Medical and Health

పీజీ మెడికల్ ఇన్-సర్వీస్ కోటాలో ఈ ఏడాదికి 20 శాతం సీట్లు

రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్

కేటాయింపునకు ప్రభుత్వ అంగీకారం
ఉన్న పోస్టులు 103..
ప్రయోజనం 258 మందికి

అయినా పి హెచ్ సి వైద్యుల్లో కనిపించని మార్పు

2030 వరకు కొనసాగించేలా హామీ ఇస్తేనే ఆందోళనలు విరమిస్తామని వెల్లడి

కుదరదన్న వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్

పీహెచ్సీ వైద్యుల డిమాండ్ మేరకు పీజీ ఇన్-సర్వీస్ కోటాలో 20% సీట్లను ఈ ఏడాదికి క్లినికల్లోని అన్ని విభాగాల్లో కలిపి కేటాయించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ వెల్లడించారు. వైద్యుల టైంబౌండ్ పదోన్నతులు, ట్రైబల్ అలవెన్స్, ఇతర సర్వీస్ వ్యవహారాల పరిష్కారంపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు విజయవాడలోని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ప్రధాన కార్యాలయంలో ఆందోళనలో ఉన్న పీహెచ్సీ వైద్యుల సంఘం ముఖ్య నేతలతో ఆదివారం వీరపాండియన్ చర్చించారు. “15% సీట్లను క్లినికల్ కేటగిరిలోని అన్ని విభాగాల్లో కలిపి కేటాయించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని మీరు పునఃపరిశీలన చేయాలని కోరారు. దీనిపై ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మధ్య చర్చలు జరిగాయి. ఈ మేరకు 15%కు బదులు 20% సీట్లను పీజీ ఇన్ సర్వీస్ కోటాలో కేటాయించేందుకు అంగీకారం తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడుతాయి. వెంటనే విధుల్లో చేరాలని కోరుతున్నా’ అని వీరపాండియన్ సంఘం నేతలకు తెలిపారు. అయితే 20% సీట్లను కేటాయించడాన్ని 2030 వరకు కొనసాగించాలని వైద్యులు పదేపదే డిమాండ్ చేయగా ప్రభుత్వం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని వీరపాండియన్ స్పష్టంచేశారు. సంఘం నేతలు మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని తాము ఆమోదించడంలేదని, యధావిధిగా ఆందోళనలు కొనసాగిస్తామని చెప్పి, అక్కడి నుంచి నిష్కృమించారు.

ప్రభుత్వ నిర్ణయాన్ని తిరస్కరించడం సమంజసం కాదు!

వైద్యుల తీరుపట్ల కమిషనర్ వీరపాండియన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు ఈ సందర్భంగా తనను కలిసిన విలేకర్లతో మాట్లాడారు. ‘అన్ని కోణాల నుంచి పరిశీంచిన అనంతరమే ప్రభుత్వం 20% సీట్ల కేటాయింపుపై నిర్ణయాన్ని తీసుకుంది. తదుపరి సంవత్సరాల్లో ఈ కోటాను ఎలా అమలుచేయాలన్న దానిపై సమగ్రంగా అధ్యయనం చేసి, విధానపరమైన నిర్ణయాన్ని వచ్చేనెలలోగా తీసుకుంటుందని తెలియచేసినా వైద్యులు పట్టించుకోవడంలేదు. ఈ ఏడాది నవంబరు నుంచి 2027 నవంబరు మధ్య కలిపి 1,089 మంది పీజీలు తిరిగి విధుల్లోనికి వస్తారు. వీరు జిల్లా, ప్రాంతీయ, సామాజిక, బోధనాసుపత్రుల్లో నియామకాలు చేపట్టినప్పుడు స్పెషాల్టీ వైద్యులుగా చేరతారు. అందుకు తగ్గ ఖాళీలు ఉండని పరిస్తితి ఈ పరిస్థితుల్లో ఇన్సర్వీస్ కోటా ఎలా ఉండాలన్న దానిపై చర్చించేందుకు తగిన వ్యవధి అవసరం వైద్యులు అర్ధంచేసుకోవాలి.

103 పోస్ట్లు కంటే ఎక్కువగా

పీజీ ఇన్ స‌ర్వీస్ కోటా అమ‌లు ఎలా ఉండాల‌న్నదానిపై అధ్య‌య‌నం చేసిన నిపుణుల క‌మిటీ 2025-26 సంవ‌త్స‌రానికి సంబంధించి బోధానాసుప‌త్రుల్లో 100 అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ల పోస్టులు, సెకండ‌రీ హెల్త్ డైరెక్ట‌రేట్ ప‌రిథిలో 3 మాత్ర‌మే ఉన్నాయ‌ని అధికారులు పేర్కొన్నారు. దీని ప్ర‌కారం 103 పోస్టుల‌కు సంబంధించి మాత్ర‌మే ఇన్ స‌ర్వీస్ కోటా ఈ ఏడాదికి అమ‌లు చేయాలి. కానీ, వైద్యుల సంఘం విజ్ఞ‌ప్తి మేర‌కు ఉదారంగా వ్య‌వ‌హ‌రించినందున 15% ప్రకారం
196మందికి ఇన్ స‌ర్వీస్ కోటాలో సీట్లు లభించేవి ఇప్పుడు 20%కు పెంచినందున 258 మంది ప్రయోజనం పొందుతారు.

రోగులకు సేవలు అందించడం ముఖ్యం!

రోగులకు వైద్య సేవలు అందించడం ముఖ్యమైనందున పోస్టుల భర్తీని జీరో వెకెన్సీ కింద ఎప్పటికప్పుడు చేబడుతున్నాం భవిష్యత్తులో ఖాళీ అయ్యే వైద్యుల పోస్టుల సంఖ్యకు అనుగుణంగా ఇన్-సర్వీస్ కోటా ఉండాలని కొద్దికాలం కిందట నిపుణుల కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ మేరకు 7 క్లినికల్ స్పెషాల్టీల్లో 15% కోటా కింద సీట్లు భర్తీ చేయాలని తొలుత ప్రభుత్వం నిర్ణయించింది. అయితే చర్చల సందర్భంగా పీహెచ్సీ వైద్యుల సంఘం విజ్ఞప్తి మేరకు అన్ని స్పెషాల్టీ కోర్సుల్లో 15% సీట్ల భర్తీ చేస్తామని చెప్పాం వారి కోర్కె మేరకు మళ్లీ 15%ను 20% చేస్తామని హామీ ఇచ్చినా వైద్యుల తీరు మారడంలేదు.

డైరెక్ట్ పీజీ వైద్యులకు అవకాశాలు తగ్గుతున్నాయి!

ఇన్-సర్వీస్ కోటా అమలుతో ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు సేవలు చేయాలనుకునే డైరెక్ట్ పీజీ వైద్యులకు అవకాశాలు తగ్గుతున్నాయి. వైద్యుల నియామక నోటిఫికేషన్లో ఎక్కడా కూడా ఇన్సర్వీసు కోటా పీజీ సీట్ల గురించి పేర్కొనడంలేదు. టైం బౌండ్ పదోన్నతులు, ట్రైబల్ అలవెన్స్, నోషనల్ ఇంక్రిమెంట్లు గురించి చర్చించి, ప్రభుత్వానికి సిఫార్సులు చేసేందుకు ఇప్పటికే ప్రత్యేకంగా కమిటీ వేశాం’ అని వీరపాండియన్ వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *