త్వరలో సినీ పరిశ్రమకు శుభవార్త
సీఎంతో భేటీ అనంతరం ట్వీట్ చేసిన మెగాస్టార్
అంతకుముందు సీఎంతో చర్చలు
పాల్గొన్న నారాయణమూర్తి, ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి, కొరటాల శివ, అలీ, పోసాని తదితరులు
తెలుగు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను సానుకూలంగా పరిష్కరించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి సహృదయంతో అంగీకరించారని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ఈ మేరకు సీఎంతో చర్చల అనంతరం గురువారం ఆయన ట్వీట్ చేశారు. సీఎంతో చర్చలు సుహృద్భావ వాతావరణంలో కొనసాగాయి..అందరికీ ఆమోదయోగ్యమైన విధి విధానాలు త్వరలోనే అమలుకు నోచుకుంటాయి..తెలుగు సినీ పరిశ్రమకు అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చిన సీఎంకు కృతజ్ఞతలు..సీఎం ఇచ్చిన భరోసాతో తెలుగు సినీ పరిశ్రమ రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళుతుంది..త్వరలోనే అందరికీ శుభవార్త అందుతుందని చిరంజీవి ట్వీట్ చేశారు.
సీఎంతో భేటీ సందర్భంగా చిరంజీవి..
కమిటీ ఇచ్చిన నివేదికతో పాటు, మంచి, చెడ్డలు తెలుసుకోవడానికి, మా అభిప్రాయం సేకరించడానికి తొలుత ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి నన్ను ఆహ్వానించారు. ఆ తర్వాత కలిసికట్టుగా అందరం వచ్చి అభిప్రాయలను వ్యక్తీకరించడానికి ఈ అవకాశం కల్పించినందుకు చాలా ధన్యవాదాలు. మీ అభిప్రాయాలను, మీ నిర్ణయాలను ఎప్పుడూ గౌరవిస్తాం. మీరు పేదల మనిషి. పరిశ్రమలో అందరితో మాట్లాడి మీ ముందుకు వచ్చాం. ఉభయులకీ సామరస్యంగా ఉండేలా నిర్ణయం తీసుకోవడం బాగుంది. ప్రతిపాదనలు చూశాక మాకు చాలా సంతృప్తి వచ్చింది. చాలా సంతోషంగా ఉన్నాం. మా అందరికీ చాలా వెసులుబాటు కల్పించారు. మీరు తీసుకున్న నిర్ణయాలు పట్ల ఎగ్జిబిటర్ల రంగం చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నాం.
టిక్కెట్ రేట్లుగానీ, ఇతరత్రా విషయాల్లో చాలా ఎక్సర్‌సైజ్‌చేశారు. పెట్టే అమ్మని అన్నీ అడుగుతారు. ఇచ్చేవారినీ కోరుతారు. అందుకే మా కోరికలు కోరుతున్నాం. సినిమా ధియేటర్‌కి ప్రేక్షకులను రప్పించడానికి కొన్ని ప్రత్యేకతలు సినిమాలోకి తీసుకురావాల్సి వస్తోంది. విజువల్ ఇంపాక్ట్ కోసం ఖర్చు చేయాల్సి వస్తోంది.అవి ఉంటేనే కానీ జనాలు ధియేటర్‌కి వెళ్లి సినిమా చూడాలనే మూడ్‌లో లేరు. మా సినిమాలు విడుదలైన వారంరోజుల్లో ప్రేక్షకుల ముందుకు ఓటీటీ రూపంలో వస్తోంది. అలాగే ఫైరసీ ఎప్పటి నుంచో మాకున్న పెద్ద గొడ్డలిపెట్టు. ఇవన్నీ అధిగమించి మేం సినిమాలు తీయాలంటే.. మేం ఖర్చు అధికంగా పెట్టాల్సి వస్తోంది.
తెలుగుతనాన్ని, తెలుగు సినిమాని కాపాడే దిశగా మీరు ఉన్నారు. అది కొనసాగే దిశగా మీ చర్యలు కొనసాగాలి. అందులో భాగంగా ఇండస్ట్రీ వైపు చల్లని చూపు చూడాలి. తల్లి స్ధానంలో ఉన్నారు కాబట్టి మిమ్నల్ని అడుగుతున్నాం. తర్వాత ఐదో షో మన నారాయణమూర్తి గారు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. అది ఉంటే మనకు కొంత వెసులుబాటు ఉంటుంది. అది మీ ముందు పెడితే మీరు ఒప్పుకున్నారు.
మహేష్‌బాబు..
కోవిడ్ కారణంగా సినిమా పరిశ్రమకు పెద్ద ఇబ్బంది వచ్చింది. గడచిన 2 ఏళ్లనుంచీ తీవ్ర సంక్షోభం ఉంది..మా కెరీర్‌లో ఈ రెండేళ్లు చాలా ఇబ్బంది కరంగా ఉంది..ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు మధ్య ఉన్న గ్యాప్… ఈ తరహా చర్చలు వల్ల తొలగిపోతాయి. మా అందరికీ గత రెండేళ్లు చాలా కష్ట కాలం. ఎప్పుడు షూటింగ్ ఆగిపోతుందో.. ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు. ఇవాళ చాలా సంతోషకరమైన రోజు.
రాజమౌళి..
ఇప్పటివరకూ ఒక రకమైన భ్రమ ఉండేది. సినీ పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య ఒక అగాధం ఉందనే భ్రమ ఉండేది. అది తొలగిపోయింది. మాతో కలిసి నేరుగా మీరు మాట్లాడుతున్నందుకు సంతోషంగా ఉంది.
ఆర్. నారాయణ మూర్తి
సగటు సినిమా బతకాలి. పండుగ వచ్చినా, సెలవులు వచ్చినా… పెద్ద సినిమాలకే అవకాశాలు వస్తున్నాయి. సగటు సినిమా బతకాలి.హిట్ అయితేనే సినిమాలు చూస్తారు.చిన్న సినిమాలకు నూన్ షో ఉండాలని కోరుతున్నాం. భారీ సినిమా ఎలాంటి ఫలితాలు అనుభవిస్తుందో.. సగటు సినిమా అలాంటి ఫలితాలు అనుభవించాలి.
ఆలీ..
గతంలో సినిమా 50 రోజులు, 100 రోజులు ఆడేవి. శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ మూడు రోజుల్లో ఏ స్టార్ సినిమా అయినా హిట్ లేదా ప్లాప్. ఇండస్ట్రీలో దర్శకులు, నిర్మాతలు, నటులు మాత్రమే కాదు వేల మంది టెక్నీషియన్లు పరిశ్రమలో చాలామంది ఉన్నారు. ఇండస్ట్రీకి మంచి చేస్తే ఆ టెక్నీషియన్స్ గుండెల్లో మీరు ఉండిపోతారు.
పోసాని కృష్ణమురళి
చిన్న సినిమాలు బతకాలి. ఇంతకు ముందు నేను చిన్న సినిమాలకు రాసేవాడిని. ప్రేయసిరావే, గాయం, స్నేహితులు… ఇలాంటి వాటికి నేను రాశాను.. శివయ్య నేనే రాశాను. పెద్ద హిట్ అయింది. చిన్న సినిమాలకు థియేటర్లు ఇవ్వడంలేదు. వీటి వల్ల చిన్న సినిమా చచ్చిపోయింది. సీఎంగారు చేయాలనుకుంటే.. ఏదైనా మనస్ఫూర్తిగా చేస్తారు.చిన్న సినిమాలకు మీరు తోడుగా నిలవండి.కేరళలో కూడా చిన్న సినిమాలు బాగా నడుస్తున్నాయి.సినిమా పరిశ్రమలో 30వేల టెక్నీషియన్లు ఉన్నారు.