gunturu

రాష్ట్ర రాజధాని జిల్లాలోనూ అమలు గాని ఎస్సీ ఎస్టీ యాక్ట్

దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు

రాష్ట్ర రాజధాని ఉన్న గుంటూరు జిల్లాలోనూ ఎస్సీ ఎస్టీ యాక్ట్ అమలు కావడం లేదని దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు నీలం నాగేంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు నగరంలోని దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ యాక్ట్ అమలుపై జరిగిన సమీక్ష సమావేశంలో పలు కేసుల్ని సమీక్షించారు. సమావేశానికి హాజరైన బాధితులతో నాగేంద్ర మాట్లాడారు, న్యాయపరమైన సలహాలు ఇచ్చారు. అనంతరం నాగేంద్రరావు మాట్లాడుతూ, పోలీస్ స్టేషన్లో కేసు నమోదయిన దగ్గర నుంచి, కోర్టుల్లో జడ్జిమెంట్ వచ్చేవరకు ప్రతి దశలోనూ జాప్యం జరుగుతుందన్నారు. చుండూరు మారణకాండ నేపథ్యంలో ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టానికి పురుడు పోసిన గుంటూరు జిల్లాలో, ఎస్సీ ఎస్టీ అమలు కాకపోవటం దారుణం అన్నారు. ఎస్సీ ఎస్టీ బాధితులు పెట్టే కేసులు ఫాల్సు గా రిఫర్ చేసినా కూడా, ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న బాధితులందరికీ ఎఫ్ఐఆర్ స్టేజి రిలీఫ్ ఇవ్వటం లేదన్నారు. ఫాల్స్ గా రిఫర్ చేసిన కేసుల రిఫర్ చార్జిషీట్లను కోర్టులో దాఖలు చేయకుండానే, బాధితులకు ఎండార్స్మెంట్ ఇస్తున్నారన్నారు. ఎస్సీ ఎస్టీ కోర్టుల్లో విచారణ జరిగే కేసుల్లో ఎస్సీ ఎస్టీ ఆక్ట్ కేసుల సంఖ్య కంటే, ఇతర కేసుల సంఖ్య ఎక్కువగా ఉందన్నారు.

గుంటూరులో 4 వేల కేసులు పెండింగ్

గుంటూరు జిల్లాలో 4 వేలకు పైగా కేసుల్లో పెండింగ్లో ఉన్నాయని, 6 వందల కేసుల్లో ఛార్జ్ షీటు దాఖలు చేయలేదన్నారు. గుంటూరు జిల్లాలో పెండింగ్ కేసుల క్లియరెన్స్ కు కనీసం ఐదుగురు ఎస్సీ ఎస్టీ డిఎస్పీలను ప్రభుత్వం నియమించాలన్నారు. సంచలనం సృష్టించిన కేసుల్లోనే ఎస్సీ ఎస్టీలకు తక్షణ రిలీఫ్ అందుతుందని, ప్రచారం లేని కేసులకు ప్రాధాన్యం ఇవ్వటం లేదన్నారు. మూడు సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీని నియమించలేదన్నారు. కనీసం అధికారులైన ఎస్సీ ఎస్టీ యాక్ట్ అమలను అధికారికంగా సమీక్షించలేదన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం రాజధాని జిల్లాలో అంటరాని చట్టంగా మారిపోయిందని, చట్టం అమలు కోసం మంగళవారం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియాతో సమస్యలు చర్చిస్తామన్నారు. ఎస్సీ ఎస్టీ కేసుల్లో పోలీసు నుండి ప్రభుత్వం నుండి స్పందన లేనివారు దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర కార్యాలయంలో సంప్రదించాలన్నారు. దళిత బహుజన ఫ్రంట్ జిల్లా అధ్యక్షులు సునీల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో, సీనియర్ న్యాయవాది కె. రాజేష్, దళిత బహుజన ఫ్రంట్ నాయకులు కొరివి వినయ్ కుమార్, ఐలా మాణిక్యాల రావు, రావినూతల కమల కుమారి, పొందుగల ప్రకాష్, లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డి. చంద్ర నాయక్, దళిత నాయకులు కాకుమాను రవి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *