39 లక్షల మందికి ‘క్యాన్సర్ స్క్రీనింగ్ ‘
మిగిలిన వారికి 6 నెలల్లోగా పూర్తిచేసేలా ప్రణాళిక
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి
క్యాన్సర్ వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు చేపట్టిన అసంక్రమిత వ్యాధుల(NCD) నియంత్రణ, నివారణ కార్యక్రమం 4.0 (ఎన్సీడీ) ద్వారా ఇప్పటివరకు రాష్ట్రంలో 39 లక్షల మందికి స్కీనింగ్ పరీక్షలు చేసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన జారీచేశారు. ‘మహిళలకు నోటి, గర్భాశయ, రొమ్ము క్యాన్సర్ పరీక్షలు జరుగుతున్నాయి. మగ వారికి నోటి క్యాన్సర్ ప్రాథమిక (స్క్రీనింగ్ ) పరీక్షలు జరిగాయి. పరీక్షలు చేయించుకున్న వారిలో బ్రెస్టు క్యాన్సర్ 9,963 మంది, సర్వైకల్ క్యాన్సర్ 22,861 మంది మహిళలు అనుమానిత లక్షణాలు కలిగిన వారు ఉన్నారు. నోటి క్యాన్సర్ అనుమానిత లక్షణాలు కలిగిన వారు 26,639 మంది ఉన్నారు. వీరిని మరోమారు ఆయా ప్రాంతాల పీహెచ్ సి వైద్యులు పరీక్షలు చేసిన తరువాత అవసరమైన వారిని ఆయా జిల్లాల్లోని బోధనాసుపత్రులకు పంపుతున్నారు. అక్కడి ఆంకాలజిస్టులు మరోమారు క్యాన్సర్ అనుమానిత కేసులను పరిశీలించిన అనంతరం ‘వ్యాధి’ నిర్ధారణ చేస్తారు. తదనుగుణంగా చికిత్స మొదలవుతుంది. ఈ చికిత్స నిమిత్తం బోధనాసుపత్రుల్లో ప్రత్యేకంగా ‘222’ నెంబరుతో ఓపీ రూము కేటాయించారు’ అని మంత్రి శ్రీ సత్యకుమార్ వివరించారు. గత ఎన్సీడీ 3.0లో కంటే గత సెప్టెంబరు 17 నుంచి ప్రారంభమైన ఎన్సీడీ 4.0 స్క్రీనింగ్ పరీక్షల నిర్వహణ ప్రాధాన్యంపై కాస్త సానుకూల మార్పు కనిపిస్తుందని వెల్లడించారు.
మెప్మా రిసోర్స్ పర్సన్స్, వీఓఏల భాగస్వామ్యం
రాష్ట్ర వ్యాప్తంగా 18 ఏళ్లుపైబడిన వారు 4.18 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. వీరిలో ఎన్సీడీ 3.0 ద్వారా 2.92 కోట్ల మందికి పరీక్షలు చేశారు. అయితే… క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఫలితాలు అంచనాలకు దూరంగా ఉన్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ దృష్టికి రావడంతో మరోమారు క్యాన్సర్ గుర్తింపు స్క్రీనింగ్ చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రజల్లో అవగాహన పెంచాలని, సిబ్బందికి మరో మారు పునశ్చరణ తరగతులు నిర్వహించాలని స్పష్టం చేశారు. మంత్రి ఆదేశాలకనుగుణంగా వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది.
ప్రశ్నల కుదింపు
ఎన్సీడీ 3.0లో క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల గుర్తింపునకు సంబంధించిన ప్రశ్నలు 210 వరకు ఉన్నాయి. వీటిని ప్రస్తుతం 28 ప్రశ్నలకు పరిమితంచేశారు. ఆంకాలజిస్టుల ద్వారా సీహెచ్ ఓలు, ఎ.ఎన్.ఎం.లకు ప్రత్యేకంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సారి ప్రజల్లో పరీక్షల నిర్వహణపట్ల చైతన్యం తెచ్చేందుకు మెప్మా రిసోర్స్ పర్సన్స్, సెర్ఫ్ పరిధిలోని విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లను భాగస్వాములను చేస్తున్నారు.
సర్వైకల్ పరీక్షలు చేయించుకోవాలని ప్రత్యేక ఆహ్వానం
మహిళలు గర్భాశయ ముఖద్వార(సర్వికల్) పరీక్షలు చేయించుకునేందుకు ముందుకు రావడంలేదు. ఈ నేపథ్యంలో ‘మీ కుటుంబం కోసం ఒక చిన్న అడుగు వేయండి. ఆరోగ్య కేంద్రానికి రండి.’ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే క్యాన్సర్ ను నయం చేయొచ్చు ‘ అని కోరుతూ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేకంగా రూపొందించిన ఆహ్వాన పత్రికను ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ పేరుతో ముద్రించింది. వీటిని సర్వే నిర్వహణ సమయంలో గ్రామీణులకు ఇవ్వనున్నారు.
క్యాన్సర్ స్క్రీనింగ్ విధివిధానాల ఖరారులో ప్రముఖ క్యాన్సర్ వ్యాధి నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు సలహాలు, సూచనలను వైద్యారోగ్య శాఖ పరిగణలోకి తీసుకుంది.

