ఉద్యోగులకు త్వరలో పీఆర్సీ
- 11 పీఆర్సీ అమలుకు ముఖ్యమంత్రి సానుకూలం
- వారం, 10 రోజుల్లో పీఆర్సీ ప్రకటన
- ఉద్యోగ సంఘాలు సంయమనం పాటించాలి
- ఉద్యోగుల పక్షపాతి ముఖ్యమంత్రి
– రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సలహదారు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల 11 వ పీఆర్సీ అమలుకు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని, వారం రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తారని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సలహదారు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. విజయవాడ ఆర్ అండ్ బీ భవనంలో మీడియా ప్రతినిధులతో మంగళవారం మాట్లాడుతూ.. ఇప్పటికే పీఆర్ సీ ఛైర్మన్ రిపోర్టును ప్రభుత్వానికి అందజేశారని, పీఆర్సీ అమలుకు సంబంధించి ముఖ్యమంత్రి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారని, ఆ ప్రక్రియ నడుస్తోందని ఆయన అన్నారు. విభజన తర్వాత రాష్ట్ర ఆదాయ వనరులు తగ్గాయని, అలాగే కరోనా వల్ల కూడా రాష్ట్ర ఆదాయం ఒడిదుడుకులకు గురైందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు పరిస్థితిని అర్ధం చేసుకుని, ప్రభుత్వానికి సహకరించాలని, సంయమనం పాటించాలని ఆయన ఉద్యోగ సంఘాలకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వానికి, ఉద్యోగులకు వారధిగా ఉంటూ, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి, సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉద్యోగుల పక్షపాతని, అధికారంలోకి రాగానే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి అమలు చేశారని, అలాగే ఆర్టీసీని కూడా ప్రభుత్వంలో విలీనం చేసిన ఘనత కూడా ఈ ప్రభుత్వానిదేనన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 1.30 లక్షల సచివాలయ సిబ్బందిని, అత్యంత పారదర్శకంగా ఈ ప్రభుత్వం ఉద్యోగ నియమకాలు చేపట్టిందన్నారు. తన 36 ఏళ్లు సర్వీసులో ఉద్యోగ సంఘాలతో అనుబంధం ఉందని, చాలా మంది సీఎంలును చూశాను గానీ, ఉద్యోగులతో ఇంత సానుకూల ధోరణితో వ్యవహారించే సీఎంను చూడలేదని, ఉద్యోగులు ఏదీ అడిగినా లేదని చెప్పరని ఆయన తెలిపారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి సీఎస్ ఆధ్వర్యంలో 12 ఏళ్లుగా జరగని జాయింట్ స్టాప్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారని, ప్రతి డిపార్టెమెంట్ లో ఉన్న సమస్యలు తెలుసుకుంటున్నారని, సీఎం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. వివిధ శాఖల నుంచి దాదాపు 71 సమస్యలు వచ్చాయని, వీటిలో పీఆర్సీ, డీఏలు, సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగులు రెగ్యులరైజ్ మాత్రమే కీలకమైనవన్నారు. మిగిలినవన్నీ చిన్న అంశాలేనని అన్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా కృషి చేస్తోందన్నారు.
కరోనా వల్ల కేంద్ర ప్రభుత్వం కూడా 3 డీఏలు పెండింగ్ లో పెట్టిందని, ఆ తర్వాత విడుదల చేసిందని, మన ఉద్యోగులకు 5 డీఏలు పెండింగ్ లో ఉన్నాయని, జనవరిలో మరో డీఏ వస్తుందని, డీఏలను కూడా పీఆర్సీ అమలు చేసిన తర్వాత ఇవ్వడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆయన తెలిపారు. సీపీఎస్ రద్దు చేసి, పాత పెన్షన్ విధానం తీసుకురావాలని ఉద్యోగులు కోరారని, ఆ మేరకు ముఖ్యమంత్రి కూడా గతంలో హామీ ఇచ్చారని, అయితే సీపీఎస్ ఉద్యోగులకు కూడా పాత పెన్షన్ బెనిఫిట్ లు వచ్చే విధంగా…ఎలా అమలు చేస్తే ఉద్యోగులకు మేలు జరుగుతుందో ఆ దిశలో ప్రభుత్వం ఆలోచన చేస్తుందని తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయంలో తెలంగాణలో కోర్టుల నుంచి అడ్డంకులు వచ్చాయని, ఈ నేపథ్యంలో న్యాయ అవరోధాలు లేకుండా చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు.
ముఖ్యమంత్రి వారం, 10 రోజుల్లో పీఆర్సీ ఇస్తామని ప్రకటించినప్పటికీ ఉద్యోగ సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయని, ఈ విషయంలో ఉద్యోగ సంఘాలు సంయమనం పాటించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కష్టపడి అమలు చేస్తూ, ఉద్యోగులు ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో అనేక ఆర్ధిక సమస్యలున్న ప్రభుత్వం సంక్షేమ పథకాలకు సక్రమంగా అమలు చేస్తోందని, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్లడానికి రథసారథులుగా పనిచేస్తున్నారని, సీఎం జగన్ మోహన్ రెడ్డి పలుమార్లు ప్రశంసించిన విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలన్నారు.
ఒక ఉద్యోగ సంఘ నాయకుడు చేసిన వ్యాఖ్యల పట్ల చంద్రశేఖర్ రెడ్డి స్పందిస్తూ, ఆయన వ్యాఖ్యలను వక్రీకరించడం జరిగిందని అలా అని ఉంటారని తాను అనుకోవడం లేదని, ఒకవేళ వ్యాఖ్యనించి ఉంటే, అలా అనకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల భద్రత విషయంలో ఉద్యోగ సంఘాలపై బాధ్యత ఉంటుందని, అందుకే వారు బాధ్యత తీసుకుని మాట్లాడతారని చెప్పారు. కుటుంబ పెద్దగా ముఖ్యమంత్రిగారిపై కొన్ని వ్యాఖ్యలు చేసినా, రేపు సమస్యలను పరిష్కరించి ముఖ్యమంత్రి వారిని దగ్గరకు తీసుకుంటే, వారే తిరిగి ముఖ్యమంత్రికి పాలాభిషేకాలు చేస్తారన్నారు. ఇది రాజకీయ సమస్య కాదు, కాబట్టి ఉద్యోగులు వారి సమస్యల గురించి మాత్రమే మాట్లాడాలన్నారు.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత కల్పించే విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం.. వాటిని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. గతంలో అన్ని ఉద్యోగ సంఘాలతో పీఆర్సీ అంశంపై చర్చించగా కొంతమంది రిపోర్టు కావాలని అడిగారు.. ఈ అంశాలన్నింటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. గతంలో పీఆర్సీ ఇచ్చిన తర్వాతే ఆన్ లైన్ లో పెట్టారని ఆయన విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా తెలిపారు.