ఉద్యోగులకు సీఎం చంద్రబాబు దీపావళి కానుక
ఉద్యోగ సంఘాలతో చర్చల అనంతరం 1 డీఏ ప్రకటన
నవంబరు 1 తేదీ నుంచి అమలయ్యేలా డీఏ చెల్లింపు
పోలీసులకూ 2 విడతల్లో 1 సరెండర్ లీవ్ చెల్లింపు
హెల్త్ కార్డుల పూర్తి స్థాయి అమలుకు 60 రోజుల్లోగా పరిష్కారం
ఉద్యోగుల చెల్లింపులకు ఇది ఆరంభమే
పీఆర్సీ విషయం నేను చూసుకుంటా
రాష్ట్రాభివృద్ధి యజ్ఞంలో ఉద్యోగులూ భాగస్వాములే.
ఉద్యోగ సంఘాలతో భేటీ అనంతరం మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
అమరావతి, అక్టోబరు 18: దీపావళి పండుగ వేళ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు డీఏ కానుక అందించింది. నవంబరు 1 నుంచి పెంచిన డీఏ చెల్లించనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. శనివారం సీఎం క్యాంపు కార్యాలయంలో ఉద్యోగ సంఘాలు, మంత్రివర్గ ఉపసంఘంతో భేటీ అనంతరం ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేశారు. దీనికి ప్రతీ నెలా రూ.160 కోట్ల వ్యయం అవుతుందని సీఎం వెల్లడించారు. దీనిపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ “పోలీసులకు సరెండర్ లీవుల్లో ఒక ఇంస్టాల్ మెంట్ క్లియర్ చేస్తాం. 2 విడతల్లో ఈ చెల్లింపులు చేస్తాం. ఈ ఏడాది నవంబరులో ఒక విడత, 2026 జనవరిలో మరో విడతను చెల్లిస్తాం. 1 సరెండర్ లీవ్ చెల్లింపుల నిమిత్తం రూ.210 కోట్లు వ్యయం అవుతుంది. ఉద్యోగుల హెల్త్ కార్డు పూర్తి స్థాయిలో అమల్లో ఉన్న ఇబ్బందులను పరిష్కరిస్తాం. దీన్ని 60 రోజుల్లోగా పూర్తి చేసేలా కెబినెట్ సబ్ కమిటీ చర్యలు తీసుకుంటుంది. 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్స్ రిటైర్మెంట్ వరకు వినియోగించుకునే అవకాశం కల్పిస్తాం. చైల్డ్ కేర్ లీవ్స్ వినియోగంలో వయోపరిమితి లేదు. ఆర్టీసీ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న ప్రమోషన్లు క్లియర్ చేస్తాం. ఉద్యోగ సంఘాల భవనాలకు చెందిన ప్రాపర్టీ ట్యాక్స్ మాఫీ చేస్తాం. ఉద్యోగుల అందరి గౌరవాన్ని మరింత పెంచేలా కొన్ని నామన్ క్లేచర్లను రీ డెజిగ్నేట్ చేస్తాం”. అని స్పష్టం చేశారు.
గత పాలనలో ఉద్యోగులూ బాధితులే
“గత వ్యవస్థలో రాష్ట్రంతో పాటు ఉద్యోగులు కూడా బాధితులుగా మారారు. కనీసం ఉద్యోగులు తమ అభిప్రాయాలను కూడా చెప్పుకోలేని పరిస్థితిని గత పాలకులు కల్పించారు.ఉద్యోగుల బాధలు నాకు అర్ధం అయ్యాయి. విధ్వంసాన్ని పూడ్చేందుకు 20 ఏళ్లు పడుతుందని చెప్పాను. ప్రతీ నెలా 1 తేదీనే ఉద్యోగులకు వేతనం చెల్లిస్తున్నాం, పెన్షన్ చెల్లింపులు చేస్తున్నాం
రూ.15,921 కోట్ల బకాయిలు ఉద్యోగులకు క్లియర్ చేశాం. గతంలో పెట్టిన బకాయిలను రూ.23,556 కోట్లను సిస్టంలో అప్ లోడ్ చేశాం. రూ.9,371కోట్ల పాత స్కీమ్ లకు యూసీలు ఇచ్చాం. సూపర్ సిక్స్ లాంటి సంక్షేమ పథకాలను ప్రజలకు ఇస్తున్నాం. ఉద్యోగులకు మరింత సంక్షేమం అందివ్వాలన్న మనసు కూటమి ప్రభుత్వానికి ఉంది. మా ప్రభుత్వం ఉద్యోగులతో కలిసి పని చేస్తుంది. వెసులుబాటు వస్తే పీఆర్సీ కూడా ఇస్తాం. పీఆర్సీ విషయం నాకు వదిలిపెట్టమని ఉద్యోగులకు చెప్పాను. ఉద్యోగ సంఘాల సమస్యలపై కేబినెట్ సబ్ కమిటీ ఉంది. ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి వచ్చిన అంశాలపై నిర్ణయం తీసుకుంటాం. అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఉండాలనే ప్రభుత్వ ప్రయత్నం. ఇందులో ఉద్యోగులు కూడా భాగస్వాములే. గుంతలు పడిన రోడ్లు ఇతర రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని గుంతల మయం చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో గుంతలు పూడ్చి అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్నాం. దీపావళికి ఉద్యోగులకు శుభవార్త చెప్పాలనే ఉద్దేశంతోనే వారితో భేటీ అయ్యాను. రాష్ట్రానికి ప్రధాన రథచక్రాలు ఉద్యోగులే. 16 నెలలుగా అందిస్తున్న సుపరిపాలన ద్వారా మాత్రమే ఈ స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయి. ఆర్టీసీ సహా కొన్ని శాఖల ఉద్యోగులు అందిస్తున్న సేవలు అద్వితీయంగా ఉన్నాయి. మళ్లీ ఈ రాష్ట్రం వెనుకబడకూడదనే ధ్యేయంతో పని చేస్తున్నాం”అని ముఖ్యమంత్రి అన్నారు.
రాష్ట్రాభివృద్ధి యజ్ఞంలో ఉద్యోగులూ భాగస్వాములే
“గత పాలనలో జరిగిన విధ్వంసాన్ని సరిచేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోంది. రాష్ట్ర అభివృద్ధిలో ప్రధాన భాగస్వాములుగా ఉన్న ఉద్యోగులందరికీ ఎక్కడా ఇబ్బంది కలుగ కూడదనే ప్రయత్నం చేస్తున్నాం. ఆర్ధిక అంశాలపై ఎలాంటి దాపరికం లేదు. రాష్ట్రాభివృద్ధి యజ్ఞం చేస్తున్నాం. ఉద్యోగులతో కలిసే రాష్ట్రాన్ని తదుపరి అభివృద్ధి స్థాయికి తీసుకెళ్లగలం” అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. మరోవైపు సీఎంతో భేటీకి ఏపీఎన్జీవో, ఏపీజేఏసీ అమరావతి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, సచివాలయ ఉద్యోగ సంఘం సహా ఉపాధ్యాయ సంఘాల నేతలు హాజరయ్యారు. అటు మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.