చంద్రబాబుకు ముద్రగడ బహిరంగలేఖ
- మీ భార్య దేవత..మీ ఆఫీసు దేవాలయం
- మరి మా కొంపల సంగతేమిటి..
- మా ఇంట్లో ఆడవాళ్ల సంగతేమిటి..
- చంద్రబాబును దుమ్ము దులిపిన ముద్రగడ
మీ ఇంట్లో ఆడవాళ్ళు దేవతలా.. మరి, మా ఇంట్లో వాళ్ళు ……లా..!? అంటూ చంద్రబాబును కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు. మా ఇళ్లలోని ఆడవారిని అత్యంత నీచాతిచీతంగా ఫోన్ లో పర్యవేక్షిస్తూ తిట్టించి వేధించి నరకయాతనకు గురి చేసినపుడు ఇపుడు చెప్పే నీతులు ఏమైపోయాయంటూ ప్రశ్నలు సంధిస్తూ బహిరంగ లేఖ రాశారు. ముద్రగడ రాసిన బహిరంగ లేఖ యధాతధంగా..
గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మీ ఉక్కు పాదాలతో అణచివేయబడ్డ మీ మాజీ మిత్రుడు ముద్రగడ పద్మనాభం నమస్కారములు.
అయ్యా మీ శ్రీమతి గారికి ఈ మధ్యన జరిగిన అవమానం గురించి తమరు చాలా బాధపడుతూ ఆవేదనతో వెక్కి వెక్కి కన్నీరు కార్చడం టి.విలో చూసి చాలా ఆశ్చర్యపోయానండి. కొద్దోగొప్పో మీకన్నా మాకుటుంబానికి చాలా చరిత్ర ఉన్నదండి. మా తాత గారు పేరుకే కిర్లంపూడి మునసబు గాని, జిల్లా మునసబుగా పేరు గడించారు. నా తండ్రిని ప్రజలు ప్రేమతో రెండు దఫాలు ఉమ్మడి ప్రత్తిపాడు నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ శాసనభ్యుడిగా అసెంబ్లీకి పంపారండి.
1978లో ఒకేసారి…గుర్తుందా?
మీరు, నేను 1978లో అసెంబ్లీలోకి అడుగు పెట్టడం జరిగింది. మీ మామయ్య గౌరవ శ్రీ ఎన్.టి.రామారావు గారి వద్ద, తరువాత మీ పిలుపు మేరకు మీవద్ద చాలా సంవత్సరాలు పనిచేసాను. ఎప్పుడు మీతో ఉన్నప్పుడు మీకు వెన్నుపోటు పొడవాలనే ప్రయత్నం చేయలేదండి.
మా జాతికి మీరిచ్చిన హామీ కొరకు దీక్ష మొదలుపెట్టిన మొదటి రోజునే గౌరవ తమరి పుత్రరత్నం గారు మా ఆవరణలో ఉన్న పోలీసు అధికారులకు తరచూ ఫోన్ చేసి (అసభ్య పదం) నన్ను బయటకి లాగారా లేదా? తలుపులు బద్దలు కొట్టి నా శ్రీమతిని (అసభ్య పదం) లెగవే అని బూటు కాలుతో తన్నించి ఈడ్చుకెళ్ళింది, నా కోడలిని (అసభ్య పదం) నిన్ను కొడితే దిక్కెవరే అని తిట్టించింది. నా కొడుకుని లాఠీలతో కొట్టుకుని తీసుకువెళ్ళింది తమకు గుర్తు లేదాండి? ఇప్పుడు తమరి నోటివెంట ముత్యాల్లాంటి వేదాలు వస్తున్నాయి. బాబు గారు మీ దృష్టిలో మా కుటుంబం (అసభ్య పదం) కుటుంబమా? మీరు, మీ శ్రీమతి గారు దేవతలా? మీ ఆఫీసులు దేవాలయాలా? మరి మేమేంటి, మా కొంపలు ఏమిటి?
సృష్టించిన భయంకర వాతావరణాన్ని మరిచిపోలేదు
ఆరోజున హెలికాప్టరు, తరువాత మరోకసారి సుమారు 6000 మంది పోలీసులను ప్రయోగించి నన్ను తీహార్ జైలుకు పంపాలని డ్రోన్ కెమారాలతో నిత్యం నిఘా పెట్టించి నా ఇంటి వద్ద భయంకరమైన వాతావరణం సృష్టించి, కార్గిల్ యుద్ధ భూమిని తలపించేలా చేసారు. తమరికి ఆ సంఘటనలు గుర్తు చేయడం కోసమే తప్ప, తమరిని, మీ శ్రీమతి గారిని అవమానించడం కోసం ఈలేఖ వ్రాయలేదండి. ఇంకా లోతుగా రాయాలంటే పేజీలు సరిపోవు, గదిలో ఉన్న డబ్బులు, సెల్ ఫోన్లు వగైరా ఆరోజు దొంగిలించబడ్డాయి.
రాక్షసానందం పొందారుగా…
హాస్పటల్ అనే జైలులో బట్టలు మార్చుకోవడానికి గాని, స్నానాలు చేయడానికి గాని వీలు లేకుండా 14 రోజలు ఏ కారణంతో ఉంచారు. ఆ చిన్న గదిలో మా నలుగురితో పాటు మరోక ఆరుగురు పోలీసు వారిని పగలు, రాత్రుళ్ళు ఉంచి, రేకు కుర్చీలతో శబ్దాలు చేయిస్తూ, ప్రతీ రోజు రాత్రి మీ ఆదేశాలతో పోలీసు అధికారులు మా ముఖాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం కోసం ఫోటోలు తీయించి, పంపించమనడం రాక్షసానందం పొందడం కోసమే కాదా బాబుగారు? మీరు చేయించిన హింస తాలూకు అవమానాలు భరించలేక వాటిని తలచుకుంటూ నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపామండి. మా 4 సం॥ల మనవరాలు ఆర్ధరాత్రుల్లు గుర్తుకు వచ్చి ఎలా భయపడేదో చెప్పడానికి మాటలు చాలవండి. భూమి గుండ్రంగా ఉన్న సంగతి మరవద్దండి. నన్ను అంత దారుణంగా అణచివేయాలని ఎందుకు అనిపించిందండి. ఆరోజున మీ పదవికి అడ్డు జగన్మోహనరెడ్డి గారే, నేను అయితే కాదండి. కాని వారిని ఏరకమైన అణచివేతకు గురి చేయకుండా నా మీదే కట్టలుతెంచుకునే కోపాన్ని, క్రూరత్వాన్ని ఎందుకు చూపారండి బాబుగారు? మా కుటుంబం ఆత్మహత్య చేసుకోవాలనేదేగా మీ ప్రయత్నం? మీ అణచివేతతో మా కుటుంబం ఆత్మహత్యకు పూనుకోవాలనేది తమరి ప్రయత్నం కాదా బాబు గారు? మీ ప్రయత్నం బాటలోనే నేను ఆలోచన చేసాను, కాని నా కుటుంబాన్ని అవమాన పరిచిన మీ పతనం నా కళ్ళతో చూడాలనే ఉద్దేశ్యంతో ఆత్మహత్య ప్రయత్నం విరమించుకున్నాను.
సానుభూతి కోసమే మీ నాటకాలు
కార్యకర్తలు, బంధువులు సానుభూతి మీడియా ద్వారా విపరీతంగా పొందే అవకాశం తమరికి మాత్రమే వచ్చింది, ఈరోజు తమరు పొందుతున్న సానుభూతి ఆనాడు నేను పొందకుండా ఉండడం కోసం మీడియాను బంధించేసారు. ఆరోజు నుండి నన్ను అనాధను కూడా చేయడం తమరి భిక్షేనండి. బాబు గారు శపధం చేయకండి, అవి సాధించేవారు గౌరవనీయులు అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధి గారు, గౌరవనీయులు అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు గారు, గౌరవనీయులు అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారు, ప్రస్తుత బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారికే సొంతమండి. తమరికి, నాకు అవి నీటిమీద రాతలని గ్రహించండి. జీవితాలు, ఆస్తులు, పదవులు ఎవ్వరికి ఏవి శాశ్వతం కాదండి. ప్రజలు బూటు కాలితో తన్నించుకోవడం కోసమో, కేసులు పెట్టించుకోవడం కోసమో ఓట్లు వేయలేదన్నది గ్రహించండి.
ఇట్లు…
ముద్రగడ పద్మనాభం
23/11/21
ముద్రగడ విడుదల చేసిన లేఖలు