ఆర్గానిక్ ఆహారంతో మేధో వికాసం
మారుతున్న కాలానికి అనుగుణంగా దైనందిన మానవ జీవితంలో ఆర్గానిక్ ఆహారాన్ని తప్పక తీసుకోవాల్సిన అవసరం ఉందని సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ మరియు ఎక్స్ అఫీషియో కార్యదర్శి తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. విజయవాడ ఎస్.ఎస్. కన్వెన్షన్లో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ఆర్గానిక్ మేళాను ఆదివారం సాయంత్రం కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి సందర్శించారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్గానిక్ పోషక విలువలను ప్రజలకు వివరిస్తూ ఏర్పాటు చేసిన ఆర్గానిక్ మేళా నిర్వాహకులను అభినందించారు. నేటి దైనందిన జీవితంలో మనం తీసుకునే ఆహారం పోషక విలువలు లోపించి అనేక రుగ్మతలకు గురయ్యే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయన్నారు. వీటిని అధిగమించాలంటే తప్పనిసరిగా ఆర్గానిక్ ఆహారాన్ని తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పిల్లలకు చిన్నతనం నుంచే పోషక విలువలతో కూడా పౌష్టికాహారం అందించినట్లైతే ఆరోగ్యవంతంగా ఎదగడమే కాకుండా మేథాశక్తి కూడా పెరుగుతుందన్నారు. భవిష్యత్ లో ఇటువంటి ఆర్గానిక్ ఉత్పత్తులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి ప్రజల్లో ఆర్గానిక్ ఆహారం పట్ల అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆర్గానిక్ మేళా సందర్శనలో కమిషనర్ వెంట సమాచార, పౌరసంబంధాల శాఖ జాయింట్ డైరెక్టర్ తేళ్ల కస్తూరి, నిర్వాహకులు పాల్గొన్నారు.