ap news

దైవభక్తి, దేశభక్తి పెంపొందించుకోవాలి

శ్రీవారి సేవలో వెంకయ్య దంపతులు

– వైభవోత్సవాల ద్వారా హైదరాబాద్ ప్రజలకు శ్రీవారి ఆశీస్సులు

– మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం.వెంకయ్యనాయుడు

ప్రతి ఒక్కరూ దైవభక్తి, దేశభక్తి పెంపొందించుకోవాలని, తద్వారా సమాజం సుభిక్షంగా ఉంటుందని, దేశం శక్తివంతంగా మారుతుందని మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాల్లో భాగంగా బుధవారం జరిగిన సహస్రదీపాలంకరణ సేవలో శ్రీ వెంకయ్య నాయుడు దంపతులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీ వెంకయ్య నాయుడు మాట్లాడుతూ హైదరాబాద్ ప్రజలకు శ్రీవారి ఆశీస్సులు అందించేందుకు దాతలు శ్రీ హర్షవర్ధన్‌, శ్రీ ఎస్‌ఎస్‌.రెడ్డి, శ్రీ వెంకటేశ్వర్‌రెడ్డి, శ్రీ సుబ్బారెడ్డి సహకారంతో టిటిడి శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు నిర్వహించడం ఎంతో సంతోషకరమన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో సద్భావన, సద్బుద్ధి, సదాచారం అలవడతాయని చెప్పారు. భారతీయ సంప్రదాయాలు ఎంతో గొప్పవని, ప్రజలందరూ వాటిని ఆచరించి పిల్లలకు కూడా అలవాటు చేయాలని కోరారు. ప్రజలందరూ వైభవోత్సవాల్లో పాల్గొని మంచి ప్రేరణతో పురోభివృద్ధి సాధించాలన్నారు. ప్రజలందరికీ శ్రీవారి ఆశీస్సులు కలగాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. ఈ ఉత్సవాల నిర్వహణకు కృషి చేసిన టిటిడి చైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డిని అభినందిస్తున్నట్టు తెలిపారు.

ప్రసంగిస్తున్న ముప్పవరపు వెంకయ్యనాయుడు

సహస్రదీపాలంకార సేవలో బకాసురుడిని వధిస్తున్న శ్రీకృష్ణుడి అలంకారంలో శ్రీనివాసుడి అభయం

హైదరాబాద్ లో టిటిడి నిర్వహిస్తున్న శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాల్లో రెండో రోజు బుధవారం సాయంత్రం సహస్రదీపాలంకార సేవలో బకాసురుడిని వధిస్తున్న శ్రీకృష్ణుడి అలంకారంలో  శ్రీనివాసుడు భక్తులకు అభయమిచ్చారు. స్వామివారు ఉల్లాసంగా ఊయలలో ఊగుతూ భక్తులకు కనువిందు చేశారు. నిత్యం అవిశ్రాంతంగా భక్తులకు దర్శనభాగ్యాన్ని ప్రసాదించే స్వామివారు సహస్రదీపాలంకార సేవతో సేద తీరుతారు.  ముందుగా వేద పండితులు చతుర్వేద పారాయణం చేశారు. ఆ తరువాత  టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీ గురజాడ మధుసూదనరావు బృందం అన్నమయ్య సంకీర్తనలను రసరమ్యంగా ఆలపించారు. ఇందులో ‘ గోవింద గోవిందయని…’, ‘హరి నీ ప్రతాపము…’, ‘అలరచంచలమైన…’ తదితర కీర్తనలున్నాయి. ఆ తరువాత మంగళవాయిద్యంతో వాద్యనీరాజనం సమర్పించారు.

శ్రీవారి సేవలో వెంకయ్య దంపతులు

ఆకట్టుకున్న కుమారి కన్యాకుమారి వయోలిన్ వాద్యసంగీతం

సహస్ర దీపాలంకరణ సేవ అనంతరం టిటిడి ఆస్థాన విద్వాంసురాలు, పద్మశ్రీ అవార్డు గ్రహీత కుమారి కన్యాకుమారి వయోలిన్ వాద్యసంగీతం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు వేదిక చుట్టూ స్వామివారు తిరుచ్చిపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు రాత్రి కైంకర్యాలు నిర్వహిస్తారు. రాత్రి 8.30 నుంచి 9 గంటల వరకు ఏకాంతసేవ జరుగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *