ap news

మాతృ భాష అమ్మ… రాజ భాష హిందీ పెద్దమ్మ

రాజ్య భాషా విభాగం స్వర్ణోత్సవ సమ్మేళనంలో పవన్ కళ్యాణ్

వ్యాపారానికీ, పాపులారిటీకీ హిందీ కావాలి… నేర్చుకోవడానికి మాత్రం వద్దా?

రాజకీయాల కోసం మాత్రం హిందీని వ్యతిరేకిస్తాం

హిందీ మన ఉనికికి బలం

హిందీని వ్యతిరేకించడం భవిష్యత్ తరాల అభి వృద్ధిని అడ్డుకోవడమే

హైదరాబాద్ లో జరిగిన రాజ భాషా విభాగం స్వర్ణోత్సవ వేడుకల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

‘మనం మాట్లాడే ప్రతి భాష జీవ భాషే.. రాజ భాష మాత్రం హిందీనే. మనం ఇంట్లో మాట్లాడుకునేందుకు మాతృ భాష ఉంటే, ఇంటి సరిహద్దు దాటితే మాట్లాడుకోవడానికి హిందీ అవసరం అవుతుంది. మనమంతా విడిపోవడానికి దారులు వెతుకొంటుంటే దేశం మొత్తాన్ని ఏకం చేయడానికి హిందీ దారులు వెతుకుతుంది. అలాంటి భాషను స్వాగతిస్తున్నాను. హిందీ మనది.. హిందీని ప్రేమిద్దాం.. హిందీని ముందుకు తీసుకువెళ్దామని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. మాతృ భాష అమ్మ అయితే రాజ భాష హిందీ పెద్దమ్మ లాంటిదన్నారు. శుక్రవారం హైదరాబాద్, గచ్చిబౌలిలోని బాలయోగి స్టేడియంలో జరిగిన రాజ్య భాషా విభాగం స్వర్ణోత్సవ సమ్మేళనంలో విశిష్ట అతిధిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, రాజ్యసభ వైస్ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ “దేశ ప్రజలందరికీ రాజ భాష స్వర్ణోత్సవ శుభాకాంక్షలు. మన దేశం రకరకాల సంస్కృతులు, సంప్రదాయాల సమ్మేళనం. మనం తాగే నీటి రుచి ప్రతి కిలోమీటర్ కి మారిపోతే, మనం మాట్లాడే భాష మాత్రం ప్రతి అడుగుకీ మారిపోతుంది. ఈశాన్య రాష్ట్రం అయిన అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 50కి మించి భాషలు వాడుకలో ఉన్నాయి. వారంతా కామన్ ల్యాంగ్వేజ్ గా మాత్రం హిందీనే వాడతారు. మన దేశాన్ని బ్రిటీష్ వారు పాలిస్తున్న సమయంలో ఐరోపా ఖండం నుంచి ఎన్నో మిషనరీలు తెలుగు రాష్ట్రాలకి వచ్చాయి. తెలుగు భాషా పితామహులు శ్రీ గిడుగు రామ్మూర్తి పంతులు గారి వద్ద ఉత్తరాంధ్ర గిరిజన భాష అయిన సవర నేర్చుకుని ఆ భాషలో వారి ధార్మిక గ్రంథాలు అనువదించారు. మన భాషలు నేర్చుకోవాలన్న ఆసక్తి విదేశీయులకి ఉంటుంది. ఉద్యోగాలు, వ్యాపారాల కోసం ఇతర దేశాలకి వెళ్లినప్పుడు అక్కడ భాషలు నేర్చుకుంటున్నాం. మన దేశానికి చెందిన హిందీ భాష నేర్చుకోవడానికి మాత్రం భయపడుతున్నాం. హిందీ నేర్చుకునేందుకు ఎందుకు దాక్కుంటున్నాం? హిందీని ఎందుకు ద్వేషిస్తున్నాం? హిందీ నేర్చుకోమని ఎవరినీ బలవంతం చేయడం లేదు. హిందీ ఎవరైనా తేలికగా అర్ధం చేసుకోగలిగే భాష. ఉద్యోగాల్లో లబ్ది కోసం, సామాజిక మాధ్యమాల్లో పాపులర్ అవడం కోసం హిందీని వాడుకుంటాం. హిందీ ద్వారా లాభం ఉన్నప్పుడు దాన్ని ఏ సంకోచం లేకుండా ఉపయోగిస్తున్నాం. అదే హిందీని చిల్లర రాజకీయాల కోసం వ్యతిరేకిస్తున్నాం.

రాజ్య భాషా విభాగం స్వర్ణోత్సవ సమ్మేళనంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

పర్షియన్, ఉర్దూ భాషల్ని ఆమోదిస్తున్నాం… హిందీని బలవంతంగా రుద్దుతున్నారంటున్నాం

నాగరికత ముసుగులో ఆంగ్లం మనది అనుకుంటున్నాం. హిందీని మాత్రం మనది అని అనుకోవడం లేదు. ఒక బెంగాలీ గీతం జాతీయ గీతం అయ్యింది. ఒక పంజాబీ అయిన భగత్ సింగ్ భారతదేశానికి పోరాట స్ఫూర్తి అయ్యారు. రాజస్థాన్ లోని మహా రాణా ప్రతాప్ దేశ సరిహద్దులకు రక్షణ అయ్యారు. డాక్టర్ అబ్దుల్ కలాం గారు మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఎదిగారు. మద్రాస్ ప్రెసిడెన్సీ ద్రావిడ ప్రాంతానికి చెందిన పింగళి వెంకయ్య గారు చేసిన మువ్వన్నెల జెండా భారత దేశానికి తిరంగ అయ్యింది. విద్య, వైద్యం, వ్యాపార అవసరాల కోసం అన్ని భాషలు, మాండలికాల గోడల్ని చేధించుకుంటూ వెళ్లిపోతున్నాం. ఇలాంటి సమయంలో హిందీ వ్యతిరేకత రాబోయే తరాల అభివృద్ధిని పరిమితం చేయడమే అవుతుంది. హిందీ నేర్చుకోవడం మన ఉనికి కోల్పోవడం కాదు. మన ఉనికికి మరింత బలాన్ని చేకూర్చడం. మరో భాషని అంగీకరించడం ఓడిపోవడం కాదు.. కలసి ప్రయాణం చేయడం. హిందీ రాజ భాషగా ఉండడం సబ్మిషన్ కాదు యాడిషన్. ఆంగ్ల భాష చేర్చుకుని ఐటీ రంగంలో అభివృద్ధి సాధించాం. దేశంలో థర్డ్ హయ్యస్ట్ ల్యాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల ఉపయోగాలే ఉంటాయి. పర్షియన్, ఉర్దూ భాషలను ఆమోదించి హిందీని మా మీద రుద్దుతున్నారని మాట్లాడడం అవివేకం. హిందీ సినిమా వ్యాపార ఆదాయంలో 31 శాతం– హిందీలోకి అనువాదమైన దక్షిణ భారత భాషా చిత్రాల ద్వారానే వస్తోంది. తద్వారా దక్షిణాది చిత్ర పరిశ్రమకి ఆదాయం కూడా వస్తుంది. వ్యాపారానికి హిందీ కావాలి. నేర్చుకోవడానికి మాత్రం వద్దు అనే ధోరణి తగదు. హిందీ భాష పట్ల నాకున్న గౌరవం, కమిట్మెంట్ చూపేందుకే నేను ఖుషీలో ‘ఏ మేరా జహా..’ పాట పెట్టాను. మాతృ భాష తెలుగు అయితే రాజ భాష హిందీ అని చెప్పే ప్రయత్నం చేశా” అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణకు చెందిన హిందీ భాషావేత్త మాణిక్యాంబ గారు, తమిళనాడుకు చెందిన హిందీ భాషావేత్త అనంతకృష్ణన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WhatsApp