రాజ్యాంగానికి విరుద్ధంగా జగన్ పాలన
కళంకిత ప్రజా ప్రతినిధులను మంత్రులను చేసిన ఘనత జగన్ రెడ్డి దే
బిహార్లో విన్న కథలు.. ఏపీలో ప్రత్యక్షంగా చూస్తున్నాం
20వ తేదీన తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం
పోస్టర్ విడుదల చేసిన ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్
ఏపీలో జగన్ పాలన ఆటవికంగా మారుతోందని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ ఆరోపించారు. పోలీస్ కట్టుకథలు మరింత విస్మయానికి గురి చేస్తున్నాయన్నారు. బిహార్లో విన్న కథలు ఏపీలో ప్రత్యక్షంగా చూస్తున్నామన్నారు. దళిత బిడ్డలను చంపినా.. కొట్టినా పట్టించుకోలేదన్నారు. ఏపీని అప్పుల ప్రదేశ్ గా మార్చిన ఘనత జగన్ దేనని శైలజనాథ్ పేర్కొన్నారు. సలహాదారులకు లక్షల జీతాలు ఇచ్చి మేపుతున్నారన్నారు. వారితో రాష్ట్రానికి, సమాజానికి ఎటువంటి ప్రయోజనం లేదన్నారు. ప్రభుత్వాస్తులను అమ్మడం, అప్పగించడమే జగన్ పని అన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా జగన్ రెడ్డి పాలన నిర్వహిస్తున్నారని శైలజనాథ్ పేర్కొన్నారు. సోమవారం విజయవాడ ఆంధ్ర రత్న భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం చైర్మన్ కొరివి వినయ్ కుమార్, ఏపిసిసి ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్ ఇంచార్జి) పరస రాజీవ్ రతన్, ఏపిసిసి కార్యదర్శి (అడ్మినిస్ట్రేషన్ ఇంచార్జి) రవికాంత్ నూతలపాటి, ఆర్టీఐ చైర్మన్ పీవై కిరణ్ కుమార్ లతో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఈనెల 20వ తేదీన తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించనున్న రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం పోస్టర్ ను విడుదల చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ రోజులు గడిచే కొద్దీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్ అధోగతి లో పయనిస్తోందని, జగన్ రెడ్డి ప్రభుత్వం కూల్చడం… కొట్టడం.. అవినీతి తప్ప చేసిన అభివృద్ధి ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రంలో జగన్ రెడ్డి భారత రాజ్యాంగం పై ప్రమాణం చేసి రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని, దళితులు, మైనారిటీల పై దాడులు పెరుగుతున్నా చోద్యం చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ కు రిజర్వ్ బ్యాంక్ ఈ ఏడాదికి రూ 84,334 కోట్ల రూపాయల అప్పుకు అనుమతి ఇస్తే ఇప్పటికే రాష్ట్రం రూ.82,096 కోట్లు అప్పు చేసేసిందని, ఇక అత్యవసర పరిస్థితుల్లో అప్పు ఎలా పుడుతుందో అంతుపట్టటంలేదన్నారు? ఇప్పటికే ఉన్న ఆస్తులను తాకట్టు పెట్టారని, ఇక ఏం పెడతారో అని అన్నారు. అధిక అప్పులు ఉన్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్ర ప్రదేశ్ ఐదవ స్థానానికి చేరుకుందని, ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, సంక్షేమ పథకాల అమలు కోసం ఎక్కడ నుంచి నిధులు తీసుకు వస్తారో చెప్పాలని కోరారు.
కళంకిత ప్రజా ప్రతినిధులను మంత్రులను చేసిన ఘనత జగన్ రెడ్డి దేనని, బహుశా వారంతా ఒకే కుటుంబం గా ఉండాలని అనుకుంటున్నారేమో అని ఎద్దేవా చేశారు. దేశవ్యాప్తంగా ధరల పెరుగుదల తో పేదల జీవితాలు చిన్నా భిన్నం అయ్యాయని, పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల కారణంగా నిత్యావసరాల ధరలు కొండెక్కి ఇబ్బందులు పడుతున్నారని, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్, ఆర్టీసీ, ఆస్తి పన్ను, చెత్త పన్ను అంటూ పేద, మధ్య తరగతి ప్రజలకు చుక్కలు చూపిస్తోందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ కి ఓటర్లు సరైన బుద్ధి చెప్పారని, దీనిని బట్టి మోడీ ప్రభుత్వం పై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో గుర్తించాలని, వారు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలే ఇందుకు కారణమని పేర్కొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ నాశనం కావడానికి వైసీపీ, టీడీపీ, జన సేన వంటి ప్రాంతీయ పార్టీలు కారణమని, అభివృద్ధి వినాశకాలుగా మారుస్తూ ఓట్ల రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. దేశం, రాష్ట్రం అభివృద్ది చెందాలన్నా, ధరలు తగ్గాలన్నా కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి… రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. దేశంలో, రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పై జరుగుతున్న దారుణాలపై ఈనెల 20వ తేదీన రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవాన్ని విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు వివరించారు.