ap news

రాయలసీమను ఎడారిగా మార్చేందుకు చంద్రబాబు కుట్ర

  • ఆల్మట్టి, అప్పర్ భద్రపై మౌనం ఎందుకు?
  • తక్షణమే రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ పనులు తిరిగి ప్రారంభించాలి
  • పోలవరం ప్రాజెక్టా? లేక బ్యారేజీనా?
  • కూటమి నేతలను ఎక్కడికక్కడ నిలదీయాలి
రాయలసీమ నాయకులతో సజ్జల రామకృష్ణారెడ్డి

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నిర్మాణం కోసం అవిభాజ్య రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లా వైయస్సార్సీపీ నేతల సమావేశం.

కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న వైయస్సార్సీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి.

సమావేశంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ సాధన కోసం కార్యాచరణ ప్రణాళిక ఆమోదం.

అనంతరం మీడియాతో మాట్లాడిన వైయస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి

కడప, ఆంధ్రావని :  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను, ముఖ్యంగా రాయలసీమ రైతాంగ ప్రయోజనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పొరుగు రాష్ట్రాలకు తాకట్టు పెట్టారని వైయస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల వైయస్సార్సీపీ ముఖ్య నాయకులతో జరిగిన సమావేశంలో ‘రాయలసీమ ఎత్తిపోతల పథకం’ సాధన కోసం భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను ఆమోదించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ…
రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని తక్షణమే పునరుద్ధరించి, పూర్తి చేయడంతో పాటు, కర్ణాటక ప్రభుత్వం అక్రమంగా చేపడుతున్న ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపును అడ్డుకోవాలని, పోలవరం ప్రాజెక్టు ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41 మీటర్లకు తగ్గించడాన్ని వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్బంగా వైయస్ జగన్ హయాంలో 90 శాతం పూర్తైన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం అడ్డంగా నిలిపివేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా అసెంబ్లీలో మాట్లాడుతూ.. చంద్రబాబుతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకే ఈ పనులు ఆపేశామని చెప్పారని.. కేవలంతన వ్యక్తిగత కేసుల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం సీమను ఎడారిగా మార్చడానికి చంద్రబాబు సిద్ధపడ్డారు” అని సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. పక్క రాష్ట్రాలు అక్రమంగా ప్రాజెక్టులు కడుతుంటే చంద్రబాబు కనీసం అభ్యంతరం తెలుపుతూ లేఖ కూడా రాయకపోవడం దారుణమని ఆక్షేపించారు. కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచుతూ భూసేకరణ చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదని, అప్పర్ భద్ర వల్ల అనంతపురం జిల్లాకు జరగబోయే నష్టాన్ని ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం ప్రజలు కూటమి నేతలను ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు. ఈ పోరాటంలో భాగంగా వైయస్సార్సీపీ అన్ని పక్షాలను, మేధావులను, యువతను కలుపుకుని ఉద్యమిస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్బంగా ఇంకా ఏమన్నారంటే…

మూడు ఆంశాలు తీర్మానం..:
ఈ రోజు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన వైయస్సార్సీపీ ముఖ్యనాయకులతో సమావేశం అయ్యాం. ఈ సమావేశంలో మూడు ప్రధాన అంశాలపై తీర్మానం చేశాం. ఇందులో మొదటిది రాయలసీమ ఎత్తిపోతల పధకం నిర్మాణాన్ని కొనసాగించి, పూర్తి చేయాలి. రెండోది బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తుదితీర్పు రాకుండానే… కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచుతూ నిర్మాణం చేపడుతున్నట్టు అధికారికంగా ప్రకటించడంతో పాటు భూసేకరణ కోసం, నిర్వాసితులకు పరిహారం కూడా చెల్లించి ఖాలీ చేయించి డ్యామ్ పనులు మొదలుపట్టినట్లు సమాచారం ఉంది. ఎలాంటి అనుమతులు లేకపోయినా.. కేబినెట్ తీర్మానం చేసి బహిరంగంగా పనులు మొదలుపెట్టారు. దీనికి వ్యతిరేకంగా మహారాష్ట్ర సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే… తెలంగాణా ప్రభుత్వం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తీర్మానం చేసింది. అయినా కూడా మన రాష్ట్ర ప్రభుత్వంలో మాత్రం చలనం లేదు. అదే విధంగా అప్పర్ భద్ర వల్ల పూర్వ అనంతపురం జిల్లా పై తీవ్ర ప్రభావం కలుగుతుంది. దానిపై కూడా వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశాం. దాన్ని కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

పోలవరం కలలను కాలరాస్తున్న బాబు..:
ఇక పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు పెద్ద పెద్ద హామీలిస్తూ.. రూ.80 వేల కోట్లతో ఈ ప్రాంతానికి నీళ్లిస్తానని చెబుతున్నాడు కానీ వాస్తవానికి ఆ ప్రాంతంలోనే నీళ్లివ్వలేని పరిస్థితి తలెత్తింది. 45మీటర్ల ఎత్తులో ఉండాల్సిన ప్రాజెక్టును 41 మీటర్లకు తగ్గిస్తూ కేంద్ర కేబినెట్ తీర్మానం చేసింది, ఆ కేబినెట్ లో కూడా టీడీపీ పార్టీ ప్రతినిధులు ఉన్నా ఉలుకూపలుకూ లేదు. దీంతో పోలవరం ప్రాజెక్టు కలలను కూడా అడ్డంగా నరికేస్తున్న పరిస్థితి. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జనవరి మొదటి వారంలో తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి అక్కడ అసెంబ్లీలో మాట్లాడుతూ… తనకు, ఏపీ సీఎం చంద్రబాబుకు మధ్య జరిగిన ఒప్పందం మేరకు… ఈ ప్రాజెక్టు పనులు నిలిపివేస్తున్నారని చెప్పారు. ఇది రాయలసీమ వాసులకు తీవ్రమైన షాక్. ఈ నిర్ణయం రాయలసీమను ఎడారిగా మార్చనుంది. అది కూడా పూర్తి కావస్తున్న ప్రాజెక్టును తన కేసుల కోసం నిలిపివేయడం అత్యంత దారుణం. వైయస్.జగన్ హయాంలో 90 శాతం పూర్తైన ప్రాజెక్టును గుట్టుచప్పుడు కాకుండా ఏ ప్రయోజనాల కోసం చంద్రబాబు నిలిపివేశారు?
ఈ 20 నెలల కాలంలోనే రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ప్రాజెక్టులకు కోలుకోలేని దెబ్బ తీసిన చంద్రబాబు నాయుడు.. తన ప్రయారటీస్ కోసం ఈ ప్రాజెక్టులన్నింటినీ కట్టగట్టి పక్కన పెట్టారు. రాయలసీమ ఎత్తిపోతలపై చంద్రబాబు నిర్ణయంతో ఈ ప్రాంతానికి జరగనున్న నష్టం తెలిసి.. వైయస్.జగన్ పార్టీపరంగా పోరాటం చేయడంతో పాటు అన్ని పక్షాలను కలుపుకుని దీనిపై ఆందోళన చేయాలని, ప్రజలకు వాస్తవాలను తెలియజెప్పాలని ఆలోచన చేశారు.

రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం చేస్తున్న పోరాటమిది..:
వైయస్.జగన్ హయాంలో స్పిల్ వే వరకు 47.72 మీటర్లు చేస్తే.. పూర్తిస్దాయి కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు అయిన పోలవరాన్ని ఇప్పుడు 41 మీటర్లకు పరిమితం చేస్తే.. కేంద్రంలో భాగస్వామిగా ఉన్నా కూడా చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ కనీసం నోరు మెదపలేదు. దీంతో పోలవరం కేవలం ఓ బ్యారేజీగా మాత్రమే మిగలనుంది. ఈ నేపధ్యంలో నీటి సమస్య కేవలం రాయలసీమకు మాత్రమే కాకుండా రాష్ట్ర సమస్యగా మారింది. పోలవరం నుంచి ఉత్తరాంధ్రాకు నీళ్లు పోవాలి. అదే విధంగా కృష్ణా, గోదావరి ఆయకట్టను కూడా ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కూటమి లో భాగస్వామిగా ఉన్నా కూడా చంద్రబాబు ఈ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. నా హయాంలోనే పైనున్న రాష్ట్రాలు తమ ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడానికి బ్లాంక్ చెక్ ఇస్తున్నా అన్నట్టు చంద్రబాబు వ్యవహరిస్తున్నాడు. రాష్ట్రంలో ప్రతి రైతు దీని గురించి ఆలోచన చేయాలి. ప్రతి ఇంట్లోనూ దీనిపై చర్చ జరగాలి. రాష్ట్ర ప్రయోజనాలను పరరిక్షించుకోవడానికి జరుగుతున్న పోరాటమిది. మన హక్కులను పరిరక్షించుకోవడానికి చేస్తున్న పోరాటమిది. ఇందులో ప్రతి ఒక్కరూ చేయికలపాలి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు, కూటమిలో భాగస్వామ్యులైన జనసేన, బీజేపీ నాయకులను ఎక్కడకక్కడ నిలదీయాల్సి ఉంది. అలా చేయలేని పక్షంలో చంద్రబాబు ఆగడాలను అడ్డుకోలేం. ఎగువ రాష్ట్రాల చేస్తున్న పనులపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ కనీసం లేఖ కూడా రాయలేదు.

ఈ డిమాండ్ల సాధన కోసమే ప్రజాపోరాటం..:
రాయలసీమ ఎత్తివేతపోతల పథకం పనులను తక్షణమే మొదలుపెట్టాలి. పక్క రాష్ట్రాలు అన్యాయంగా, అక్రమంగా చేస్తున్న పనులను అడ్డుకోవడానికి వ్యతిరేకంగా న్యాయపోరాటం చేయాలి. ఎన్టీయే భాగస్వామిగా కేంద్రంపై ఒత్తిడి తీసుకుని వచ్చి ఆ పనులను ఆపించాలి. కేంద్రంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు తన బాధ్యతగా అదనంగా ప్రయోజనాలు తీసుకురావాల్సింది పోయి, ఉన్న ప్రయోజనాలను కూడా తాకట్టు పెడుతున్నాడు. వైయస్.జగన్ ప్రభుత్వ హయాంలో మేం కేంద్రంలో భాగస్వామి కాకపోయినా కూడా పోలవరం ప్రాజెక్టును 45 మీటర్లకు తీసుకువస్తే… చంద్రబాబు హయాంలో దాన్ని 41 మీటర్లకు కుదించడం దారుణం. లక్షలాది కోట్లు అప్పు చేసి.. ఏం చేస్తున్నారో తెలియడం లేదు. ఒక ప్రణాళిక లేకుండా… జరుగుతున్న పనులను నిలిపివేసి… భవిష్యత్తు పేరుతో ప్రస్తుతం సాకారం కాని ప్రాజెక్టులపై పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. రూ.80 వేల కోట్ల ప్రాజెక్టులు అంటూ హడావుడి చేస్తున్నారు. ఒకవేళ వాటిని అనుమతులు వస్తే… మొబలైజేషన్ అడ్వాన్స్ పేరుతో ఓ రూ.8వేల కోట్లు దోచుకుంటే.. మిగిలిన సంగతి తర్వాత చూసుకోవచ్చు అన్న ధోరణిలో ఉన్నారు. ఇదే పరిస్థితిని ఉపేక్షించాలా? మేధావులు, విపక్షాలు దీనిపై ఆలోచన చేయాలి. ఈ నేపధ్యంలో మా నాయకుడు వైయస్.జగన్ మొదలుపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలబెట్టుకోవడం అవసరం. అదే విధంగా రాష్ట్ర ప్రయోజనాలకోసం ఉద్దేశించిన పోలవరం ప్రాజెక్టు కోసం తన హాయంలో వైయస్.జగన్ అన్ని రకాల నిధులను రాబట్టుకొన్నారు. గతంలో ఎన్టీయేలో చంద్రబాబు భాగస్వామిగా ఉంటూ పాతరేట్లు ప్రకారం పోలవరం నిర్మాణ వ్యయాన్ని కుదించడానికి అంగీకరిస్తే.. వైయస్.జగన్ ప్రభుత్వ హయాంలో కొత్త రేట్లు ప్రకారం పెంచేలా విజయం సాధించారు. ప్రజలు ఇవన్నీ ఆలోచన చేయాలి. రైతులు ప్రయోజనాల కోసం వైయస్.జగన్ చేసిన కృషి ఎంత, ప్రస్తుతం చంద్రబాబు అనుసరిస్తున్న నిర్లక్ష్యపూరితమైన వైఖరిని గమనించాలి. పక్క రాష్ట్రాలు మన రైతుల ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరిస్తుంటే.. కనీసం మాట వరుసకు కూడా చంద్రబాబు దాన్ని వ్యతిరేకించకపోవడం దారుణం. అసెంబ్లీలో తీర్మానం చేయకపోవడం ద్వారా చంద్రబాబు తన ప్రాధాన్యలేంటో చెప్పకనే చెబుతున్నారు. కానీ రైతులు, రాష్ట్ర ప్రయోజనాలే మా ప్రయారిటీస్ అని మా పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయస్.జగన్ , వైయస్సార్సీపీ స్పష్టం చేస్తోంది. ఈ పోరాటంలో కలిసివచ్చేవారందరినీ ఉద్యమంలో కలుపుకుని పోరాటం చేస్తాం. ప్రజలందరినీ ఇందులో భాగస్వామ్యులను చేస్తాం. ఆ దిశగా రాయలసీమ పాత జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి వచ్చిన జిల్లాల అధ్యక్షులు, మాజీ ప్రజా ప్రతినిధులు, ఇతర నేతలంతా ఇవాళ సమావేశమయ్యాం. ఇందులో భాగంగా ఇప్పటికే పోతిరెడ్డిపాడు దగ్గర ఫిబ్రవరి 5న అవగాహన కలిగించడానికి శంఖం పూరించాం. ఇవాళ కార్యాచరణలో భాగంగా ప్రజలకు అవగాహన కలిగించడం, కలిసివచ్చే రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, నీటిపారుదల మీద అవగాహన ఉండి పోరాటం చేస్తున్న నాయకులు, మేధావులను భాగస్వామ్యలుగా చేసుకుని ప్రజలకు అవగాహన కలిగిస్తాం. కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపుస్తూ.. వారిపై ఒత్తిడి తీసుకొస్తాం. అందులో భాగంగా కూటమి నేతలు చేస్తున్న తప్పులను అప్పీల్ చేయడంతో పాటు వివిధ రూపాల్లో ఒత్తిడి తీసుకొస్తాం. అదేవిధంగా యువతను కూడా భాగస్వాములు చేసుకుని పోరాటం చేస్తాం. రానున్న కొద్ది రోజుల్లో మరలా తదుపరి కార్యాచరణను ప్రకటిస్తాం. మా పార్టీ అధ్యక్షుడు వైయస్.జగన్ ముందు ఈ ప్రతిపాదనలను ఉంచుతాం. మేము రాజకీయం చేయడం లేదు, రాష్ట్ర రైతాంగం హక్కుల కోసం పోరాడుతున్నాం. కూటమి ప్రభుత్వం తన తప్పులను సరిదిద్దుకునే వరకు, రాయలసీమ ఎత్తిపోతల పనులు మొదలుపెట్టే వరకు మా పోరాటం ఆగదు” అని సజ్జల రామకృష్ణారెడ్డి తేల్చి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *