Medical and Health

వ్యాక్సిన్ తోనే రేబిస్ వ్యాధి నివారణ

  • వ్యాక్సిన్ తోనే రేబిస్ వ్యాధి వ్యాప్తి చెందకుండా అరికట్టవచ్చు.
  • కుక్క కాటుకు గురై నిర్లక్ష్యం వహిస్తే మాత్రం ప్రాణానికే ప్రమాదం
డాక్టర్ సయ్యద్ నవీద్

రేబిస్ అనేది రేబిస్ అనే వైరస్ కారణంగా వస్తుంది. ఈ వైరస్ ప్రధానంగా కుక్కలు మరియు గబ్బిలాల నుండి మానవునికి సంక్రమిస్తుంది. ఇది సాధారణంగా జంతువుల నుండి మనుష్యులకు వ్యాపిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా రేబీస్ కారణంగా 56 వేల మంది ఏటా మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సమాఖ్య గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో 40 శాతం మందికి పైగా భాదితులు 15 సంవత్సరముల లోపు చిన్నారులే. ఇందుకు ప్రధాన కారణం రేబిస్ పై ప్రజలలో అంతగా అవగాహన లేకపోవడం ప్రధాన కారణం.

ఈ అవగాహనా లోపాన్ని సరి చేసి ప్రజలలో రేబిస్ కు సంబంధించిన అంశాలను ప్రజలలోనికి తీసుకెళ్లడానికి 28 సెప్టెంబర్ ను ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ రేబిస్ దినం గా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని డా. సయ్యద్ నవీద్, సీనియర్ కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్, రెనోవా హాస్పిటల్స్, లంగర్ హౌజ్ వారు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా డా. సయ్యద్ నవీద్ మాట్లాడుతూ రేబిస్ వ్యాధి పూర్తిగా అరికట్టగలిగేదని, కుక్కలు కరిచిన వెంటనే నియమిత కాలంలో రేబిస్ వ్యాక్సిన్ వేయించుకోగలిగితే వ్యాధి బారిన పడకుండా కాపాడుకోవచ్చని వివరించారు. అంటే కుక్క కరచిన వెంటనే 12 గంటల లోగా వ్యాక్సిన్ డోస్ అందించి తదుపరి వైద్యుల పర్యవేక్షణలో మిగిలిన డోస్ లను తీసుకొంటే వ్యాధి నుంచి పూర్తిగా రక్షించబడినట్లేనని తెలిపారు. అయితే ప్రజలలో దీనిపై ఉన్న పలు అపోహలు, అవగాహన లేమి తో పాటూ చిన్న గాయమే కదా దానికి చికిత్స తీసుకొంటే సరిపోతుందనే నిర్లక్ష్య దోరణితో పలువురు వ్యాక్సిన్ తీసుకోరని ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకు గాయం మానిపోయి మనిషి సాధారణంగా కనిపించవచ్చు కానీ వైరస్ మాత్రం మనషి శరీరంలోని చేరి తన ప్రభావం చూపడానికి వారం రోజుల నుంచి మూడు నెలల సమయం తీసుకొంటుందని వివరించారు.

ఒక్క సారి వైరస్ తన ప్రభావం చూపించడం ప్రారంభించిన వెంటనే రోగిలో జ్వరం, వాంతులు, తల తిప్పడం, తనపై నియంత్రణ కోల్పోవడం, గందరగోళం, పూర్తిగా స్పృహ కోల్పోవడం, శరీర అవయవాలు కదలించలేక పోవడం వంటి లక్షణాలు కనిపించడం ప్రారంభిస్తాయని డా సయ్యద్ నవీద్ వివరించారు. దీంతో పాటూ నీరంటే భయం కూడా రోగిలో కనిపిస్తుందని, అటు పిమ్మట లక్షణాలు నానాటికీ ఎక్కువై నెమ్మదిగా వైరస్ తన ప్రభావాన్ని మెదడుపై పూర్తిగా చూపగానే రోగికి ప్రాణాంతకంగా మారిపోతుందన్నారు. అందుకే కుక్క కరిచిన తర్వాత మనిషిలో ఇలాంటి లక్షణాలు కనిపించడం ప్రారంభిస్తే మాత్రం వ్యాధి నుంచి మనిషిని కాపాడడం పూర్తిగా అసాధ్యమని చెప్పారు.

ఎందుకంటే దీనికి చికిత్స లేదు కాబట్టి, కుక్క కరచిన తర్వాత గాయం చిన్నదా లేదా పెద్దదా అన్న దానితో సంబంధం లేకుండా వెను వెంటనే వైద్యులను సంప్రదించి రేబిస్ వ్యాక్సిన్ తీసుకోవడం అత్యంత కీలకమైన అంశమని డా. నవీద్ వివరించారు. అంతే గాకుండా వైద్యుల వద్దకు వెళ్లే ముందు ధారగా కారుతున్న పంపు నీటి క్రింద గాయాన్ని ఉంచి దానిని సబ్బుతో లేదా బెటాడిన్ తో పూర్తిగా శుభ్రం చేసుకోవాలని ఆయన అన్నారు. తర్వాత వెంటనే వైద్యున్న సంప్రదించి కుక్క కరచిన తర్వాత ఎంత త్వరగా అంటే ఎక్కువ లో ఎక్కువ 12 గంటలలోగా వ్యాక్సిన్ తీసుకోవడం అవసరమని, ఈ అంశంపై ప్రజలలో విస్తృతంగా అవగాహన కలిపించాల్సిన అవసరం చాలా ఉందని అన్నారు. నాలుగైదు డోసులలో తీసుకోవాల్సిన రేబిస్ వ్యాక్సిన్ వ్యాధిని పూర్తిగా అడ్డుకుని కుక్క కాటుకు గురైన వ్యక్తిని మరణం నుంచి ఖచ్చితంగా కాపాడుతుందనే ప్రజలు గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. అయితే కుక్క వలన కలిగిన గాయం లోతైనదైనట్లయితే వెంటనే రేబిస్ యాంటీ బాడీస్ తో కూడిన ఇంజెక్షన్లు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన వివరించారు. అదే సందర్భంలో కరచిన కుక్క యొక్క లక్షణాలను కూడా నిశితంగా గమనిస్తూ వైద్యుని దృష్టికి తీసుకొని రావాలని ఆయన తెలిపారు.

ఇక రేబిస్ బారిన పడకుండా మనల్ని రక్షించుకోవాలంటే మన చుట్టూ పరిసర ప్రాంతాలలో ఉన్న కుక్కలన్నింటికి కూడా రేబిస్ వ్యాక్సిన్ అందించాలని డా. నవీద్ సూచించారు. తద్వారా కుక్కలకు వ్యాధి సోకకుండా చూసుకోవడమే కాకుండా ప్రమాదవశాత్తు వాటి వలన గాయపడినా రేబిస్ వ్యాధి రాకుండా కాపాడకోవచ్చని అన్నారు. ఇందుకు ఆయా కాలనీలో నివసించే వారు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పారు. అయితే పలు సందర్భాలలో కరచిన కుక్కకు వ్యాక్సిన్ ఇచ్చారా లేదా అన్న విషయం

డాక్టర్ సయ్యద్ నవీద్

తెలుసుకోవడం కష్టం కాబట్టి కుక్క కాటుకు గురైన వెంటనే వ్యాక్సిన్ తీసుకోవడమే క్షేమమని మరో మారు స్పష్టం చేశారు.ప్రసంగం అనంతరం డా. సయ్యద్ నవీద్ కార్యక్రమానికి హాజరైన వారి ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *