ap news

భూ నిర్వాసితుల పోరాటం ఉధృతం చేయాలి

బాధితులకు అండగా రైతు సంఘాలు నిలవాలి

విజయవాడ: రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పంట భూములు కోల్పోతున్న భూ నిర్వాసితుల పక్షాన రైతు సంఘాలు నిలవాలని రైతు సంఘాల నేతలు భావించారు. ఈ మేరకు కేఎల్ రావు భవన్లో రైతు సంఘాల నాయకుల, భూ నిర్వాసితుల రౌండ్ టేబుల్ సమావేశం ఆదివారం జరిగింది. సమావేశానికి ప్రముఖ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ అధ్యక్షత వహించారు. సమావేశంలో మాజీ మంత్రి, ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వడ్డే శోభనాధీశ్వరావు మాట్లాడుతూ శ్రీకాకుళంలో విద్యుత్ ప్లాంట్లకు, విజయనగరంలో కాకారాల పల్లి అణు విద్యుత్ ప్లాంట్లకు వేలాది ఎకరాలు భూములు కట్ట పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కి సొంత నిధులు, గనులు ఏర్పాటు చేయకుండా నిమ్మకు నీరు ఎత్తినట్లు వ్యవహరిస్తూ సమీపములోనే అనకాపల్లి మిట్టల్ కంపెనీకి 20వేల ఎకరాలు కట్టబెట్టడాన్ని, అన్ని రకాల మౌలిక వసతులు కల్పించి అభివృద్ధికి ప్రభుత్వం సహాయపడటం ఏ పాటి న్యాయమని, ప్రభుత్వ సంస్థలను నీరుగార్చి ప్రైవేటు వాళ్లకు అప్పగించడానికి ఈ చర్యలని ధ్వజమెత్తారు. గంగవరం పోర్టు, కాకినాడ ఇండస్ట్రియల్ కారిడార్, మచిలీపట్నం పోర్టు, గన్నవరం ఎయిర్ పోర్టు, ప్రత్యేక ఆర్ధిక మండళ్లు పేరుతో తదితర ప్రాంతాల్లో విస్తరణకు, వాటి అనుబంధ కంపెనీల అభివృద్ధికి భూములు కట్టబెట్టడం వల్ల పంటల పండే భూములు రైతుల ప్రయోజనాలు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు ఉపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాలో కరేడు గ్రామంలో ఇండో సొల్ సోలార్ ఎనర్జీ కంపెనీకి మూడు పంటలు పండే భూములు, అన్ని రకాల పంటలు పండే భూసారం ఉన్న భూములు కంపెనీలకు కట్టబెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కడప స్టీల్ ప్లాంట్ కు, లేపాక్షి నాలెడ్జ్ పార్కుకు వేలాది ఎకరాలు సేకరించడాన్ని తక్షణమే నిలుపుదల చేయాలన్నారు. 500 బయోగ్యాస్ కంపెనీలకు ఐదు లక్షల ఎకరాల భూమిని సేకరించి కట్టబెట్టడాన్ని బట్టి కూటమి ప్రభుత్వానికి వ్యవసాయం పట్ల, రైతులు పట్ల ఎంత చిన్నచూపు ఉందో ఈ విధానాలు ద్వారా అద్దం పడుతున్నాయన్నారు. ఒకవేళ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు ఇచ్చే కంపెనీలు ఏమైనా ఉంటే వారికి పంటలు పండని నిరుపయోగమైన భూములను ఏర్పాటు చేయాలన్నారు. మూడు పంటల పండే భూములను సేకరించడానికి తక్షణమే నిలుపుదల చేయాలన్నారు. పంటల పండే సారవంతమైన భూములు సేకరించడం వలన రైతులకు, కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు, చేతి వృత్తుల వాళ్లకు ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయన్నారు. ఉపాధి అవకాశాలు మెరుగుపరచక పోగా నష్టం చేసిన వాళ్ళం అవుతాం అని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ ఇప్పటికీ భూములు కంపెనీలకు అప్పజెప్పిన ఎడల ఆ భూముల్లో ఆ కంపెనీలు ఏర్పాటు చేయకపోతే తిరిగి రైతులకు వాపస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సారవంతమైన పంటలు పండే భూములను సేకరించడం వలన పంటల ఉత్పత్తి తగ్గుతుందని, ఆహార కొరత ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

విజయవాడలో నిర్వహించిన రౌండ్ టేబుల్ షమావేశం

 

అమరావతి రాజధానిలో కూడా సేకరించిన భూముల్లో అభివృద్ధికి నోచుకోకుండా నిరుపయోగంగా ఉంటే మరలా 50వేలు ఎకరాలు భూసేకరణ చేయాలనుకోవడం సరైన విధానం కాదని, మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తపిద్ధం చేసినట్లే అవుతుందని సూచించారు. భూ బ్యాంకులను, భూ పందిరాలను, భూ సేకరణలను తక్షణమే నిలుపుదల చేయాలని కోరారు. విజయనగరం జిల్లా కాకరాలపల్లి, శ్రీకాకుళం జిల్లా ఉద్దానం భూములు కోల్పోతున్న భూ నిర్వాసిత బాధితులు పాల్గొని గగ్గోలు పెట్టారు. గన్నవరం ఎయిర్ పోర్టు, అమరావతి రాజధాని లో భూములు కోల్పోయిన బాధితులు, కర్రేడు గ్రామంలో భూములు కోల్పోతున్న బాధితులు రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని వారి గోడును వెళ్ళబుచ్చారు. వారికి మద్దతుగా అండగా ఉండాలని రైతు సంఘాల నాయకుల్ని వేడుకొన్నారు. బాధితుల పక్షాన ఉద్యమాలు కొనసాగించాలని, వారికి అండగా రైతు సంఘాలు నిలవాలని, కలిసి వచ్చే రాజకీయ పార్టీలను కూడా కూడగట్టి భూ నిర్వాసితులకు అండగా రాజకీయ పోరాటాన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించాలని రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది. రాష్ట్రంలో భూ నిర్వాసితులకు అండగా భూ నిర్వాసితుల సంరక్షణ పోరాట కమిటీ ఏర్పాటైంది. ఈ పోరాట కమిటీలో భూనిర్వాసితులు, రైతు సంఘాల రాష్ట్ర నాయకులు, ప్రముఖ న్యాయవాదులు ఉన్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో రైతు సంఘాల నాయకులు వై కేశవరావు, ఎం వి కృష్ణయ్య, పి జమలయ్య, సింహాద్రి ఝాన్సీ, చిట్టిపాటి వెంకటేశ్వర్లు, రఘురాజు, డి హరినాథ్, డాక్టర్ కొల్లా రాజమోహన్, కొరిమి వినయ్ కుమార్, కెఎంఏ సుభాన్, మరీదు ప్రసాద్ బాబు, భూ నిర్వాసితులు రంగారెడ్డి, వసుంధర, మజ్జి చిన్న, కరేడు గ్రామ సర్పంచ్ తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *