యూరియా పంపిణీపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలి

రాష్ట్రంలో యూరియా నిల్వలు, సరఫరాలపై కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి అచ్చెన్నాయుడు
అధికారిక లెక్కలు – గ్రౌండ్ లెవెల్ నిల్వల్లో తేడా లేకుండా పర్యవేక్షణ చేయాలి
క్రిష్ణా, బాపట్ల, కడప జిల్లాల్లో సమస్యలను కలెక్టర్లు త్వరగా పరిష్కరించాలని ఆదేశం
అమరావతి, సెప్టెంబర్ 05: రాష్ట్రంలో యూరియా నిల్వలు, పంపిణీ, సరఫరాలపై క్రిష్ణా, ఎన్టీఆర్, శ్రీకాకుళం, బాపట్ల, విజయనగరం, కడప, ఏలూరు, శ్రీ సత్యసాయి జిల్లాల కలెక్టర్లతో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్లతో మంత్రి మాట్లాడుతూ జిల్లాల్లో యూరియా సరఫరా సమస్యలపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించి సమస్యలను అధిగమించాలని సూచించారు. అధికారిక లెక్కలు – గ్రౌండ్ లెవెల్ నిల్వల్లో ఎలాంటి తేడా లేకుండా పర్యవేక్షణ జరగాలని ఆదేశించారు. జిల్లాల్లో ఉన్న యూరియా నిల్వల వివరాలను తక్షణం అందించాలని కలెక్టర్లను ఆదేశించారు. క్రిష్ణా, బాపట్ల, కడప జిల్లాల్లో సమస్యలు ఎక్కువగా ఉన్నందున కలెక్టర్లు త్వరితగతిన స్పందించి పరిష్కరించాలన్నారు. నిల్వలు ఎక్కువున్న ప్రాంతాల నుండి డిమాండ్ ఉన్న ప్రాంతాలకు యూరియా సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, రవాణా ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. రబీ సీజన్ కోసం 9.5 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను ఇప్పటికే రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.
