ap news

ప్రజాసమస్యలపై దేశవ్యాపిత ఉద్యమాలు

వామపక్షాలు, భావసారూప్య పార్టీలతో సంప్రదింపులు

సిపిఐ(ఎం) రాష్ట్ర కమిటీ సమావేశంలో బి.వి.రాఘవులు

ప్రజలు ఎదుర్కొంటున్న తక్షణ సమస్యలు, అధిక ధరలు, ఇతర జీవనోపాధికి సంబంధించిన అంశాలపై దేశవ్యాపిత ఉద్యమాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సిపిఐ(ఎం) నిర్ణయించింది. వామపక్షాలు, ఇతర భావసారూప్య పార్టీలతో చర్చించి, నిర్దిష్ట కార్యక్రమాల్ని రూపొందిస్తామని పార్టీ పోలిట్‌బ్యూరో బి.వి రాఘవులు తెలిపారు. వై.వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయన ప్రస్తుత రాజకీయ పరిస్థితులను, పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయాలను వివరించారు. సోమ, మంగళవారం జరిగిన ఈ సమావేశంలో పార్టీ పోలిట్‌ బ్యూరో సభ్యులు ఎం.ఏ.బేబి పాల్గొన్నారు. అంతర్జాతీయ ఆర్ధిక మాంద్యం నానాటికీ తీవ్రమవుతున్నదని ప్రపంచ వాణిజ్యం ఒడిదుడుకులకు గురవుతోందన్నారు. ఉక్రెయిన్‌ యుద్ధంతో పరిస్థితి ఇంకా దిగజారుతోందన్నారు. రష్యా నుండి చౌకగా కొంటున్న ముడి చమురును శుద్ధి చేసి దేశీయంగానే చౌకగా అమ్మించి ప్రజలకు ఉపశమనం కలిగించడం బదులు విదేశాలకు అమ్మి విపరీతంగా లాభాలు పొందడానికి అనుమతిస్తూ మోడీ సర్కారు కార్పొరేట్ల సేవలో తరించిపోతోందన్నారు. అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రభుత్వాలు పొదుపు చర్యల పేరిట సంక్షేమానికి, వేతనాలకు, సర్వీసు నిబంధనలకు కోతలు పెట్టడంతో పెద్దఎత్తున పోరాటాలు వెల్లువెత్తుతున్నాయని తెలిపారు. భారత జిడిపి వృద్ధి రేటు అంచనాలు అంతకంతకూ తగ్గిపోతున్నాయని, ఒడిదుడుకులు కొనసాగుతున్నాయి. ధరలు, నిరుద్యోగిత పెరుగుదల ఆందోళనకరంగా ఉంది. ఇంధనం, ఆహార పదార్ధాల ధరలు అంతకంతకూ అధికమవుతున్నాయి. శ్రామికుల నిజవేతనాలు కుదించుకుపోవడం, ద్రవ్యోల్బణ పెరుగుదల ప్రజలు ముఖ్యంగా సామాన్యులు నలిగిపోతున్నారని అన్నారు. పేదలకు ఎంతోకొంత ఊరటగా ఉన్న ఉపాధి హామీకి మోడీ సర్కారు కోతలు, షరతులు పెట్టడంతో కష్టాలు మరింత పెరిగిపోతున్నాయని వివరించారు. మోడీ సర్కారు అండదండలతో అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ల సంపద నానాటికీ పెరిగిపోతోంది. బాధల్లో ఉన్న ప్రజలు ఐక్యంగా ఉద్యమాలు, పోరాటాలు చేయకుండా వారి మధ్య విద్వేషాన్ని అధికార పార్టీ ` సంఫ్‌ు పరివార్‌ కూటమి సృష్టిస్తున్నదని తెలిపారు. ఉత్తర భారతంలోనూ, కర్ణాటక, మణిపూర్‌ తాజా పరిణామాలను వివరించారు. రాజకీయ ప్రత్యర్ధులను భయభ్రాంతులకు గురి చేసేందుకు ఈడి, సిబిఐ, ఎన్‌ఐఎ తదితర కేంద్ర దర్యాప్తు సంస్థల్ని మోడీ సర్కారు ప్రయోగిస్తోందన్నారు. న్యాయవ్యవస్థపై దాడి, తదితర చర్యల ద్వారా నిరంకుశ పోకడలు మరింత పెరుగుతున్నాయన్నారు.
బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించాలన్న కోర్కె నానాటికీ అధికమవుతోందని, దాన్ని సాకారం చేయడానికి త్రిముఖ వ్యూహం కావాలన్నారు. అవి, జాతీయ స్థాయిలో ప్రభావితం చేయగల అంశాలపై వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర పార్టీలు ఉమ్మడిగా ఐక్య గళాన్ని వినిపించాలన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు బిజెపి వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా పూలింగ్‌ చేసుకోవాలని, ప్రజల జీవనోపాధి సమస్యలపై ఉద్యమాలు నిర్వహించాలని పార్టీ కేంద్ర కమిటీ పిలుపునిచ్చిందని వివరించారు. ఈ అవగాహనతో రాష్ట్రంలో ఉద్యమ కార్యాచరణను పార్టీ రాష్ట్ర కమిటీ రూపొందించాలని రాఘవులు కోరారు.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *