ap news

వైకాపా అధికారంలోకి ఎలా వస్తుందో చూస్తాం..

– మార్కాపురంలో ఛాలెంజి విసిరిన ‘పవన్ కళ్యాణ్’
– రూ.1290 కోట్ల వ్యయంతో తాగునీటి పథకానికి శంకుస్థాపన
ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. నరసింహపురంలో 12 ఎకరాల్లో రూ.1,290 కోట్లతో చేపట్టబోయే అతిపెద్ద తాగునీటి పథకానికి ఆయన శంకుస్థాపన చేశారు. దీని నిర్మాణం పూర్తయితే 31 మండలాల్లోని 1,387 గ్రామాలకు నీటి కష్టాలు తొలగనున్నాయి. ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్‌తో పాటు మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామి, ఆనం రామనారాయణరెడ్డి కూడా హాజరయ్యారు.

మార్కాపురంలో మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్

ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ప్రకాశం జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కరించడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టుకు రూ.4వేల కోట్లు కావాలి. భూ పరిహారానికి కొంత మొత్తం కావాలని పేర్కొన్నారు. ఈ తరుణంలో గత వైసీపీ ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవాదాయ భూములను గత ప్రభుత్వం ఇష్టారీతిన దోపిడీ చేసిందని పవన్ కల్యాణ్ విమర్శించారు. దేవుడి భూములు దోచుకున్న వాళ్లెవరూ మిగలరు. అన్యాక్రాంతమైన భూములపై విచారణ జరిపిస్తాం అని హామీ ఇచ్చారు. పశ్చిమ ప్రకాశంలో సమస్యలన్నీ పరిష్కరిస్తా, కానీ కొంత సమయం కావాలి. డబ్బుతో ఎన్నికల్లో గెలిచిన వాళ్లు, ప్రజా సమస్యలపై దృష్టిపెట్టడం లేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు లేకపోతే ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేవాళ్లు ఉండరు. కూటమిలో చంద్రబాబు, నాకు మధ్య స్పష్టత ఉంది. ఎవరిపాత్ర ఏంటనేది మాకు స్పష్టంగా తెలుసని పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు.

కూటమిలో ఎక్కువా తక్కువా కాదు..అందరూ సమానమే..:
కూటమిలో కొన్ని విభేదాలు ఉంటే ఉండొచ్చు. నాయకులు తిట్టుకుంటూ ఉండకూడదు. మాపై ఎంతో నమ్మకంతో బాధ్యత పెట్టారు. కూటమిలో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాదు. అన్ని వేళ్లు ఒకలా ఉండవు కానీ అన్ని వేళ్లూ కలిస్తేనే పిడికిలి అని తెలిపారు. ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి. మేము ఏ పార్టీని తగ్గించి మాట్లాడలేదు. కొందరు అధికారంలోకి వస్తే అంతు చూస్తామంటున్నారు. కానీ, అంతు చూడాలంటే మీరు మళ్లీ రావాలి కాదా అని పవన్ కల్యాణ్ ఎద్దేవా చేశారు. మీరు ఎలా వస్తారో మేమూ చూస్తాం అని ఛాలెంజ్ విసిరారు. ఈ తరుణంలో వైసీపీ మీద నాకేం కోపం లేదు. కానీ మనుషులను భయపెడితే ఊరుకోమని హెచ్చరించారు. మీకు 151 సీట్లు వచ్చినప్పుడు నేను రెండు చోట్లా ఓడిపోయినా అయిన ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎదిరించా అని పవన్ కల్యాణ్ తెలిపారు.

మంచినీటి పథకాన్ని ప్రారంభిస్తున్న పవన్ కళ్యాణ్, ఇన్ చార్పి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తదితరులు

సినిమా డైలాగులు సరదాకి మాత్రమే..:
ప్రేక్షకులను చీర్ అప్ చేయడానికి సినిమాల్లో డైలాగులు చెప్తామని, నిజ జీవితంలో అవి బాగుండవు అని తేల్చి చెప్పారు. ‘కుత్తుకలు కోస్తాం. మెడకాయలు కోస్తామంటే మేం ఏమైనా కోయించుకోవడానికి చొక్కా విప్పి చూపిస్తామా? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. నేను సినిమాల్లో నుంచి వచ్చిన.. కానీ నాకు సినిమా డైలాగులు చెప్పడం ఇష్టం ఉండదు. నేను చెప్పడానికి కూడా ఇబ్బంది పడుతా అన్నారు. ఈ క్రమంలో ‘సింహం గడ్డం గీసుకోదు.. నేను గీసుకుంటా’ అనే డైలాగులు సరదాకి మాత్రమే అని పవన్ కళ్యాణ్ తెలిపారు.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *