పంటల వివరాలపై సమగ్రంగా ‘శాటిలైట్ సర్వే’

ల్యాండ్ రీసర్వే తర్వాత వ్యవసాయ రికార్డుల నవీకరణ
47 లక్షలకు పైగా ‘అన్నదాత సుఖీభవ’ లబ్దిదారుల ఈకేవైసీ పూర్తి
త్వరలో సాగునీటి సంఘాలతో నేరుగా వర్చువల్ సమావేశాలు
యాప్ ద్వారా మత్స్యకారులకు సముద్ర మత్స్యసంపద వివరాలు
వ్యవసాయం-అనుబంధ రంగాలపై సమీక్షలో సీఎం చంద్రబాబు
4 గంటలకు పైగా లోతైన చర్చ – రైతులకు మేలు చేసేలా సూచనలు
నీటి నిర్వహణపై జలవనరుల శాఖ అధికారులతోనూ సమీక్ష
కాలువలు అన్నింటికీ నీటిని వదలాలని ఆదేశం
అమరావతి, జూలై 22 : రాష్ట్రమంతటా ఏ సర్వే నెంబర్ భూమిలో ఏ పంటలు పండిస్తున్నారనే పంటల వివరాలు శాటిలైట్ సర్వే ద్వారా సేకరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం భలభద్రాపురంలో చేపట్టిన శాటిలైట్ సర్వేతో సమగ్ర సమాచారం వెల్లడైందన్నారు. క్షేత్ర స్థాయిలో సేకరించిన సమాచారం, శాటిలైట్ సర్వే సమాచారం సరిపోల్చాలని స్పష్టం చేశారు. ఒక ప్రాంతంలో ఒకే తరహా పంటలు వేసేలా రైతులకు దిశా నిర్దేశం చేయాలని చెప్పారు. రైతు సేవా కేంద్రం నుంచి ఈ మేరకు నిరంతరం సూచనలు, సహకారం వారికి అందించాలన్నారు. రీసర్వే అనంతరం రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన జరిగిన తర్వాత వ్యవసాయ రికార్డులు కూడా నవీకరించాలని అధికారులను ముఖమంత్రి ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో వ్యవసాయం, అనుబంధ రంగాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. నాలుగు గంటలకు పైగా వ్యవసాయం-అనుబంధ రంగాలపై లోతైన చర్చ జరిపి… రైతులకు మేలు చేసేలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అలాగే, జలవనరుల శాఖ అధికారులతోనూ సమీక్ష నిర్వహించి నీటి నిర్వహణపై మార్గదర్శకాలు జారీ చేశారు.

రైతులకు సహకారానికి ఏఐ చాట్ బోట్ :
పంటల ప్రణాళిక, ఉత్పత్తులకు విలువ జోడింపు, రైతులకు సహకారం అందించేందుకు ఏఐ చాట్ బోట్ వినియోగంపై సమీక్షలో చర్చించారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రైతులకు అవసరమైన సమాచారాన్ని వారికి అందేలా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మరోవైపు ఇప్పటి వరకూ 47,41,792 మంది రైతుల వివరాలతో అన్నదాత సుఖీభవ పథకం కింద ఈకేవైసీ పూర్తయిందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఇ-పంట ద్వారా అర్హులను గుర్తించాలని, రాష్ట్రంలోని ప్రతీ రైతుకు ఈ పథకం ద్వారా ఆర్ధిక సాయం అందాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు.
సాగునీటి సంఘాలతో నేరుగా మాట్లాడతా :
వ్యవసాయరంగం అభివృద్ధికి తాను అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని… త్వరలో సాగునీటి సంఘాలతో వర్చువల్ సమావేశాలు సైతం నిర్వహించి వారితో నేరుగా మాట్లాడతానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మరోవైపు ఖరీఫ్ సీజన్‌లో దక్షిణ కోస్తాలోని కొన్ని జిల్లాలు మినహా రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. కృష్ణా, గోదావరి, వంశధార బేసిన్‌లలో ప్రధాన ప్రాజెక్టులు నిండుగా ఉన్నాయని.. సమృద్ధిగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం కూడా పెరిగిందని తెలిపారు. ప్రస్తుత ఖరీఫ్‌లో రాష్ట్రంలో 9.90 లక్షల హెక్టార్లలో వివిధ పంటల సాగు జరుగుతోందని చెప్పారు. అయితే, వర్షాధారంగానే పంటలు పండించేలా పంట కాలాన్ని ముందుకు తీసుకురావాలని ముఖ్యమంత్రి సూచించారు. దీనిని సంబంధించి అవసరమైతే మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు రైతులతో సంప్రదింపులు జరిపి… అవగాహన కల్పించాలన్నారు. సీజన్ కాలాన్ని ముందుకు తీసుకురాగలిగితే తుపాన్లు, భారీ వర్షాల నుంచి రైతులు పంట నష్ట పోకుండా జాగ్రత్త పడొచ్చని, అదే సమయంలో మరో పంటకు అవకాశం ఉంటుందని చెప్పారు. కరవు అనే మాట ఉండకూడదని, సమృద్ధిగా కురుస్తున్న వర్షపునీటి సద్వినియోగం ద్వారా ప్రాజెక్టుల నుంచి అతి తక్కువ నీటిని వాడుకునేలా ప్రణాళికలు ఉండాలన్నారు.

ఎరువులు, పురుగుమందుల వినియోగం తగ్గాలి :
రాష్ట్రంలో ఎరువులు, పురుగుమందులను అవసరానికి మించి వినియోగిస్తున్నారని… ఈ కారణంగా భూసారం తగ్గిపోతోందని… ఎరువులు, పురుగు మందులు ఏమేరకు వాడాలో రైతులకు వివరించి… వాటిని అధికంగా వినియోగించకుండా నియంత్రించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఎరువుల వినియోగం తగ్గించి ప్రకృతి సేద్యం దిశగా ప్రోత్సహించాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 36.71 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు వినియోగించగా, అంతకుముందు ఏడాదితో 12 శాతం మేర తగ్గిందని అధికారులు వెల్లడించారు. అలాగే, 2024-25లో 1,733 మెట్రిక్ టన్నుల పురుగుమందులు రాష్ట్రంలో వినియోగం జరిగిందని తెలిపారు. అయితే, ఆర్గానిక్-బయో ఫెర్టిలైజర్ల వినియోగంపై అవగాహన పెంచాలని ముఖ్యమంత్రి చెప్పారు. పంటలను చీడపీడల నుంచి రక్షించేలా ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మేంట్ సిస్టం తీసుకురావాలని ముఖ్యమంత్రి సూచించారు. సాంకేతికతను వినియోగించుకుని పురుగు మందుల విస్తృతికి అడ్డుకట్ట వేయొచ్చని చెప్పారు. విత్తనాలు, ఎరువుల విక్రయం పై చిట్టచివరి వరకూ ట్రాకింగ్ జరగాలన్నారు. వరిలో కలుపు మొక్కల నివారణలో ప్రమాదకరమైన కెమికల్స్ వాడకంతో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని అధికారులు తెలుపగా, ఎక్కడెక్కడ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయో సమాచారాన్ని సేకరించాలని… కేసులు ఎక్కువ నమోదవుతున్న చోట్ల రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి సూచించారు.
ఆర్గానిక్ సర్టిఫికేషన్‌తో అధిక ఆదాయం :
పురుగుమందులు, ఎరువులు వినియోగించకుండా పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు సర్టిఫికేషన్ ఇస్తే ఆయా ఉత్పత్తులకు అధిక డిమాండ్ ఉంటుందన్నారు. తద్వారా రైతులకు అధిక ఆదాయం వస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. ఆర్గానిక్ ఉత్పత్తుల సర్టిఫికేషన్‌కు సంబంధించి టాటాతో త్వరలో ఒప్పందం చేసుకునేందుకు ముఖ్యమంత్రి అనుమతించారు. ఎన్‌పీఓపీ సర్టిఫికేషన్లతో జపాన్, తైవాన్ లాంటి దేశాలకు వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేయవచ్చన్నారు. ఇండి గ్యాప్ సర్టిఫికేషన్‌తో పండ్లను 130 దేశాలకు ఎగుమతి చేసే అవకాశం లభిస్తుందన్నారు. విలువ జోడింపు ద్వారా వ్యవసాయ, ఉద్యాన పంటల ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయాలని సీఎం సూచించారు. చిత్తూరు జిల్లాలో మామిడి, మిర్చి లాంటి ఉత్పత్తులకు డిమాండ్ పెరిగేలా చూడాలన్నారు. దేశీయంగా డిమాండ్ లేని ఉత్పత్తులను సర్టిఫికేషన్ ద్వారా విదేశాలకు ఎగుమతి చేసేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
నిరంతరం క్రాప్ హెల్త్ మోనిటరింగ్ :
రాష్ట్రంలో క్రాప్ హెల్త్ మోనిటరింగ్ నిరంతరం జరగాలని ముఖ్యమంత్రి అన్నారు. ఇందుకోసం 42 ప్రమాణాలను అనుసరించాలని సూచించారు. నీటి సంరక్షణ నిర్మాణాల ద్వారా భూగర్భజలాలు పెరిగేలా చూడాలని, 1000 టీఎంసీల మేర భూగర్భజలాలు ఉండాలనేది మన లక్ష్యమని అధికారులకు ముఖ్యమంత్రి నిర్దేశించారు. అలాగే కాలువలను పూడిక తీయించి అంతరాయం లేకుండా ప్రవాహాలు వెళ్లేలా చూడాలన్నారు. వ్యవసాయం- జలవనరుల శాఖ సమన్వయంతో పనిచేయాలని… అప్పుడే రైతులకు ఫలితాలు వస్తాయన్నారు. నీటి పంపిణీపై సాగునీటి సంఘాలతో కలిసి కసరత్తు చేయాలన్నారు. వ్యవసాయంలో డ్రోన్లను విస్తృతంగా వినియోగించేలా చూడాలని, ప్రస్తుతం వ్యవసాయంతో పాటు 15 రంగాల్లో డ్రోన్లను వినియోగించేందుకు అవకాశం ఉందని అధికారులకు ముఖ్యమంత్రి చెప్పారు. డ్రోన్లతో సాగు సులభం అవుతుందన్నారు.
పొగాకు, మామిడి కొనుగోళ్లపై కలెక్టర్లకు ఆదేశాలు :
ఈ సీజన్‌లో వ్యవసాయ అధికారులను ఇతర వ్యవసాయేతర విధులకు వినియోగించొద్దని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలో పాల్గొన్న జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు. హెచ్డీ బర్లీ, మ్యాంగో రైతులకు చెల్లింపులపైనా సీఎం మాట్లాడారు. మార్క్ ఫెడ్ నుంచి రెండు విడతల్లో బకాయిలు చెల్లించాలని సూచించారు. ఆగస్టు 20 లోగా హెచ్డీ బర్లీ పొగాకు కొనుగోళ్లు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. తోతాపురి మామిడి కొనుగోళ్లపై ఆయా జిల్లా కలెక్టర్లతో మాట్లాడిన ముఖ్యమంత్రి ఆగస్టు 15 లోగా మామిడి రైతులకు కూడా డబ్బులు చెల్లించాలని చెప్పారు. విలువ జోడింపులో భాగంగా కవర్ బ్యాగుల్లో పండించిన తోతాపురి మామిడి పళ్ల నాణ్యతను సీఎం పరిశీలించారు. టేబుల్ వెరైటీ పండించడం ద్వారా దేశీయంగా, పల్ప్ లాంటి ఉత్పత్తులతో విదేశాలకు ఉత్పత్తులు పంపేందుకు కార్యాచరణ చేపట్టాలన్నారు. రైతుల నుంచి కొనుగోళ్లు జరపని కంపెనీలపైనా కఠినంగా వ్యవహరించాలని చెప్పారు.

సూక్ష్మ సేద్యమే గేమ్ చేంజర్ :
ఉద్యాన పంటలకు సూక్ష్మ సేద్యం గేమ్ చేంజర్ అవుతుందని… ప్రస్తుతం 16.17 లక్షల హెక్టార్లలో దీని కింద సాగువుతుందని… మరింత విస్తరించేందుకు ప్రయత్నించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. నీళ్లు లేని చోట మైక్రో ఇరిగేషన్, నీటి వనరుల లభ్యత అధికంగా ఉన్న చోట్ల ఫ్లడ్ ఇరిగేషన్ అమలుకు అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. రాయలసీమలో సూక్ష్మ సేద్యంతో పాటు కాలువల ద్వారా నీరిస్తే రైతులకు మరింత లాభదాయకంగా మారుతుందన్నారు. రాష్ట్రంలోని అన్ని కాలువల ద్వారా నీటిని విడుదల చేసి చిట్టచివరి ఆయకట్టువరకు నీటిని విడుదల చేయాలని నీటిపారుదల శాఖ అధికారులకు సూచించారు. నాగార్జున సాగర్ కుడికాలువ ద్వారా గుంటూరు ప్రాంతానికి సాగునీరు అందించాలన్నారు.
అపార్ట్‌మెంట్ల చెంతకు మొబైల్ రైతుబజార్లు :
వ్యవసాయం-అనుబంధ ఉత్పత్తులు నగరాల్లో ఇంటి ముంగిటకు తీసుకువెళ్లి నేరుగా రైతులే విక్రయించేలా చూడాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. ముఖ్యంగా అపార్ట్‌మెంట్లు, గృహ సముదాయాల దగ్గర విక్రయాలకు అవకాశం కల్పించాలన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పెరగక్కుండా, తగ్గిపోకుండా ఈ ప్రక్రియ ఉపకరిస్తుందన్నారు. అలాగే అన్ని నియోజకవర్గ కేంద్రాలు, ముఖ్యమైన ప్రాంతాల్లో మొబైల్ రైతు బజార్లు ప్రవేశ పెట్టాలని చెప్పారు. 30 రోజుల్లోగా దీనిపై కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు
నాణ్యతా ప్రమాణాలు పాటిస్తేనే సబ్సిడీ :
మెరుగైన ఆదాయం వచ్చే వాణిజ్య పంటలను రైతులు సాగు చేసేలా ప్రోత్సహించాలని సీఎం సూచించారు. ఆక్వా ఉత్తత్పుల నాణ్యత విషయంలో రాజీ లేదని… ఉత్పత్తుల నాణ్యత అంతర్జాతీయ ఎగుమతులకు తగ్గట్టు ఉండాలన్నారు. చికెన్ వ్యర్ధాలను ఫీడ్‌గా ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించే ఆక్వా రైతులకే సబ్సిడీ విద్యుత్ అందించే అంశాన్ని పరిశీలించాలన్నారు. సముద్రంలో మత్స్య సంపద ఏ ప్రాంతంలో ఎక్కువ లభిస్తుందో మత్స్యకారులకు యాప్ ద్వారా తెలియజేయాలన్నారు. సముద్రంలో ఉత్పత్తయ్యే సీవీడ్ ఎక్కువ మంది సాగు చేసేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలన్నారు. వివిధ రకాల ఉత్పత్తుల తయారీలో వినియోగించడంతో పాటు, బయో ఫ్యూయల్‌గా కూడా సీవీడ్‌ను వినియోగించేలా అధ్యయనం జరగాలని చెప్పారు. ఉద్యానరంగంతో సమానంగా పశుపోషణకు, ఆక్వా ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు. లైవ్ స్టాక్‌లో 15 శాతం వృద్ధిని లక్ష్యంగా నిర్దేశించారు. వ్యవసాయ అనుబంధ రంగాలను ఇకపై ప్రత్యేకంగా సమీక్షిస్తానని అన్నారు.
‘కోకో ముంజ్’పై ముఖ్యమంత్రి ప్రశంసలు :
సమీక్షలో కొబ్బరితో తయారు చేస్తున్న ‘కోకో ముంజ్’ సంస్థ ఉత్పత్తులను పరిశీలించిన ముఖ్యమంత్రి… సంస్థ ప్రతినిధిని అభినందించారు. ఈ సమీక్షకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, వ్యవసాయం-అనుబంధ రంగాలకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు.