
ప్రాజెక్టులపై మాట్లాడే హక్కు వైసీపీకి లేదు
-వాటర్మ్యాన్గా చంద్రబాబుకు గుర్తింపు
-వైసీపీ క్రెడిట్ చోరీకి పాల్పడుతోంది
-రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్
అమరావతి: రాష్ట్రంలోని ప్రాజెక్టులపై మాట్లాడే కనీసం హక్కు వైసీపీ నాయకులకు, పార్టీకి లేదని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ విమర్శించారు. వైసీపీ పాలనలో ప్రాజెక్టులకు బ్రేకులు పడితే.. కూటమి ప్రభుత్వ హయాంలో అవే ప్రాజెక్టులు పరుగులు పెడుతున్నాయని అన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో సాగునీటి ప్రాజెక్టులపై నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించిందని విమర్శించారు. ప్రాజెక్టులను పూర్తి చేస్తున్న కూటమి ప్రభుత్వంపై విమర్శలు తగదని హితవు పలికారు. ఇరు ప్రభుత్వాల హయాంలో జరుగుతున్న ప్రాజెక్టుల పురోగతిని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.
వైసీపీ హయాంలో గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు విరిగినా అప్పటి జగన్ రెడ్డి ప్రభుత్వం స్పందించలేదని మంత్రి గొట్టిపాటి ఆరోపించారు. గేటు ఏర్పాటు చేయకుండా ఇసుక దోపిడీకి నాటి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిచ్చిందని విమర్శించారు. ప్రజల నీటి అవసరాల కంటే వైసీపీ ప్రభుత్వానికి ధన దాహమే ముఖ్యమైందని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ వైసీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించిందని మంత్రి గొట్టిపాటి అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చే సమయానికి దాదాపు 70 శాతం పనులు పూర్తయినప్పటికీ.. ఐదేళ్లలో ఒక్క శాతం పనిని కూడా ముందుకు తీసుకెళ్లలేదని విమర్శించారు. పనులు నిలిచిపోయినా అప్పటి ప్రభుత్వంలో చలనం లేకపోవడం రాష్ట్ర ప్రజలు ఇంకా మరిచిపోలేదన్నారు.
