రాయలసీమ..ఆనాటి స్మృతులు
- నంద్యాలలో ఆత్మగౌరవ సభ
- పాల్గొన్న మేధావులు, ఉద్యమకారులు
రాయలసీమ సాగునీటి సాధన సమితి కార్యాలయంలో “రాయలసీమ ఆత్మగౌరవ దినోత్సవం” ను నవంబర్ 18, 2021 గురువారం నాడు ఘనంగా నిర్వహించారు. రాయలసీమ సాగునీటి సాధన సమితి ఉపాధ్యక్షుడు Y.N.రెడ్డి అధ్యక్షత వహించిన కార్యక్రమంలో ఆంధ్రాబ్యాంక్ విశ్రాంత ఏ జి ఎం. విప్పల శివ నాగిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాయలసీమ నామకరణం జరిగిన నేపథ్యాన్ని శివనాగిరెడ్డి వివరించారు.
ఆంధ్ర మహాసభలు నవంబర్ 17, 18 , 1928 న నంద్యాలలో జరిగిన విషయాన్ని శివనాగి రెడ్డి గుర్తు చేసారు. ఈ సమావేశం నిర్వహణలో నంద్యాల ప్రాంతానికి చెందిన ఖాదరబాద్ నరసింహారావు, ఆత్మకూరు సుబ్రమణ్యం శ్రేష్టి , రాజా పెద్ద సుబ్బారాయుడు శ్రేష్టి, ఓరుగంట సుబ్రమణ్యం, కాల్వ కేశన్న, వనం శంకర్ శర్మ, గాడిచెర్ల హరి సర్వోత్తమ రావు, దాదాఖాన్ సిరాని బహుదూర్, టి.రామబద్రయ్య, బి.నారారణ మూర్తి క్రియాశీలకంగా పనిచేసిన విషయాన్ని వివరించారు.
- జాతీయేద్యమం, సంఘసంస్కరణ, ఆంధ్రరాష్ట్ర ఏర్పాటు అంశాలపై నిర్వహించే ఆంధ్ర మహాసభలలో నిర్వాహకులు స్థానిక దత్తమండలాల సమస్యలపై కూడా చర్చకు పట్టుబట్టిన విషయాన్ని తెలిపారు. దీనితో నవంబర్ 18 న దత్తమండలాలకు సంబంధించిన ఆర్థిక పరిస్థితులు, నీటి ప్రాజెక్టులు, పెండింగ్ ప్రాజెక్టులు, విద్యారంగం తదితర అంశాలపై చర్చ జరిగిన విషయాన్ని గుర్తు చేశారు.రాయలసీమ నామకరణం చేసిన చిలుకూరి నారయణరావును ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్నవారు స్మరించుకున్నారు. విశాఖ పట్నం జిల్లా పొందూరు దగ్గర ఉన్న ఆనందాపురం గ్రామంలో జన్మించిన చిలుకూరి నారాయణ రావు ఉద్యోగ రీత్యా అనంతపురం లోని సీడెడ్ డిస్ట్రిక్ట్స్ ఆర్ట్స్ కాలేజికి (దత్త మండలాల కళాశాల) ఆచార్యులుగా 1927 వ సంవత్సరంలో వచ్చారుని, సీడెడ్ (వదలివేయబడిన/అనాద) అన్న పేరుతో ఒక ప్రాంత ఆత్మగౌరవాన్ని తక్కువ చేసి పిలవడం ఏ మాత్రం సబబు కాదన్న చిలుకూరి వారి భావనను వక్తలు సమావేశంలో గుర్తుకు తెచ్చుకున్నారు. ఈ ప్రాంతాన్ని నిజాం నవాబు ఆంగ్లేయులకు వదిలివేయడం తో ఈ ప్రాంతాన్ని వదిలి వేయబడిన ప్రాంతంగా “దత్త” అని పిలువడంలోని సమంజసతను ప్రశ్శిస్తూ చిలుకూరి వ్రాసిన గేయాన్ని వక్తలు మననం చేసుకున్నారు.
- ఆంధ్ర మహాసభ సమావేశాల సందర్భంగా నిర్వహించిన దత్తమండలాల సమావేశం లో చిలుకూరి నారాయణరావు ఈ ప్రాంతానికి “రాయలసీమ” అనే పేరును ప్రతిపాదించడం, ఈ ప్రతిపాదనను పప్పూరు రామాచార్యులు, గాడిచెర్ల హరి సర్వోత్తమ రావు బలపరచడం, రాయలసీమ నామకరణ ప్రతిపాదనను ఏకగ్రీవంగా ఆమోదించడాన్ని వక్తలు స్మరించుకున్నారు.
ఈ ప్రాంత ఆత్మగౌరవ సూచికగా దత్తమండలాలకు బదులుగా “రాయలసీమ” నామకరణం జరిగిన ఈ రోజున రాయలసీమ ఆత్మగౌరవ దినోత్సవం ను రాయలసీమ సాగునీటి సాధన సమితి కార్యాలయం నంద్యాలలో ఘనంగా నిర్వహించారు.
- ఈ సమావేశంలో వెంకటసుబ్బయ్య, వెంకటేశ్వర నాయుడు, తిరుపాలు, భాస్కర్ రెడ్డి, పట్నం రాముడు, మనోజ్, నాగేశ్వర రెడ్డి, కొమ్మా శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.