రాజ్యాగంపై అవగాహన – పౌర హక్కులకు భరోసా

- పాలకులు రాజ్యాంగానికి లోబడే పాలన సాగించాలి
- రాజ్యాగంపై సంపూర్ణ పరిజ్ఞానం పౌరులకు అవసరం
- భారత రాజ్యాంగం ప్రపంచలోనే అత్యున్నతం
- ఈనెల 20 నుంచి 26 వరకు వక్తృత్వపు పోటీలు
- విద్యార్ధులు, యువత విభాగాల్లో పోటీలు
- ప్రకాశం జిల్లా అభివృద్ధి వేదిక అధ్యక్షుడు చుండూరి రంగారావు
భారత రాజ్యాంగంపై ప్రతి ఒక్కరూ సంపూర్ణ అవగాహన, చైతన్యంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని ప్రకాశం జిల్లా అభివృద్ధి వేదిక అధ్యక్షుడు చుండూరి రంగారావు అన్నారు. రాజ్యాంగం అందించిన హక్కులు, బాధ్యతలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఒంగోలులోని ఎంసీఏ భవన్ లో శుక్రవారం ప్రకాశం జిల్లా అభివృద్ధి వేదిక, ఓపిడిఆర్, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అధ్యక్షతన రచించిన భారత రాజ్యాంగం 1950 జనవరి 26వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది అన్నారు. అనేక దేశాల రాజ్యాంగాలన్నిటిని అద్యయనం చేసిన తరువాత తయారు చేసిన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగమని అభివర్ణించారు. రాజ్యాంగమే భారత దేశపు ధర్మశాస్త్రమన్నారు. భారత రాజ్యాంగానికి భారత పౌరులందరూ విధిగా అంగీకరించాలన్న నిబంధన ఉందన్నారు. రాజ్యాంగ సభ ఆశించిన తీరులో భారత పౌరులు అభివృద్ధి చెందకపోవడానికి రాజ్యాంగం సక్రమంగా అమలు కాకపోవడమే కారణం.. భారత రాజ్యాంగం సమానత్వపు హక్కు, స్వాతంత్రపు హక్కు, దోపిడీని నివారించే హక్కు, మత స్వతంత్రపు హక్కు, సాంస్కృతిక విద్యా హక్కులు, వాక్ స్వాతంత్రం, భావవ్యక్తీకరణ స్వాతంత్రం భారత ప్రజలందరికీ అందించింది అన్నారు. ఆదేశిక సూత్రాలలో పౌరుల హక్కులైన ప్రాథమిక హక్కులు కాపాడటానికీ, సవ్యంగా అమలు చేయటానికి పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడటం ప్రభుత్వ విధి అని పేర్కొంది.. 14 లోపు సంవత్సరాల బాల బాలికలకు ఉచిత నిర్బంధ విద్య అందజేయాలని భారత రాజ్యాంగ స్పష్టం చేసిందని రంగారావు అన్నారు. దేశంలోని సహజ సంపద పై అందరికీ సమాన హక్కు ఉందన్నారు. ఏ కొద్ది మిద్ది చేతిలో సహజ సంపద ఉండటం భారత రాజ్యాంగానికి విరుద్ధమైన చర్య అన్నారు. నేటి ప్రభుత్వాలు రాజ్యాంగ నిబంధనలు తుంగలో తొక్కి తమ ఇష్టానుసారంగా దేశ సంపదను కొద్దిమందికి దోచిపెడుతున్నారన్నారు. ఇది రాజ్యాంగం లోని 39వ ఆర్టికల్ కు విరుద్ధమన్నారు. పౌరుల ఆహార, పౌష్టికాహార, ఆరోగ్య విషయాల పట్ల శ్రద్ధ వహించి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు.

20 నుంచి 26 వరకు వక్తృత్వపు పోటీలు
ఇటీవల కాలంలో అధికారంలోకి వచ్చిన కొన్ని రాజకీయ పార్టీలు అధికారంలో తాము ఉన్నాం కాబట్టి తాము చెప్పిందే రాజ్యాంగం అనే దోరణితో భారత రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ పాలన సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు రాజ్యాంగానికి లోబడే పాలన సాగించాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో రాజ్యాంగంపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించేందుకు, ఆసక్తి పెంచేందుకు ఈనెల 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఒంగోలులోని దేవుడి చెరువు రోడ్డులో గల ఎంసీఏ భవన్లో భారత రాజ్యాంగం కనీస అవగాహన అనే అంశంపై వక్తృత్వపు పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు, యువతకు వేర్వేరు విభాగాలలో నిర్వహించే పోటీలలో విజేతలకు జూనియర్ విభాగంలో ప్రథమ బహుమతిగా రూ. 6 వేలు, ద్వితీయ బహుమతిగా రూ. 5 వేలు, తృతీయ బహుమతిగా రూ. 4 వేలు, మరో పదికి పైగా కన్సోలేషన్ బహుమతులు అందిస్తున్నట్లు తెలిపారు. యువత విభాగంలో ప్రథమ బహుమతిగా రూ. 10 వేలు, ద్వితీయ బహుమతిగా రూ. 8 వేలు, తృతీయ బహుమతిగా రూ. 7 వేలు, మరో 10కి పైగా కన్సోలేషన్ బహుమతులు అందిస్తున్నట్లు తెలిపారు. బహుమతి, సర్టిఫికెట్ల బహుకరణ కార్యక్రమం ఆగస్టు మొదటి వారంలో నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జాతీయ సమాచార హక్కుల కమిషన్ విశ్రాంత కమిషనర్, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక విశ్రాంత కమిషనర్ మాడభూషి శ్రీధర్ హాజరు కానున్నట్టు తెలిపారు. రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ పేరయ్య మాట్లాడుతూ దేశానికి ధర్మశాస్త్రం భారత రాజ్యాంగమే అన్నారు. చదువు, సాంఘిక న్యాయం అందరి హక్కు అని అన్నారు. ఆచార్య రంగా కిసాన్ సంస్థ ప్రధాన కార్యదర్శి చుంచు శేషయ్య మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగం భారతదేశానిదే అన్నారు. భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభలో అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారని అన్నారు. ప్రజలందరూ భారత రాజ్యాంగం మనకు అందించిన ప్రాథమిక హక్కులు, బాధ్యతలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఓపిడిఆర్ రాష్ట్ర అధ్యక్షుడు చావలి సుధాకర్ మాట్లాడుతూ రాజ్యాంగానికి కట్టుబడి ప్రభుత్వాలు పాలన సాగించాలన్నారు. సొంత ఏజెండాను ముందుకు తీసుకువస్తే చెల్లదన్నారు. ఇటీవల కాలంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు భారత రాజ్యాంగాన్ని మార్పు చేయాలని ఆలోచన చేస్తున్నాయనీ, వారి ఆలోచనలు తిప్పికొట్టేందుకు ప్రతి ఒక్కరు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.. రిటైర్డ్ హెడ్మాస్టర్ ధూళిపాళ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వక్తృత్వపు పోటీలు నిర్వహించేందుకు జిల్లాలోని 120కి పైగా ఉన్నత పాఠశాలలు కళాశాలలను సందర్శించి విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పిటిఎస్ యు రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజశేఖర్ మాట్లాడుతూ యోగా పేరుతో, ధ్యానం పేరుతో ప్రభుత్వాలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాయన్నారు. విద్యార్థులకు ప్రజలకు అవసరమైన భారత రాజ్యాంగం పై అవగాహన కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయన్నారు. మరో రిటైర్డ్ హెడ్మాస్టర్ గడ్డం మురహరి రావు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి భారత రాజ్యాంగపై అవగాహన కల్పించాలనీ, విద్యార్థులకు వక్తృత్వపు పోటీలు నిర్వహించడం మంచి కార్యక్రమం అని కొనియాడారు. హరి ప్రసాద్ మాట్లాడుతూ 75 సంవత్సరాల తర్వాత ప్రజలకు భారత రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించాలని కార్యక్రమం తీసుకోవటం శుభ పరిణామం అన్నారు. లెక్చరర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ భారత రాజ్యాంగం పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ పోటీలలో ఎంత ఎక్కువ మంది పాల్గొంటే అంత మంచిదని తెలిపారు. ఈ సందర్భంగా ప్రచురించిన కరపత్రాన్ని మీడియా సమావేశంలో విడుదల చేశారు.