రాష్ట్రంలో మరో విద్యుత్ ఉద్యమం
స్మార్ట్ మీటర్లు బిగింపుని ఆపాలి
ట్రూఆఫ్ చార్జీలు రద్దు చేయాలి
వామపక్ష పార్టీల హెచ్చరిక
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాను సారం ఆదానీ కంపెనీ స్మార్ట్ మీటర్లు బిగింపుని నిలుపుదల చేయకపోతే, మరో విద్యుత్ ఉద్యమం తప్పదని రాష్ట్ర ప్రభుత్వాన్నికి వామపక్ష పార్టీలు హెచ్చరించాయి. ఈ మేరకు ఆదివారం దాసరిభవన్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ సదస్సులో వామపక్ష పార్టీల రాష్ట్ర నాయకులు ప్రసంగించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే ట్రూ ఆఫ్ చార్జీలు, ఇంధన ఛార్జీలు, అదనపు ఛార్జీలు లాంటి ప్రజలపై భారాలను, విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగింపుని తక్షణమే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన విద్యుత్ ఉద్యమం మరోసారి తప్పదన్నారు. ఆ సందర్భంగా అధికారం కోల్పోయినట్లే మరోసారి అధికారం కోల్పోక తప్పదని హెచ్చరించారు. విద్యుత్ సంస్కరణల పేరుతో, విద్యుత్ సంస్థలను ప్రైవేటుకరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని విమర్శించారు. అదానీ లాంటి కంపెనీలకు అప్పగించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని దుయ్యబట్టారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రమాదకరమైన విద్యుత్ సంస్కరణలను, చట్ట సవరణలను నిలిపివేయాలన్నా రు. అదానీ కంపెనీతో జరిగిన సెకీ ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కూటమీ ప్రభుత్వం వాగ్దానం చేసినట్లుగా నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని, విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కోరారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు విస్మరిస్తే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. జగన్ ప్రభుత్వం ఆదానీ నుండి ముడుపులు తీసుకుని 20 సంవత్సరాల ఒప్పందంతో లక్ష కోట్ల భారాన్ని ప్రజలపై మోపారని ధ్వజమెత్తారు. స్మార్ట్ మీటర్లు బిగించడానికి వస్తే పగలగొట్టండని, అధికారంలోకొస్తే వీటిని రద్దు చేస్తామని మాట్లాడిన మాటలు, ప్రగల్బాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. గత సంవత్సరం ప్రభుత్వం ప్రజలపై చార్జీల పేరుతో 15,526 కోట్ల రూపాయలను రద్దు చేయాలన్నారు. సంవత్సర కాలంగా వినియోగదారుల నుంచి వసూలు చేసిన 2787 కోట్ల రూపాయల్ని తిరిగి చెల్లించాలన్నారు.


మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు మాట్లాడుతూ స్మార్ట్ మీటర్ల బిగింపు విద్యుత్ వినియోగదారులకి వర్తక, వాణిజ్య, పరిశ్రమ, వ్యవసాయ, గృహ వినియోగదారులకు పెనుభారాలు మోపుతుందన్నారు. స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రమాదకరమైన చర్యగా చెప్పారు. స్మార్ట్ మీటర్లు బిగింపుకు అయ్యే ఖర్చు సింగల్ ఫేస్ కి 9వేలు, త్రీఫేస్ కి 18వేలు చొప్పున అయ్యే ఖర్చులు 93 నెలల్లో వినియోగదారులనుండి వసూలు చేయడాన్ని తప్పుపట్టారు. న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి చిట్టిపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత ఉద్యమంలో అసువులు బాసిన విద్యుత్ అమరవీరులకు జోహార్లు అర్పించారు. 2019 – 25 మధ్య నిధులు 1500 కోట్ల రూపాయలను ట్రూ డౌన్ ద్వారా బిల్లులు తగ్గించాలని డిమాండ్ చేశారు. యూనిట్ కి 0.6 పైసలు నుండి రూపాయి పెంచిన విద్యుత్ సంకాన్ని తగ్గించాలన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చిగురుపాటి బాబురావు ఈ సదస్సులో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. జూలై 15,16 తేదీల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు జిల్లా స్థాయిలో పెట్టాలన్నారు. జులై 17, 22 మధ్య తేదీల్లో పట్టణ, మండల సదస్సులు నిర్వహించాలన్నారు. జులై 23 నుండి 29 తేదీల్లో ఇంటింటి ప్రచారం, సంతకాల సేకరణ చేయాలన్నారు. జులై 30 నుండి ఆగస్టు 4 వరకు వీధి, కాలనీ, పేట సమావేశాలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించాలన్నారు. ఆగస్టు 5వ తేదీ విద్యుత్ కార్యాలయాల వద్ద ధర్నాల నిర్వహించాలన్నారు. తీర్మానాన్ని రాష్ట్ర సదస్సుకు హాజరైన ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదించారు. లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు దీనావాహి హరినాథ్, న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఏం రామకృష్ణ, ఎంసిపిఐ(యు) రాష్ట్ర నాయకులు తూమాటి శివయ్య, ఖాదర్ బాషా, ఎస్ యుసిఐ రాష్ట్ర నాయకులు గోవిందరాజులు, ఆర్ఎస్పీ రాష్ట్ర నాయకులు జానకి రాములు, రెడ్ ఫ్లాగ్ రాష్ట్ర నాయకులు మరీదు ప్రసాద్ బాబు, విశ్రాంతి కలెక్టర్ బి. శ్రీనివాసులు, రైతు సంఘం జాతీయ అధ్యక్షులు రావుల వెంకయ్య తదితరులు ప్రసంగించారు. సదస్సుకు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి నరసింగరావు, ఏఐటియూసి రాష్ట్ర అధ్యక్షులు రాంపల్లి రవీంద్రనాథ్, మహిళా సంఘం నాయకులు దుర్గా భవాని, రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు యు.వీరబాబు, ఇఫ్టూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.పోలారి, తదితరులు అధ్యక్ష వర్గంగా వ్యవహరించి మాట్లాడారు.