స్మార్ట్ మీటర్ల పై ప్రతిఘటనోద్యమం
ప్రజా సంఘాల వేదిక నిర్ణయం
13న విజయవాడలో రాష్ట్ర సదస్సు
రాష్ట్రంలో అదానీ కంపెనీ విద్యుత్ స్మార్ట్ మీటర్ల పేరుతో విద్యుత్ ఛార్జీల బాదుడు ప్రారంభమైందని ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమత్తారు. ఈ విధానాన్ని తిప్పి కొట్టేందుకు ప్రజా ప్రతిఘటనోద్యమం ఒకటే పరిష్కారమన్నారు. ఈ మేరకు గురువారం హనుమాన్ పేట దాసరి భవన్ లో రాష్ట్రస్థాయి ప్రజాసంఘాల ఐక్యవేదిక నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ ఒక రాష్ట్ర స్థాయి సదస్సుని ఈ నెల 13వ తేదీన నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్ర సదస్సు దాసరిభవన్లోని సెమినార్ హాల్లో ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. రాష్ట్రస్థాయి వామపక్ష నాయకులు, ప్రజాసంఘాల నాయకులు హాజరవుతారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లను ఇప్పటికే కృష్ణాజిల్లాలోని గుడివాడ ఎన్టీఆర్ కాలనీవాసులు ఆదానీ కంపెనీ సిబ్బంది స్మార్ట్ మీటర్ బిగింపుని తిరస్కరించారు. సిబ్బంది వద్ద ఉన్న స్మార్ట్ మీటర్ ని గుంజుకొని పగులగొట్టారు. అలాంటి ప్రజా ప్రతిఘటనోద్యమం అవసరమనే ప్రజా సంఘాల వేదిక నాయకులు అభిప్రాయపడ్డారు. అలాగే అనంతపురం జిల్లాలో రైతాంగం విద్యుత్ స్మార్ట్ మీటర్లను బిగింపుని తొలగించి, స్మార్ట్ మీటర్లు ధ్వంసం చేసిన సంఘటనను కూడా సమావేశంలో హాజరైన నాయకులు హర్ష వ్యక్తం చేశారు. స్మార్ట్ మీటర్లు వల్ల ప్రజలకు జరిగే నష్టాలను కూడా ఈ సందర్భంగా వివరించారు. ఇప్పటివరకు వాడుకున్న యూనిట్లు ప్రకారం విద్యుత్ ఛార్జీలు చెల్లించడం జరుగుతుంది. ఇందుకు భిన్నంగా రాబోయే రోజుల్లో స్మార్ట్ మీటర్లు బిగించడం వల్ల ప్రీపెయిడ్ సెల్ ఫోన్ రీఛార్జ్ వల్లే విద్యుత్ బిల్లులు ముందుగానే చెల్లించవలసి ఉంటుంది. స్మార్ట్ మీటర్లు చార్జీలు కూడా సింగిల్ ఫేస్ 9వేలు, త్రీ ఫేస్ 18వేలు వినియోగదారుడే 93 వాయిదాల పద్ధతిలో నెల నెల చెల్లించవలసి ఉంటుంది. అధిక వినియోగం సమయాలలో చార్జీ కూడా అధికంగా పడే అవకాశం ఉంది. విమాన టికెట్లు చార్జీల వలె. ప్రభుత్వ అనుమతితో అదానీ కంపెనీ సిబ్బంది స్మార్ట్ మీటర్లు ఇప్పటికే పంట పొలాల్లో బిగించడం జరిగింది. వ్యాపార వాణిజ్య సముదాయాల్లో కూడా బిగించారు. ఇక గృహ వినియోగదారుల వంతు వచ్చింది. గృహ వినియోగదారుడు అనుమతి లేకుండా బిగించకూడదు. విద్యుత్ సిబ్బంది పేరుతో బిగుస్తున్నారు. వీటి ఏర్పాటును వినియోగదారులు తిరస్కరించాల్సిన అవసరం ఉందని ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు ప్రజానీకానికి పిలుపునిచ్చారు. లేదంటే ప్రజలపై పెను భారాలు పడనున్నాయని తెలిపారు. ట్రూ ఆఫ్ చార్జీలు, ఇంధన చార్జీలు తదితర రకరకాల ఛార్జీల పేరుతో వినియోగదారుడికి పెనుభారంగా విద్యుత్ వినియోగం మారనుంది. ప్రభుత్వ సంస్థలైన విద్యుత్ సంస్థను ప్రైవేటీకరించబోతుందన్నారు. రాబోయే రోజుల్లో విద్యుత్ వినియోగం అత్యంత ఖరీదైన వస్తువుగా మారనుందని నాయకులు పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యుత్ సంస్కరణలను వ్యతిరేకిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి ఈ విధానాలను ప్రతిఘటించాలని ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాష్ట్ర సదస్సు నిర్వహించి, కార్యచరణ రూపొందించాలని నాయకులు అభిప్రాయపడ్డారు. ఆంధ్ర రాష్ట్రంలో గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఏ రకంగా విద్యుత్ ఉద్యమం రూపాంతరం చెందిందో, అలాంటి మరో ప్రజా ప్రతిఘటన స్మార్ట్ మీటర్ల వ్యతిరేక ఉద్యమాన్ని తీసుకురావాలని ప్రజాసంఘాల నాయకులు నిర్ణయించారు. ప్రతి వీధిలో, ప్రతి పేటలో విద్యుత్ స్మార్ట్ మీటర్ల ప్రతిఘటనోద్యమాన్ని నిర్మించాలని తీర్మానించారు. ఈ సమావేశానికి రైతు సంఘం సీనియర్ నాయకులు వై కేశవరావు అధ్యక్షత వహించారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రాంపల్లి రవీంద్రనాథ్, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి ఉమామహేశ్వరరావు, ఇఫ్టూ రాష్ట్ర అధ్యక్షులు పి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి కే పోలారి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి పి.జమలయ్య, ఇఫ్టూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రామకృష్ణ, ఏఐయుటియుసి కార్యదర్శి సుధీర్, టియుసిఐ రాష్ట్ర అధ్యక్షులు మరీదు ప్రసాద్ బాబు, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వెంకటసుబ్బయ్య, నగర అధ్యక్షులు ఆంజనేయులు, నగర ప్రధాన కార్యదర్శి మూలి సాంబశివరావు, సిఐటియు రాష్ట్ర కోశాధికారి కెఆర్ కె మూర్తి, ఏఐఎఫ్ టియు(న్యూ) జిల్లా నాయకులు లక్ష్మణరావు, ఇఫ్టూ నగర కార్యదర్శి ముని శంకర్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.