డీజీపీ బదిలీపై సమాధానం చెప్పాలి
గౌతం సవాంగ్ బదిలీ వెనుక కారణాలు బయటపెట్టాలి
ఉద్యోగుల ప్రదర్శన విజయవంతమైనందుకా..!
ఎల్వీ సుబ్రమణ్యం బదిలీ గుర్తుకు వస్తోంది..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్
డిజిపి గౌతమ్ సవాంగ్ ను ఆకస్మికంగా ఎందుకు బదిలీ చేశారో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ఏపీ డీజీపీ సవాంగ్ ఈ రోజు (మంగళవారం, ఫిబ్రవరి 15, 2022) మధ్యాహ్నం వరకూ విధుల్లో ఉన్నారు..ఆకస్మికంగా ఆ బాధ్యతల నుంచి పక్కకు తప్పించడం విస్మయం కలిగిస్తోంది..అధికారులను నియమించుకునే పాలనాపరమైన అధికారం ఉన్నా డీజీపీని హఠాత్తుగా మార్చాల్సిన అవసరం ఏమి వచ్చిందో చెప్పాలని పవన్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం సమాధానం చెప్పకపోతే విజయవాడలో పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగులు చేపట్టిన ర్యాలీ విజయవంతం అయినందుకే ఆయనపై బదిలీ వేటు వేశారని భావించాల్సి వస్తుందన్నారు. డిజిపి అంతటి వ్యక్తినే క్షణాల్లో బదిలీ చేశారంటే తమ సంగతి ఎలా ఉంటుందోనని కింది స్థాయి ఉద్యోగులు భయపడేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. డీజీపీ బదిలీ తీరును గమనిస్తే వైసీపీ ప్రభుత్వం చీఫ్ సెక్రెటరీగా ఉన్న ఎల్వీ సుబ్రమణ్యం ని ఆకస్మికంగా పక్కకు తప్పించిన సంగతి అందరికీ గుర్తుకు వస్తోందని పవన్ అన్నారు.