హంస వాహనంపై శ్రీ కోదండరాముడి కటాక్షం
తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు గురువారం రాత్రి హంస వాహనంపై స్వామివారు దర్శనమిచ్చారు. రాత్రి 8 గంటలకు ప్రారంభమైన వాహన సేవ ఆలయ నాలుగు మాడ వీధుల్లో రాత్రి 10 గంటల వరకు జరగనుంది. ఆత్మానాత్మ వివేకం కలవానికి భగవదనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. హంస వాహనంలోని పరమార్థం ఇదే. హంసలో పాలను, నీళ్లను వేరుచేసే సామర్థ్యం ఉంది. భక్తులలో అహంభావం తొలగించి ‘దాసోహం’ అనే భావం కలిగించడానికే పరమహంస రూపానికి ప్రతీక అయిన హంసవాహనాన్ని స్వామివారు అధిరోహిస్తారు.
వాహనసేవలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, జెఈవో శ్రీ వీరబ్రహ్మం, ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో పార్వతి, ఏఈవో దుర్గరాజు, కంకణబట్టార్ ఆనందకుమార్ దీక్షితులు, సూపరింటెండెంట్ రమేష్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు మునిరత్నం, జయకుమార్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.