Medical and Health

గిరిజన ప్రాంత ఆసుపత్రులకు డ్రోన్ల ద్వారా మందుల సరఫరా

  • పాడేరు కేంద్రంగా నిర్వహించేందుకు ప్రైవేట్ సంస్థతో వైద్య ఆరోగ్య శాఖ ఒప్పందం
  • వచ్చే నెలాఖరు నుంచి సేవలు ప్రారంభం

మారుమూల గిరిజన ప్రాంతాలకు అత్యవసర వైద్య సేవలను చేరువ చేసే లక్ష్యంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ “రెడ్ వింగ్” సంస్థతో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రంగా దూరప్రాంతాల్లోని ఆసుపత్రులకు డ్రోన్ల ద్వారా మందులు, బ్లడ్ యూనిట్స్ పంపిణీ చేసేందుకు వీలుగా ఈ ఒప్పందం జరిగింది. ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్‌లో విజయవంతంగా సేవలు అందిస్తున్న సదరు సంస్థ, రాష్ట్రంలో ‘ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్’ కింద మొదటి 6-7 నెలల పాటు ఉచితంగా సేవలు అందించడానికి అంగీకరించింది. ఈ ఒప్పందం రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ వీరపాండ్యన్, సదరు సంస్థ ప్రతినిధి కుందన్ మాదిరెడ్డి మధ్య కుదిరినట్లు వైద్య ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

ఒప్పంద పత్రాలతో రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ వీరపాండ్యన్, సదరు సంస్థ ప్రతినిధి కుందన్ మాదిరెడ్డి

పాడేరు కేంద్రంగా కార్యకలాపాలు

పాడేరును ప్రధాన కేంద్రం (హబ్)గా చేసుకుని, 60 నుంచి 80 కిలోమీటర్ల పరిధిలోని ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాలకు డ్రోన్‌ సేవలు అందుతాయి. ఈ డ్రోన్లలో మందులు మరియు వ్యాక్సిన్లు పాడవకుండా ఉండేలా కోల్డ్ చైన్ సదుపాయం కూడా ఉంటుంది. ఒక్కో డ్రోన్ సుమారు 2 కిలోల బరువును మోసుకెళ్ళే సామర్థ్యంతో పనిచేస్తుంది.
ఈ డ్రోన్లు కేవలం మందులు తీసుకెళ్లడమే కాకుండా, తిరిగి వచ్చేటప్పుడు రోగుల నుంచి సేకరించిన రక్త, మల, మూత్ర నమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌లకు తీసుకొస్తాయి. వచ్చే నెలాఖరు నుంచి ఈ సేవలు ప్రారంభమ‌వుతాయని కమీషనర్ వీరపాండ్యన్ తెలిపారు.

​త్వ‌ర‌లో కెజిహెచ్ నుండి పాడేరుకు…
​గిరిజన కొండ ప్రాంతాల్లో రోడ్డు మార్గాల ద్వారా మందులు పంపడం సమయంతో కూడుకున్న పని. అత్యవసర సమయాల్లో ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా డ్రోన్ల వినియోగంపై కూట‌మి ప్ర‌భుత్తం దృష్టి పెట్టింది. భవిష్యత్తులో ఈ సేవలను విశాఖ‌ కేజీహెచ్ నుంచి పాడేరుకు మందుల రవాణాకు కూడా విస్తరింపచేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *