ఆగస్టు 25 నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

దీపం-2 పదకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నాము
రాష్ట్ర ఆహార & పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్
అమరావతి, జులై 29: వచ్చే నెల 25 నుండి 31 వ తేదీ వరకూ వారం రోజుల పాటు స్మార్టు రేషన్ కార్డులను పంపిణీ చేయున్నామని రాష్ట్ర ఆహార & పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ స్మార్టు రేషన్ కార్డులను రాష్ట్రంలోని 1,45,97,486 మందికి ఉచితంగా పంపిణీ చేయబోతున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోను స్థానికి శాసన సభ్యులు, జిల్లా స్థాయిలో మంత్రులు మరియు రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలో సభలు నిర్వహించి ఈ స్మార్టు కార్డులను పంపిణీ చేయనున్నామన్నారు.
దేశంలోనే ప్రప్రధమంగా 96.05 శాతం మేర రేషన్ కార్డుల కెవైసి ని పూర్తి చేసి దేశంలోనే రాష్ట్ర ప్రధమ స్థానంలో నిలిచినట్లు ఆయన తెలిపారు. ఐదు సంవత్సరాల్లోపు, 80 సంవత్సరాలు పైబడిన మొత్తం 11,47,132 మంది కెవైసి చేయాల్సిన పనిలేదన్నారు. రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులకు రాష్ట్ర వ్యాప్తంగా 16,08,612 దరఖాస్తులు రాగా వాటిలో 15,32,758 దరఖాస్తులను సానుకూలంగా పరిష్కరించడం జరిగిందని, కేవలం 4.72 శాతం దరఖాస్తులను మాత్రమే తిరస్కరించడం జరిగిందన్నారు .
ఈ ప్రక్రియ ద్వారా నూతనంగా 9,87,644 మంది తమ పేర్లను నమోదు చేసుకోవడం జరిగిందని, వీరితో కలుపుకుని లబ్దిదారుల సంఖ్య 4,29,79,897 కు చేరుకోవడం జరిగిందన్నారు. వీరిలో 2,68,23,200 మందికి కేంద్ర ప్రభుత్వం, 1,61,56,697 మందికి రాష్ట్ర ప్రభుత్వం రేషన్ అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. తద్వారా రాష్ట్రంలో రైస్ కార్డుల సంఖ్య 1,45,97,486 కు చేరుకోవడం జరిగిందన్నారు.
ప్రస్తుతం ఉన్న పాత రేషన్ కార్డుల విదానాన్ని డిజిటలైజ్ చేసి స్మార్టు రేషన్ కార్డులు జారీచేసేందుకు ప్రభుత్వం ఎంతో కసరత్తు చేయడం జరిగిందన్నారు. భద్రత, జవాబుదారితనం, పారదర్శకతతో కూడిన విధంగా డెబిట్, క్రెడిట్ కార్డు తరహాలో ఈ స్మార్టు కార్డులను రూపొందించామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆలోచన మేరకు మరియు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాన్ సూచనల మేరకు స్మార్టు రేషన్ కార్డులపై రాజకీయ నాయుకుల ఫొటోలు ఏ మాత్రం లేకుండా కుంటుంబ పెద్ద యొక్క ఫొటోతో పాటు సభ్యులు పేర్లు అన్ని ఆ కార్డులో పొందుపర్చడం జరిగిందన్నారు. క్యూఆర్ కోడ్ ద్వారా డైనమిక్ కీ రిజిస్టరుతోని అనుసందానం చేయడం జరిగిందని, తద్వారా ట్రాన్జాక్షన్ జరుగగానే సెంట్రల్ ఆఫీసులో నమోదు అయ్యే విధంగా ఈ కార్డును రూపొందించామన్నారు.
ఈ క్యూఆర్ కోడ్ స్మార్టు కార్డులు అమల్లోకి వచ్చిన తదుపరి రాష్ట్ర వ్యాప్తంగానున్న 26,796 రేషన్ షాపుల్లో ప్రతి నెలా 1 నుండి 15 వ తేదీ వరకు ఉదయం 8.00 గంటల నుండి మద్యాహ్నం 12.00 గంటల వరకు మరియు సాయంత్రం 4.00 గంటల నుండి రాత్రి 8.00 గంటల వరకు రేషన్ సరుకులు పంపణీ చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. అయితే 65 సంవత్సరాలు పైబడిన వృద్దులకు, ప్రభుత్వం పింఛన్లు పొందే దివ్యాంగులకు 26 నుండి 30 వ తేదీ వరకు వారి ఇంటి వద్దే రేషన్ సరుకులను గత మూడు మాసాల నుండి పంపిణీ చేయడం జరుగుచున్నదన్నారు. ఏఎస్ఆర్ జిల్లాలో కొన్ని సమస్యలు ఉన్నాయని తానే స్వయంగా ఆ జిల్లాలో పర్యటించి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ నూతన స్మార్టు రేషన్ కార్డులను లబ్దిదారులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
దీపం-2 పదకం విజయవంతంగా అమలు…..
గత ఏడాది నవంబరులో జరిగిన దీపావళి నుండి ప్రారంభించిన దీపం-2 పథకం విజయవంతంగా అమలు చేయడం జరుగుచున్నదన్నారు. మొదటి విడతలో 97.59 లక్షల గ్యాస్ సిలిండర్లను ఉచితంగా పంపిణీచేసి రూ.764 కోట్ల రాయితీ సొమ్మును లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి జమచేయడం జరిగిందన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుండి ప్రారంభమైన రెండో విడతలో ఇప్పటి వరకూ 93.46 లక్షల గ్యాస్ సిలిండర్లను ఉచితంగా పంపిణీచేసి రూ.747 కోట్ల రాయితీ సొమ్మును లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి జమచేయడం జరిగిందన్నారు. మరో రూ.35 కోట్లు అడ్వాన్సుగా ఆయిల్ కంపెనీల వద్దే ఉన్నట్లు తెలిపారు. రెండో విడత క్రింద ఇంకా సిలిండర్లు పొందనివారంతా ఈ నెలాఖరులోపు పొందాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆలోచనల మేరకు రాయితీ సొమ్మును నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకి జమచేసే ప్రక్రియను ప్రారంభించేందుకై ఎన్.టి.ఆర్., కృష్ణా జిల్లాల్లో పైలెట్ ప్రాజక్టును అమలు చేయడం జరిగిందన్నారు. ఈ జిల్లాలో దాదాపు 4,281 మంది లబ్దిదారులను గుర్తించి, నేరుగా వారి స్మార్టు ఫోన్ నుండే గ్యాస్ ఏజన్సీలకు చెల్లింపు జరిగే విధంగా పంజాబ్ నేషన్ బ్యాంక్ డిజిటల్ వాలెట్ విధానాన్ని అమలు చేయడం జరిగిందన్నారు. ఇప్పటి వరకూ 1,384 మంది ఈ విదానాన్ని ఉపయోగించుకున్నారని, 2,580 మంది సంబందిత యాప్ ను డౌన్లోడ్ చేసుకోవడం జరిగిందన్నారు. మూడో విడత కూడా పూర్తి అయిన తదుపరి ఈ విధానాన్ని పూర్తి స్థాయిలో అమలు పర్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇంత భారీ మొత్తంలో లావాదేవీలు నిర్వహిస్తున్నప్పటికీ ఇప్పటి వరకూ కేవలం 4,516 ట్రాన్జాక్షన్లు మాత్రమే ఫెయిల్ అయ్యాయని, మరో 86 వేల నాన్ ట్రాన్సఫర్బుల్ ఖాతాలను గుర్తించడమైందన్నారు. సంబందిత లబ్దిదారులు అందరూ వారి బ్యాంకు ఖాతా నెంబర్లు, ఫోన్ నెంబర్లను ఒకసారి చెక్ చేసుకోవాలన మంత్రి కోరారు.