నేటి నుంచి రెండో విడత ల్యాండ్ పూలింగ్
- రెండు గ్రామాల్లో భూ సమీకరణకు శ్రీకారం
- 7 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ కు అనుమతులు
- రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరి నారాయణ
రాజధాని ప్రాంతంలోని యండ్రాయి, వడ్డమాను గ్రామాల్లో బుధవారం నుంచి ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ప్రారంభించనున్నట్టు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరి నారాయణ తెలిపారు. 57వ సీఆర్డీఏ అథారిటీ సమావేశ వివరాలను ఆయన సచివాలయంలోని ప్రచార విభాగంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ రాజధాని అమరావతిలో రెండో దశ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను నిర్వహించ నున్నామన్నారు. ఏపీ సీఆర్డీఏ లో 754 పోస్టులు జీవో 81 ద్వారా 2015 ఏప్రిల్ లోనే మంజూరు చేశామనీ, వీటిలో రెగ్యూలర్, కాంట్రక్ట్ తదితర పోస్టులు ఉన్నాయని తెలిపారు. మార్పులు చేర్పులతో అథారిటీ ఆమోదం తెలిపిందన్నారు. రాజధాని ప్రాంతంలో భూమి లేని నిరుపేదలకు ఇచ్చే పెన్షన్ ను 7 గురు తల్లితండ్రులు లేని అనాథ మైనర్ లకు కూడా అందించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. వాస్తు ప్రకారం వీధి శూల ఉన్న 112 కమర్షియల్ ప్లాట్స్ ను మార్చుకునే వెసులుబాటు కు సీఆర్డీఏ అనుమతి ఇచ్చిందన్నారు. లబ్ధిదారుడు మరోకరికి ఆ ప్లాట్ ను అమ్మకం చేస్తే వారికి ఈ ప్లాట్ లు మార్చుకునే అవకాశం ఉండదన్నారు.
సీడ్ యాక్సిస్ రోడ్ మార్గంలో మంగళగిరి రోడ్ కు కనెక్టవిటీకి మధ్యలో 4.5 ఎకరాల భూమి ఇప్పటి వరకు ల్యాండ్ పూలింగ్ కు ఆయా రైతులు ఇవ్వలేదని మంత్రి నారాయణ తెలిపారు. ఫిబ్రవరి లోపు స్టీల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తవుతుంది..సీడ్ యాక్సిస్ రోడ్ నిర్మాణం వేగవంతం చేయడంలో భాగంగా ఆ 4.5 ఎకరాల భూమికి భూ సేకరణకు నోటీసులు ఇవ్వనున్నామని వివరించారు. నిబంధనల మేరకు ఆ భూమిని ప్రభుత్వం తీసుకునేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అమరావతి రాజధాని ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ చేసిన 34వేల ఎకరాల భూమిలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. 4026 అధికారుల భవనాల నిర్మాణంలో వేగం పుంజుకుందన్నారు. 5 అడ్మినిస్ట్రేటివ్ టవర్స్, అసెంబ్లీ, హైకోర్టు పనులు నిర్ణయించుకున్న గడువులోపు పూర్తి చేస్తామన్నారు.

అమరావతితో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్
అమరావతికి మరింత గుర్తింపు రావడానికి ఈ ప్రాంతంలో స్మార్ట్ ఇండస్ట్రీస్, ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుగుణంగా పని చేస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. రైల్వే ట్రాక్, ఇన్నర్ రింగ్ రోడ్, స్పోర్ట్స్ సిటీల నిర్మాణం కోసం 7 గ్రామాల్లో దశలవారీగా రెండో విడత ల్యాండ్ పూలింగ్ చేయనున్నామన్నారు. ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ అనంతరం ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పన పనులు ప్రారంభిస్తామన్నారు. వాటిలో ముఖ్యంగా రెండు వరుసల రహదారులు, అండర్ గ్రౌండ్ కేబుల్స్, వాటర్ లైన్స్ తదితర ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వడ్డమాను, హరిచంద్రాపురం, పెద్దపరిమి గ్రామాల పరిధిలోని 9097 .56 ఎకరాల పట్టాభూమి, 7.01ఎకరాల అసైన్డ్ భూమి, అదేవిధంగా పల్నాడు జిల్లాలోని నాలుగు గ్రామాల్లో మొత్తం 7465 ఎకరాలు పట్టా భూమి, 97 ఎకరాల అసైన్డ్ మొత్తంగా 16,666.57 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ తీసుకుంటున్నామని వివరించారు. రైతులకు ఇచ్చే ప్లాట్లు, మౌలిక వసతుల కల్పన తదుపరి మిగిలిన 2500 ఎకరాల భూమిలో స్పోర్ట్స్ సిటీ, రైల్వే ట్రాక్, ఇన్నర్ రింగ్ రోడ్ కు వినియోగిస్తామన్నారు.
స్వచ్ఛంధంగా ముందుకు వచ్చిన రైతులు
పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ అమరావతి రాజధాని నిర్మాణంలో పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని నాలుగు రెవెన్యూ గ్రామాలు తీసుకోవడంపై ఈ ప్రాంత రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. స్వచ్ఛంధంగా రైతులు ల్యాండ్ పూలింగ్ కు ముందుకు వస్తున్నారన్నారు. రైతులనుండి ఇటువంటి పాజిటివ్ స్పందన రావటం శాసన సభ్యుడిగా తనకు సంతోషదాయకమన్నారు. ల్యాండ్ పూలింగ్ పై అవగాహన కోసం 10 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించామని, ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయాన్ని రైతులు స్వాగతించారన్నారు. ప్రస్థుతం వైకుంఠపురం, పెద్దమద్దూరు, యండ్రాయి, కర్లపూడి గ్రామాల్లో నోటిపికేషన్ ప్రకటించడం జరిగింది. ఈ నాలుగు గ్రామాల్లో 9500 ఎకరాల్లో రెవెన్యూ ల్యాండ్ ఉంటే రైతులకు చెందిన భూమి 7500 ఎకరాలు ఉందన్నారు. బుధవారం నుండి ప్రారంభించే ల్యాండ్ పూలింగ్ ప్రక్రియలో భాగంగా యండ్రాయిలోని 1900 ఎకరాల భూమిని తీసుకోవడం జరుగుతుందన్నారు.
ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ మాట్లాడుతూ 57వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో ముఖ్యమైన 5 అంశాలపై నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. వాటిలో ప్రధానమైనవి ఏపీ సీఆర్డీఏలో 754 పోస్టుల ర్యాటిఫికేషన్‌కు అథారిటీ ఆమోదం తెలిపిందన్నారు. రాజధాని ప్రాంతంలో భూమి లేని నిరుపేద అనాథ చిన్నారులకు పెన్షన్ అందించడం, రివర్ ఫ్రంట్ ఏరియాలో మెరైన్ కోసం ఒక ఎకరా భూమి ఇచ్చేందుకు ఆమోదం లభించిందన్నారు. వీధి శూల ఉన్న 112 ప్లాట్ల ను మార్చడానికి అనుమతి లభించిందన్నారు.

