దోమలు పట్టుకోండి .. ఇలా..!

-ఇన్సెక్ట్ కలెక్టర్లకు ప్రాక్టికల్ ట్రైనింగ్
15 ఏళ్ల తరువాత పున :శిక్షణ
కీటకాల (దోమలు) సేకరణ ఉద్యోగుల్లో (ఇన్సెక్ట్ కలెక్టర్లు) నైపుణ్యాన్ని పెంచేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేకంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దోమల సంతతిని ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు అనుసరించాల్సిన పద్ధతులు ప్రస్తుత అవసరాలకు తగ్గట్టు మెళుకవలను వివరిస్తున్నారు. మలేరియా వచ్చేందుకు కారణమయ్యే ఎనాఫిలిస్ దోమ, డెంగీ/ చికెన్ గునియా కారణమైన ఎడిస్, పైలేరియా/మెదడు వాపు వచ్చేందుకు కారణమయ్యే క్యూలెక్స్ దోమల లార్వా దశను, పెద్ద దోమలను గుర్తించడంపై శిక్షణ కార్యక్రమంలో ప్రధానంగా వివరిస్తున్నారు. సీజనల్ వ్యాధుల నివారణలో భాగంగా 2011 సంవత్సరం తరువాత గడిచిన రెండు రోజులుగా ప్రాక్టికల్స్ కోసం ఈ శిక్షణ కార్యక్రమాలు మంగళగిరిలో జరుగతున్నాయి. ఇందులో భాగంగా మలేరియా కేసులు ఎక్కువగా ఉండే ఎన్టీఆర్ జిల్లా విజయవాడ శివారులోని జక్కంపూడి , ఇతర చోట్ల ఉండే కీటకాల రకాలు, వాటి ఉనికి, కదలికలు, వృద్ధి, గుర్తింపు అంశాలపై ఇన్సెక్ట్ కలెక్టరు బుధవారం తెల్లవారుజామున శిక్షణ పొందారు.
మంత్రి ఆదేశాల మేరకు…
వైద్య ఆరోగ్య శాఖలో వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది, ఇతర ఉద్యోగుల విధుల నిర్వహణకు తగ్గట్లు వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరిచేందుకు అవసరమైన శిక్షణ కార్యక్రమాల నిర్వహణకు మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు ఈ విషయంలో రాజీ ధోరణి అవలంబించవద్దని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలోనే 2011 తర్వాత ఇన్సెక్ట్ కలెక్టర్లకు శిక్షణకు అధికారులు చర్యలు చేపట్టారు.
‘మస్కిటో కలెక్షన్ ట్యూబ్ ద్వారా పట్టివేత
దోమలు పట్టుకోవడం ఎలా? అవి ఏ సంతతికి చెందినవి, వాటివల్ల వచ్చే సమస్యలపై ఉద్యోగులకు శిక్షణలో సీనియర్లు అవగాహన కలిస్తున్నారు. సాధారణంగా పట్టుకుంటే దోమలు ప్రాణాలు విడుస్తాయి. కానీ ‘మస్కిటో కలెక్షన్ ట్యూబ్ ద్వారా దోమలు పట్టుకుంటారు. గోడలు, మూలాలు, మరుగుదొడ్లు, ఇతర ప్రదేశాలపై విశ్రాంతి దశ (ముఖ్యంగా రాత్రి సమయాల్లో) ఉన్నప్పుడు టార్చ్ లైట్ సాయంతో ‘మస్కిటో కలెక్షన్ ట్యూబ్ను నోట్లో పెట్టుకుని పీల్చుతారు. అప్పుడు దోమలు ట్యూబ్లోనికి వెళ్లి తెరగా ఉన్నచోట అగిపోతాయి. వాటిని ప్రత్యేకంగా పరీక్షించి, పట్టుబడిన దోమలు ఏ రకం, వాటివల్ల ఎటువంటి జ్వరాలు వస్తాయన్న దానిపై అవగాహనకు వస్తారు.అలాగే వాటి నిరోధానికి చర్యలు తీసుకుంటారు నీటి గురించి శిక్షణలో సమగ్రంగా వివరిస్తున్నారు.

సత్వరం చర్యలు తీసుకునేలా..!
దోమల వల్ల వచ్చే సమస్యలను గుర్తించి, స్థానిక జిల్లా మలేరియా, ఇతర అధికారులకు తెలియచేసి, నిరోధ చర్యలు తీసుకునే విధంగా వీరు వ్యవహరిస్తారు. సమాచారాన్ని అనుసరించి, సదరు అధికారులు యాంటీ లార్వా ఆపరేషన్, ఇండోర్ స్పేస్, ఇండోర్ రెసిడ్యుల్ స్ప్రే, ఫాగింగ్ వంటి చర్యలు తీసుకుంటారు. ఇన్సక్ట్ కలెక్టరు తమ జోన్ పరిధిలో ‘హాటుస్పాట్’గా గుర్తించిన చోట్ల కీటకాల విస్తృతిని అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్, అదనపు సంచాలకులు సుబ్రహ్మణ్యేశ్వరి తెలిపారు.

అవేర్’ విధానంతో మరింత ఉపయుక్తం..
రాబోయే రోజుల్లో గడిచిన రెండు, మూడు సంవత్సరాల్లో ఎక్కువగా కేసులు వచ్చిన సదరు ప్రాంతాల గుర్తించి ముందుగానే ‘అవేర్’ (అడ్వాన్స్ వార్నింగ్ అడ్వైజరీ ఫర్ రిసిలియెంట్ ఎకోసిస్టమ్)
ద్వారా అలర్ట్ జిల్లా అధికారులకు వస్తుంది. దీనివల్ల ప్రాథమిక దశలోని అవసరమే చర్యలు తీసుకున్నందుకు వీలు ఏర్పడుతుంది మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్లలో కొందరు ఇన్సెక్ట్ కలెక్టర్లుగా కూడా కొన్నిచోట్ల వ్యవహరిస్తున్నారు, ఇన్సెక్ట్ కలెక్టర్ల కొరత ఉన్నచోట్ల వీరి సేవలు వినియోగిస్తున్నారు. దోమల వృద్ధి చెందకుండా ముందస్తు చర్యలు తీసుకునేందుకు ఈ శిక్షణ కార్యక్రమాలు బాగా ఉపయోగపడనున్నాయి.
