గౌతమునికి ఘన వీడ్కోలు
పుష్పాంజలి ఘటించిన సీఎం దంపతులు
కన్నీటి సంద్రమైన అభిమానులు
దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు బుధవారం ఉదయం నెల్లూరు జిల్లా ఉదయగిరి లోని మెరిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతి, టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి తదితరులు హాజరై ఘన నివాళి అర్పించారు. బుధవారం ఉదయం 11.30 గంటలకు ప్రత్యేకంగా మెరిట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు ముఖ్యమంత్రి చేరుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసిన వారిలో జిల్లా ఇంఛార్జి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి, రైల్వేకోడూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ శ కొరముట్ల శ్రీనివాసులు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, గుంటూరు రేంజ్ డిఐజి త్రివిక్రమ వర్మ, జిల్లా కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు, ఎస్ పి శ్రీ విజయ రావు ఉన్నారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విశ్రాంతి టెంట్ లో మంత్రి మేకపాటి గౌతం రెడ్డి తండ్రి మేకపాటి రాజమోహన్‌రెడ్డిని సీఎం పరామర్శించారు. అనంతరం దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి పార్థివదేహానికి సతీ సమేతంగా ముఖ్యమంత్రి పుష్పాంజలి ఘటించారు. గౌతంరెడ్డి అంతిమయాత్రకు వేలాది మంది ప్రజలు, అభిమానులు తరలివచ్చి తమ ప్రియతమ నేతకు కన్నీటి వీడ్కోలు పలికారు. అనంతరం ముఖ్యమంత్రి దంపతులు, టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి మధ్యాహ్నం 12.30 గంటలకు హెలికాప్టర్ లో కడపకు బయలుదేరి వెళ్లారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, గుంటూరు రేంజ్ డిఐజి త్రివిక్రమ వర్మ, జిల్లా కలెక్టర్ శ్రీ కే.వి.ఎన్ చక్రధర్ బాబు సీఎంకు వీడ్కోలు పలికారు.
అంతిమయాత్ర ఫొటో గ్యాలరీ..