ap news

సంక్రాంతి సంబరాల్లో జగన్, భారతి

రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో వద్ద ఉన్న గోశాలలో శుక్రవారం సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. సీఎం జగన్ తో పాటు ఆయన సతీమణి భారతి సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. గ్రామీణ వాతావరణ ఉట్టిపడేలా ఏర్పాట్లు చేశారు. జగన్మోహన్ రెడ్డి సంప్రదాయ దుస్తులు ధరించి ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి దంపతులకు మేళ తాళాలలతో వేదపండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ఆశీర్వచనాలు అందించారు. సీఎం జగన్ జ్యోతి ప్రజ్వలన చేసి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు.  గోపూజ, గోసేవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేద పండితులు శాలువతో ముఖ్యమంత్రిని సత్కరించి చిత్రపటాన్ని అందజేశారు.

గ్రామీణ ప్రాంతం ఉట్టిపడేలా..

గ్రామీణ వాతావరణం ఉట్టిపడే విధంగా గోశాల వద్ద ఎం ఎల్ ఏ చెవిరెడ్డి భాస్కర రెడ్డి చిన్న గ్రామాన్ని నిర్మించారు. ఆ గ్రామ వాతావరణంలో తులసి కోట, ధాన్యపు రాశులు, చెరుకు గడలు, రంగవల్లులు, ముత్యాల ముగ్గులు, భోగిమంటలు, గొబ్బెమ్మలు, డోలువాద్యాలు, కోలాటాలు, హరిదాసులు, గంగిరెద్దులు, అరిసెలు వండడం తదితర అంశాలను ఏర్పాటు చేశారు. కోలాటం, డోలు విన్యాసాలు, గంగిరెద్దుల విన్యాసాలు, నృత్య ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. మంగ్లీ ఆలపించిన సంక్రాంతి గీతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంక్రాంతికి గుర్తుగా హరిదాసుకు ముఖ్యమంత్రి దంపతులు బియ్యం అందజేశారు. ప్రదర్శన ఇచ్చిన చిన్నారులు, కళాకారులను ఆశీర్వదించి ముఖ్యమంత్రి ఫోటోలు దిగారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు అంతా మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నానన్నారు. ఈసందర్బంగా ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. చెవిరెడ్డి భాస్కర రెడ్డి ముఖ్యమంత్రికి (జగన్) చిత్ర పటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖా మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, టీటీడీ చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి, శాసన సభ్యులు మల్లాది విష్ణు, జోగి రమేష్, ఎం ఎల్ సి లేళ్ల అప్పి రెడ్డి, ఐ ఏ ఎస్ అధికారులు ప్రవీణ్ ప్రకాష్, పూనం మాల కొండయ్య, వాణి మోహన్, పలువురు అధికారులు, అనధికారులు పాల్గొన్నారు.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *