేరు
– రోడ్డు ప్రమాదంలో దుర్మరణం –
గుంటూరు, అక్టోబర్ 18: సంస్కృతాంధ్ర పండితులు, రంగస్థల నటులు జన్నాభట్ల లక్ష్మీనారాయణ (65) శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదానికి గురై అకాల మరణం చెందారు. ఈయనకు సతీమణి, ముగ్గురు కుమారులు వున్నారు. ఒక వియ్యంకుడు శ్రీనివాస్ నకరికల్లులో 30 ఏళ్లకు పైగా జర్నలిజంలో కొనసాగుతున్నారు.కాగా, జన్నాభట్ల ద్విచక్ర వాహనంపై వినుకొండ నుంచి వస్తుండగా, నరసరావుపేట సమీపంలో సాయంత్రం 5 గంటలకు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. చికిత్స కోసం పలు ఆసుపత్రులకు తీసుకెళ్లినా, ఫలితం లేకపోయింది. రాత్రి 9 గంటల సమయంలో ఆయన కనుమూశారు. స్వస్థలం నూజెండ్లలో శనివారం అంత్యక్రియలు జరిగాయి. ప్రకాశం జిల్లా తిమ్మసముద్రంలోని శ్రీ గోరంట్ల వెంకన్న సంస్కృత కళాశాలలో తామిద్దరం కలిసి భాషాప్రవీణ ఐదేళ్ల కోర్సు పూర్తిచేశామని చెబుతూ, ఆ కళాశాల విద్యార్థి సంఘం పూర్వ అధ్యక్షులు, సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజు చలపతిరావు ఆయన అకాల మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తపరిచారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలిపారు. నరసరావుపేటలోని వివిధ విద్యాసంస్థల్లో మూడు దశాబ్దాలకు పైగా సంస్కృతాంధ్ర పండితులుగా పనిచేసిన జన్నాభట్ల, పౌరోహిత్యంలో క్షణం తీరికలేకుండా కాలం గడుపుతున్నారు. కొంతకాలం ఆయన నాగార్జున విశ్వవిద్యాలయం సెనేట్ సభ్యునిగానూ పని చేశారు. రంగస్థల నటునిగా వివిధ పాత్రలకు జీవం పోయటం ద్వారా గొప్ప నటునిగా పేరొందారు. పట్టణ కళాకారుల సంఘంలో వివిధ పదవుల్లో అనేకానేక మంది పేద కళాకారులకు ఆయన పింఛన్లు మంజూరు చేయించారంటూ నిమ్మరాజు నివాళులర్పించారు.