మహిళా చైతన్యానికి ‘సబల’
– మహిళా కమిషన్ కార్యచరణ విడుదల
– క్షేత్రస్థాయిలో విస్తృతంగా కార్యక్రమాలు: ‘వాసిరెడ్డి పద్మ’ వెల్లడి
– ‘సబల’ అజెండాగా సాగిన త్రైమాసిక సమావేశం
మహిళా సమస్యలపై తక్షణమే స్పందించేందుకు రాష్ట్ర మహిళా కమిషన్ ఏడాది కార్యచరణను విడుదల చేసింది. ‘సబల’ – ఆమెకు అండగా ఆంధ్రప్రదేశ్ పేరిట రాష్ట్రవ్యాప్తంగా కమిషన్ కార్యక్రమాలను చేపట్టేందుకు సిద్ధమైంది. బుధవారం రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయంలో చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అధ్యక్షతన కమిషన్ సభ్యులతో త్రైమాసిక సమావేశం నిర్వహించారు. మహిళలు, బాలికలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల పరిష్కారం దిశగా ఫోకస్ పెట్టి ‘సబల’ కార్యక్రమాలపై చర్చించారు. అత్యాచారం, లైంగిక వేధింపులు, హింస, వరకట్న వేధింపు లు, గృహహింస, మరణాలు, మహిళలపై సైబర్ నేరాలు తదితర సమస్యలపై జిల్లాలవారీగా క్షేత్రస్థాయిలో కమిషన్ ఏవిధంగా ముందుకెళ్లాలన్నది వాసిరెడ్డి పద్మ సభ్యులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ ఈ మార్చి నుంచి వచ్చే ఏడాది మార్చి నెల వరకు విస్తృతస్థాయిలో కార్యక్రమాలు చేపట్టేందుకు ‘సబల’ కార్యచరణ ఎంతగానో ఫలితాలను సాధించిపెడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విజయవాడ వేదికగా మహిళా దినోత్సవం వేడుకల్లో ‘సబల’ కార్యచరణను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవిష్కరణ చేసిన సంగతిని గుర్తుచేశారు. రాష్ట్రంలోని 13 జిల్లాలను ఐదు రీజియన్లుగా చేసి.. ఐదుగురు కమిషన్ సభ్యులకు బాధ్యతలు అప్పగించామన్నారు. మహిళలకు సంబంధించిన చట్టాలపై అవగాహన, ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘దిశ’ బిల్లు పై మరింత అవగాహన కల్పించేందుకు ప్రకటనలు, ప్రచారాలు ‘సబల’లో ఉంటాయన్నారు. కాలేజీ, యూనివర్సిటీలలో కొన్ని ప్రాంతాలలో సభ్యులను ఎన్నుకుని మహిళల భద్రతను పర్యవేక్షించేందుకు ‘క్యాంపస్ కాప్స్’ కార్యక్రమం అమలు చేస్తున్నట్లు వివరించారు. అదేవిధంగా డిజిటల్ పరిష్కారాలు, పాఠ్యాంశాలు, ప్రచారపోటీలు, బుక్ లెట్స్ విడుదల, మొబైల్ మానసిక కేంద్రాల ఏర్పాటు, శిక్షణ కార్యక్రమం, ఉద్యోగకల్పనకు భరోసా తదితర కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు అమె స్పష్టం చేశారు. సబల కార్యక్రమాలపై సచివాలయ వ్యవస్థను ఉపయోగించుకునే విధంగా కార్యచరణకు పూనుకున్నామని వాసిరెడ్డి పద్మ వివరించారు. సమావేశంలో కమిషన్ కార్యదర్శి శైలజ, సభ్యులు గజ్జల లక్ష్మి, కర్రి జయశ్రీ, షేక్ రుకియాబేగం, బూసి వినీత, గెడ్డం ఉమతో పాటు సెక్షన్ ఆఫీసర్లు పాల్గొన్నారు.