రాష్ట్రంలో చేనేత,జౌళి అవుట్ లెట్లు
జాయింట్ ఔట్ లెట్లను ప్రారంభించండి
చేనేత, జౌళి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ చేనేత, జౌళి, హస్తకళలను ప్రజలకు మరింత చేరువ చెయ్యాలని మంత్రి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. వెలగపూడి సచివాలయం నాలుగవ బ్లాక్ లో మంగళవారం ఆయన చేనేత,జౌళి శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 3న మరోసారి సమావేశం కావాలని మంత్రి ఆదేశించారు. ఆ రోజు కల్లా రానున్న ఏడాది చేయబోయే కార్యక్రమాల కార్యాచరణను తీసుకురావాలన్నారు. ప్రస్తుతం లేపాక్షి, హస్తకళలు వేర్వేరు ఔట్ లెట్లు ఉన్నాయని, వాటిని కలిపి జాయింట్ ఔట్ లెట్లుగా నిర్వహిస్తే మరింత వ్యాపారం జరిగే అవకాశం ఉందని మంత్రి మేకపాటి పేర్కొన్నారు. హస్తకళలు, బొమ్మల తయారీలో మరింత నైపుణ్యం పెంచే వీలుగా కళాకారులకు శిక్షణ అందించాలని మంత్రి మేకపాటి తెలిపారు. క్రాఫ్ట్ క్లస్టర్ల నిర్వహణకు సుమారు 2 లక్షల మంది కళాకారులు తమ నైపుణ్యం చాటుతున్నట్లు లేపాక్షి ఎండీ బాల సుబ్రహ్మణ్యం మంత్రికి వివరించారు. ఈ సందర్బంగా ఇటీవల చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎక్స్ పోను మంత్రి అభినందించారు. అనంతరం చక్కెర ఫ్యాక్టరీలపై పూనం మాలకొండయ్యతో మంత్రి మేకపాటి చర్చించారు. ఫ్యాక్టరీల ఉద్యోగుల జీతాల చెల్లింపు స్పష్టత తీసుకురావాలని ఆదేశించారు. ఏ ఏ ఫ్యాక్టరీకి ఎంత చెల్లింపులు, వీఆర్ఎస్ ప్రక్రియ వంటి అంశాలపై మంత్రి ప్రధానంగా చర్చించారు.
వెలగపూడి సచివాలయంలో జరిగిన సమీక్షకు చేనేత,జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్, హ్యాండ్లూమ్స్ టెక్స్ టైల్ డైరెక్టర్ నాగరాణి, లేపాక్షి ఎండీ బాలసుబ్రహ్మణ్యం, ఖాదీ, గ్రామీణ పరిశ్రమల బోర్డు ఛైర్మన్ భాగ్యమ్మ, ఏపీ హస్తకళల అభివృద్ది కార్పొరేషన్ ఛైర్మన్ బండిగింజల విజయలక్ష్మి, ఆప్కో ఛైర్మన్ చల్లపల్లి మోహన్ రావు, పరిశ్రమల శాఖ సలహాదారు శ్రీధర్ లంకా, ఇతర అధికారులు హాజరయ్యారు.