సీఎం జగన్ కు కత్తిపద్మారావు బహిరంగలేఖ
జిల్లాల పేర్లు మార్చండి
దేవుళ్ళ పేర్లు తొలగించి
సామాజిక విప్లవకారుల పేర్లు పెట్టండి
పల్నాడుకు జాషువా పేరు పెట్టాలి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
గౌరవనీయులు శ్రీ వై.ఎస్.జగన్మోహన రెడ్డి గారికి..
ముఖ్య కార్యదర్శి అజయ్ కలాం గారి ద్వారా ముఖ్యమంత్రి గారికి వ్రాయు
బహిరంగ లేఖ..
1.ఇటీవల మీరు 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చడమనేది హర్షణీయమైన విషయం.
ఈ విషయంలో 13 జిల్లాలను 28 జిల్లాలు చేయాలని మేము శ్రీకృష్ణ కమిటీ కి నివేదించాము.
తర్వాత మీకు రాసిన అనేక లేఖల్లో పలుమార్లు విన్నవించాము.ఎట్టకేలకు ఆవిభజన ప్రకటన, పరిపాలన ప్రజల దగ్గరకు చేరేవిషయంలో ముందడుగు లో ఉంది. అయితే, జిల్లాలకు పెట్టిన పేర్లలో లౌకిక సామాజిక వాదం దెబ్బతింటుంది.డా.బి.ఆర్.అంబేద్కర్ నిర్మించిన రాజ్యాంగ సూత్రాల ఉల్లంఘన ఉంది.
2.ముఖ్యంగా బాపట్ల కు ‘ భావపురి ‘ అని పెట్టారు.అంటే భావనారాయణ స్వామి జిల్లా అని అర్థం.మొత్తం జిల్లాలో భావనారాయణ స్వామిని కొలిచేవాళ్లు వందల్లో మాత్రమే ఉంటారు.అయితే ఆ జిల్లా మొత్తం కూడా దళిత, బహుజనులకు సంబంధించి ఉంది.బాపట్ల నియోజకవర్గం
M.L.A. గారు బ్రాహ్మణుడైన కోనా రఘుపతి గారిని నియమించారు.బ్రాహ్మణులకు అక్కడ 1500 ఓట్లు మాత్రమే ఉన్నాయి.పైగా ఆయన ఆర్ష బ్రాహ్మణ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నారు.ఇటీవల ఇక్కడ మీరు ఇచ్చిన ఇళ్ళ స్థలాల్లో రెండు లైన్లు బ్రాహ్మణులకు వేరుగా ప్రత్యేకంగా కట్టించారు.ఆయన బ్రాహ్మణ వాది.ఆయనే ‘భావపురి ‘ అని పేరుని పెట్టమని ప్రభుత్వానికి సలహా ఇచ్చి ఉంటారు.తప్పక మీరు ఈ ‘ భావపురి ‘ ని తొలగించి డా.బి.ఆర్.అంబేద్కర్ పేరును
పెట్టాల్సిన చారిత్రక అవసరం ఉంది.
3.తిరుపతికి బాలాజీ అని పేరు పెట్టారు.రాయలసీమకు పేరు రావడానికి కారణం కృష్ణదేవరాయలు.దేవుడి పేరు పెట్టడం కాకుండా కృష్ణదేవరాయలు పేరును పెట్టినట్లైతే ఒక చారిత్రక ప్రాధాన్యత ఆ ప్రాంతానికి వస్తుంది.
4.ఇకపోతే విజయవాడ దళిత వాడ.అక్కడ స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి ముస్లిం లకు ఒక సీటు,దళితులకు ఒక సీటు ఇచ్చారు.కానీ ఇప్పుడు మీరు ఒక సీటు బ్రాహ్మణుడు
మల్లాది విష్ణు గారికి,రెండోది వైశ్యుడు వెల్లంపల్లి శ్రీనివాసరావు కి ఇచ్చారు.వారిద్దరూ అక్కడ
బ్రాహ్మణ వాద భావజాలంతో వ్యవహరిస్తున్నారు. పైగా మీరు N.T.R. పేరు పెట్టారు.ఆయన కాలంలో విజయవాడలో వంగవీటి రంగా హత్య, థశరథరామ్ హత్య జరిగింది.విజయవాడలో అంబేద్కర్ స్మృతి వనం నిర్మిస్తున్నారు కాబట్టి విజయవాడ జిల్లాకు అంబేద్కర్ గారి గురువు మహాత్మా ఫూలే పేరుని పెట్టాలని కోరుతున్నాం. కృష్ణాజిల్లా మచిలీపట్నానికి N.T.R.జిల్లాగా పెట్టడం సముచితంగా ఉంటుంది.
5.నిజానికి తమిళనాడు లో గానీ,కర్ణాటకలో గానీ,ఉత్తరప్రదేశ్ లో గానీ,మహారాష్ట్ర లో గానీ,పశ్చిమ బెంగాల్ లో గానీ, ప్రసిద్ధమైన, చారిత్రకమైన కవులు,కళాకారుల పేర్లు ఎక్కువగా పెట్టడం జరిగింది.
మీరు కూడా కేవలం రాజకీయపరమైన మాజీ ముఖ్యమంత్రుల పేర్లను మాత్రమే కాకుండా ఆయా ప్రాంతాలలో సామాజిక,సాంస్కృతిక, రాజకీయ,చారిత్రక ప్రాధాన్యత కలిగిన మహాపురుషుల ను స్మరించుకునే విధంగా, గౌరవించు కునే పద్ధతిలో ప్రతి జిల్లాకు కూడా ఒక మహనీయుని పేరుని పెట్టవల్సిందిగా సూచిస్తున్నాం.
6.ఇక రాజమండ్రి లో ప్రసిద్ధి చెందిన వారు కుసుమ ధర్మన్న. ఆయన ‘మాకొద్ధీ నల్ల దొరతనం ‘ అని ఎలుగెత్తి చాటి భాగ్యరెడ్డి వర్మ తో కలిసి పోరాటాలు చేశారు.ఆయన పేరు పెట్టడం వల్ల చారిత్రక జ్ఞాపనం అవుతుంది.
7.విజయనగరంలో ‘ ‘కన్యాశుల్కం ‘ ద్వారా గురజాడ అప్పారావు సంస్కరణోద్యమానికి పతాకలెత్తారు.విజయనగరం కు మహాకవి,సంస్కర్త పేరును పెట్టడం ద్వారా జాతికి మేల్కొలుపు ని చూపుతుంది.
8. నరసారావు పేటకు పలనాడు అని పేరు పెట్టే బదులు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన మహాకవి జాషువా పేరుని నరసారావు పేటకు గానీ,గుంటూరుకు గానీ పెట్టాలనే డిమాండ్ ఎప్పటినుండో ఉంది.
9.కర్నూలులో భారతదేశంలో పేరు ప్రఖ్యాతులు పొందిన దామోదర సంజీవయ్య గారి పేరు పెట్టవలసిన చారిత్రక రాజకీయ సందర్భాన్ని గుర్తించాలి.
10.సత్యసాయిబాబా మీద అనేక ఆరోపణలు ఉన్నాయి.పైగా హిందూపురం నుంచి జిల్లా కేంద్రాన్ని పుట్టపర్తికి మార్చడం సముచితం కాదు.మహాకవి వేమన పేరు ఆ జిల్లాకు పెట్టడం సముచితమైనది.
11.శ్రీకాకుళం లో ప్రఖ్యాతి చెందిన బహుజన రాజకీయవేత్త గౌతు లచ్చన్న పేరును పెట్టడం ద్వారా బహుజనుల ఒక నూత్న ఉత్తేజం తేగలరు.
12..అమలాపురంలో బౌద్ధ సాంస్కృతిక విప్లవం నడుస్తుంది.ఆ జిల్లాను ‘సిద్ధార్ధ ‘ జిల్లాగా మార్చడం వల్ల ఆంధ్రప్రదేశ్ యొక్క సంస్కృతీ వికాసం మన ముందుకొస్తుంది.
13.మీరు ఇటీవల ‘ ‘చింతామణి ‘ నాటకాన్ని నిషేధించడం చాలా బాధాకరమైన విషయం.అందులో ఎవరినైనా కించపరిచే విషయాలు ఉంటే వాటిని తొలగించైనా సరే ఆ నాటకాన్ని ప్రదర్శించుకునే అవకాశం మీరు కల్పించాలి.ఎందుకంటే ఆ నాటకం లో సామాజిక నీతి ఉంది.ఎంతోమంది దళిత బహుజన కళాకారులు అందులో నటించి జీవితం గడుపుతున్నారు.తప్పకుండా ఆ నాటకాన్ని పునరుద్ధరిస్తారని ఆశిస్తున్నాము. ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్చకుండా జిల్లాలను రూపొందించడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉండదు. అలానే న్యూ రిక్రూట్మెంట్ లేకుండా ఉన్నవాళ్ళనే సర్దడం వల్ల కూడా ఉపయోగం ఉండదు.కాబట్టి వీటన్నింటినీ గమనించి మా సూచనలను,సలహాలను, డిమాండ్ లను పరిగణనలోకి తీసుకుని తప్పక ఈ మార్పులు చేపట్టగలరని ఆశిస్తున్నాం.
ఇకపోతే మీరు ఉద్యోగుల హక్కుల విషయంలో పట్టుదలకు పోకుండా వాళ్ళ డిమాండ్ లను పరిగణలోనికి తీసుకుని మీతో వారు చర్చలకు వచ్చే అనుకూలతలను ఏర్పరచి అపుడు సామరస్యంగా,సానుకూలత గా చర్చలు కొనసాగించాలి.లేని యెడల సమ్మెలు జరిగి రాష్ట్రానికి ఆర్థిక లోటు ఏర్పడి పరిపాలన అత్యంత భారమౌతుంది.
మీరు మీ కన్సల్టెన్సీలుగా దళిత,బహుజన మైనారిటీ మంత్రులు, ఎమ్మెల్యేలను,ఏమ్మెల్సీ లను
పెట్టుకోకపోవడం వల్ల మీ నిర్ణయాల్లో చారిత్రక,సామాజిక, సాంస్కృతిక లోపాలు కనిపిస్తున్నాయి.
ఆంధ్ర రాష్ట్రం సామాజిక,సాంస్కృతిక ,భాషా నేపథ్యమున్న రాష్ట్రం.ఈ మూడు అంశాలమీద అవగాహన ఉన్న వాళ్ళతో మీ కన్సల్టెన్సీ జరగాలి. మార్పులు,చేర్పులు కోసం నేను ప్రతిపాదించిన అంశాలు కూడా సామాజిక,సాంస్కృతిక, రాజకీయ,చారిత్రక ప్రాధాన్యత గలవి.కుల,మత,వర్గ, ప్రాంతీయ బేధాల్లేకుండా ప్రతిపాదించిన సముచితమైన అంశాలు.ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ ఈ అంశాలను శ్రీకృష్ణ కమిటీకి కూడా సమర్పించింది. వీటికి మీరు సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాం.
ఇట్లు
డాక్టర్ కత్తి పద్మారావు
(ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు)
లుంబినీ వనం,
అంబేద్కర్ రీసెర్చ్ సెంటర్,
అంబేద్కర్ కాలనీ,
పొన్నూరు పోస్ట్,
గుంటూరు జిల్లా,
ఆంధ్ర ప్రదేశ్