Breaking News

కరోనా చికిత్సల కోసం రూ 1000 కోట్లు

 • అదనంగా 54 ఆసుపత్రుల ఏర్పాటు
 • క్రిటికల్‌ కేర్‌ కోసం అదనంగా 2380 బెడ్లు
 • కోవిడ్-9 సమీక్షా సమావేశంలో..
 • రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్  రెడ్డి 

అమరావతి: కోవిడ్‌ వైరస్‌ సోకిన వారికి సత్వర, మెరుగైన వైద్య సేవలు అందాలని సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ స్పష్టంచేశారు. అవసరాలకు అనుగుణంగా కోవిడ్‌కోసం ప్రత్యేకంగా చికిత్స అందించే ఆస్పత్రుల పెంపు, అందులో మౌలిక సదుపాయాల కల్పనకోసం వచ్చే 6 నెలలపాటు దాదాపుగా రూ.1000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. కరోనా కారణంగా తీవ్ర అస్వస్ధతకు గురైన వారికి అత్యుత్తమ వైద్యం అందించాలన్నారు.అత్యంత ఖరీదైన రెమ్‌డెసివిర్, టోసీలిజుమబ్‌ మందులు అందుబాటులో ఉంచాలని సీఎం ఆదేశించారు. దీనికోసం ఒక్కో రోగికి ఒక్కో డోసుకు దాదాపు రూ.35 వేలు వరకు ఖర్చవుతుందని అయినా ఖర్చుకు వెనుకాడవద్దన్నారు. విషమ పరిస్ధితులు ఎదుర్కొంటున్న వారందరికీ ఈ మందులు అందుబాటులో ఉంచాలని సీఎం స్పష్టం చేశారు. కోవిడ్‌ సోకిన వారికి వైద్య సేవల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా రానున్న 6 నెలల్లో పెద్ద ఎత్తున స్పెషలిస్టులు, డాక్టర్లు, పారామెడికల్‌ సిబ్బంది నియామకానికి ముఖ్యమంత్రి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.కోవిడ్‌ నివారణా చర్యలపై క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్షించారు. డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖమంత్రి ఆళ్లనాని, ఆశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌రెడ్డి సహా పలువురు ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు.

 • రికార్డుస్థాయిలో పరీక్షలు
  రాష్ట్రంలో కోవిడ్‌ పరీక్షలు, పాజిటివిటీ అంశాలను అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్రంలో రోజుకు రికార్డుస్థాయిలో 58వేల పరీక్షలు చేస్తున్నామన్నారు. కంటైన్‌ మెంట్‌ క్లస్టర్లు, కోవిడ్‌సోకడానికి ఆస్కారం అధికంగా ఉన్న వారిపై దృష్టిపెట్టి ఈపరీక్షలు చేస్తున్నామని, దీనివల్ల పాజిటివ్‌ కేసులు సంఖ్య పెరిగిందని వివరించారు. దాదాపు 90శాతం పరీక్షలు వీరికే చేస్తున్నామన్నారు. రానున్న కొన్నిరోజులు కేసుల తీవ్రత ఇలాగే కొనసాగి, తర్వాత తగ్గుముఖం పడుతుందని ముఖ్యమంత్రికి వివరించారు. ఈ అంకెలను చూసి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరంలేదన్నారు.
 • అదనపు ఆస్పత్రులు
  రాష్ట్రంలో ప్రస్తుతం రాష్ట్రస్థాయిలో 5 ఆస్పత్రులు క్రిటికల్‌ కేర్‌కోసం, అలాగే వైద్యం కోసం జిల్లాల్లో 84 ఆస్పత్రుల ఉన్నాయి. పెరుగుతున్న కేసుల దృష్ట్యా ఈ ఆస్పత్రుల సంఖ్య పెంచాలని ముఖ్యమంత్రి గత సమావేశంలో నిర్ణయించారు. ఈమేరకు మరో 54 ఆస్పత్రులను కోవిడ్‌ బాధితుల చికిత్స కోసం గుర్తించారు. దీంతో జిల్లాల్లో ఈ ప్రత్యేక ఆస్పత్రుల సంఖ్య 138కి చేరింది. కొత్తగా గుర్తించి ఈ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను సత్వరమే కల్పించాలని సీఎం అధికారులను ఆదేశించారు. దీనికోసం అవసరమైన నిధులను వెంటనే మంజూరుచేయాలన్నారు. జిల్లా కోవిడ్‌ ఆస్పత్రుల పెంపు ద్వారా మొత్తంగా 39,051 బెడ్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో దాదాపు 4300 ఐసీయూ బెడ్స్, 17380 నాన్‌ ఐసీయూ బెడ్స్‌ ( ఆక్సిజన్‌ సదుపాయం), నాన్‌ఐసీయూ బెడ్స్‌ 17,371 అందుబాటులోకి ఉన్నాయి. మొత్తంగా చూస్తే శ్రీకాకుళంలో 12, విజయనగరంలో 7, విశాఖపట్నంలో 22, ఈస్ట్‌గోదావరిలో 6, వెస్ట్‌ గోదావరిలో 9, కృష్ణాలో 13, గుంటూరులో 11, ప్రకాశంలో 9, నెల్లూరులో 7, చిత్తూరులో 12, అనంతపూర్‌లో 16, కడప 6, కర్నూలులో 7 ఆస్పత్రులు ఉన్నాయి. అలాగే కోవిడ్‌ కేర్‌సెంటర్లలో 72711 బెడ్లు అందుబాటులో ఉన్నాయని, కాని యాక్టివ్‌ కేసులు 34,556 మంది ఉన్నారని, వారికి సమర్థవంతంగా సేవలు అందించడానికి తగిన సదుపాయాలున్నాయని అధికారులు సీఎంకు వివరించారు.
 • క్రిటికల్‌ కేర్‌కోసం ఆసుపత్రుల పెంపు

రాష్ట్రస్థాయిలో క్రిటికల్‌కేర్‌ ఆస్పత్రుల సంఖ్యను 10కి పెంచాలంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలు అమలుపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఆయా ఆస్పత్రుల్లో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కొత్తగా తూర్పు గోదావరి జీజీహెచ్, పశ్చిమగోదావరిలో ఆశ్రం, గుంటూరు జీజీహెచ్, అనంతపూర్‌ జీజీహెచ్, శ్రీకాకుళం జీజీహెచ్‌ ఆస్పత్రులను రాష్ట్రస్థాయి కోవిడ్‌ ఆస్పత్రులగా మారుస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. తద్వారా క్రిటికల్‌కేర్‌ కోసం 2380 బెడ్లు అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు. అనంతపూర్, శ్రీకాకుళం తప్ప మిగిలిన మూడు ఆస్పత్రులనూ క్రిటికల్‌ కేర్‌ సేవలు అందించడానికి సిద్ధంచేశామన్నారు. మొత్తంగా 8 ఆస్పత్రులు క్రిటికల్‌ కేర్‌ ఆస్పత్రులుగా మార్చామన్నారు. ఈ ఆస్పత్రుల్లో అత్యుత్తమ ప్రమాణాలు పాటించాలని సీఎం స్పష్టంచేశారు. రాష్ట్రస్థాయిలో ఆస్పత్రులు కాబట్టి ప్రమాణాలు అదే స్థాయిలో ఉండాలన్న సీఎం, వచ్చే వారంరోజులు దీనిపై దృష్టిపెట్టాలని ఆదేశించారు. ఇక్కడ భోజనం, పారిశుద్ధ్యం కూడా మెరుగ్గా ఉండాలని ఆదేశించారు. మందులను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచాలని, కేసులు సంఖ్యకు తగినట్టుగా వైద్యులు, సిబ్బందిని ఉంచాలన్నారు.

 • అందుబాటులో అత్యవసర మందులు…

రాష్ట్ర ప్రభుత్వం వైద్యులు, ఇతర సిబ్బంది నియామకం కోసం జారీచేసిన నోటిఫికేషన్‌ కాకుండా, కోవిడ్‌ విస్తృతిని దృష్టిలో ఉంచుకుని వచ్చే 6 నెలల కాలానికి స్పెషలిస్టులు, వైద్యులు, పారామెడికల్, శానిటేషన్‌ కోసం నియామకాలకోసం సీఎం గ్రీన్‌ సిగ్నల్‌ఇచ్చారు. కోవిడ్‌ ఆస్పత్రుల్లో ఏం కావాలన్నా వెంటనే ఏర్పాటు చేయాలని, ఖర్చుకు వెనకాడవద్దని స్పష్టంచేశారు. అవసరమైన సిబ్బందినీ పెట్టుకోవాలన్న సీఎం,
మరణాలు తగ్గిచండంపై దృష్టిపెట్టాలన్నారు. కోవిడ్‌ ప్రత్యేక ఆస్పత్రుల్లో అత్యవసర మందులు ఉన్నాయా? లేవా? అని సీఎం ఆరాతీశారు. అత్యవసర మందులను ఆయా ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రెమ్‌డెసివిర్, టోసీలిజుమబ్‌ లాంటి మందులను పూర్తిగా అందుబాటులో ఉంచాలన్నారు. అవసరమైన స్థాయిలో మందులను కొనుగోలు చేయాలని చెప్పారు.
అలాగే క్వారంటైన్‌ సెంటర్లలో సదుపాయాలపై సీఎం దృష్టిపెట్టాలన్నారు. ప్రతిరోజూ ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుంటున్నామని అధికారులు వెల్లడించారు. దీనిపై ప్రతిరోజూ మానిటరింగ్‌ చేస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. పై అన్నిరకాల చర్యలకోసం వచ్చే 6 నెలల్లో దాదాపు రూ.1000 కోట్లు ఖర్చు అవుతున్నట్టు సమావేశంలో వెల్లడించారు. దీంతోపాటు ప్రతిరోజూ కోవిడ్‌ పరీక్షలకోసం రోజుకు రూ. 5 కోట్లు, క్వారంటైన్‌ సెంటర్లలో భోజనం, పారిశుధ్యంకోసం రూ. 1.5 కోట్లు ఖర్చు దాదాపు అవుతున్నట్టుగా అధికారులు చెప్తున్నారన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఇంత పెద్దమొత్తంలో ఖర్చు చేస్తోందని సీఎం చెప్పారు. కోవిడ్‌సోకిన వారికి మెరుగైన వైద్యం, సౌకర్యాలు, సదుపాయాలు విషయంలో ఎక్కడా రాజీపడొద్దని సీఎం అధికారులకు స్పష్టంచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *